IRCTC Shri Ramayana Yatra | అయోధ్య టు రామేశ్వరం.. 17 రోజుల్లో పూర్తి రామాయణ యాత్ర!

IRCTC Shri Ramayana Yatra | శ్రీ రామాయణ యాత్ర పేరిట ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ యాత్రలో భాగంగా రామ జన్మభూమి అయోధ్య, సీతాదేవి జన్మస్థలం జనక్‌పూర్‌తో పాటు వారణాసి, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం వరకూ అన్ని చూసొచ్చేలా షెడ్యూల్ చేసింది.

IRCTC Shri Ramayana Yatra | అయోధ్య టు రామేశ్వరం.. 17 రోజుల్లో పూర్తి రామాయణ యాత్ర!

IRCTC Shri Ramayana Yatra | రామాయణంలో పేర్కొన్న పవిత్ర ప్రదేశాలను ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ మీకోసమే ప్రత్యేకంగా శ్రీ రామాయణ యాత్ర పేరిట ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో భాగంగా రామ జన్మభూమి అయోధ్య, సీత జన్మభూమి జనకపూర్ మొదలుకొని వనవాసంలో సీతారాములు పయనించిన వారణాసి, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం వరకు అన్ని చూసొచ్చేలా ఈ పర్యటనను షెడ్యూల్ చేసింది.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి మార్చి 30వ తేదీ మొదలయ్యే ఈ రామాయణ యాత్ర మొత్తం 16 రాత్రులు, 17 రోజులు కొనసాగుతుంది. భారత గౌరవ్ ట్రైన్ ద్వారా ఈ టూర్ నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రామ జన్మభూమి అయోధ్య, సీతాదేవి జన్మస్థలం జనకపూర్(నేపాల్), వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, గంగా హారతి, రామగాథలకు ప్రసిద్ధి చెందిన చిత్రకూట్, నాసిక్ పంచవటిలోని సీత గుహ, హంపిలోని అంజనాద్రి పర్వతం, రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాలను సందర్శించవచ్చు.

ప్యాకేజీ వివరాలు

ఈ ప్యాకేజీ ధరలను ఐఆర్‌సీటీసీ మూడు కేటగిరీల్లో విభజించింది. సుపీరియర్ (AC I), డీలక్స్ (AC II), కంఫర్ట్ (AC III)గా ప్యాకేజీలను ఆఫర్ చేస్తుంది.

సుపీరియర్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీ ధరను రూ.1,82,250గా నిర్ణయించింది. డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,64,940గా; ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,62,470గా నిర్ణయించింది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.1,50,250 చార్జ్ చేయనుంది.

డీలక్స్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీ ధరను రూ.1,68,535గా నిర్ణయించింది. డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,51,225గా; ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,48,755గా నిర్ణయించింది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.1,36,535 చార్జ్ చేయనుంది.

కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీ ధరను రూ.1,31,410గా నిర్ణయించింది. డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,14,100గా; ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,11,630గా నిర్ణయించింది. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.1,04,265 చార్జ్ చేయనుంది.

రోజు వారీ టూర్ ప్లాన్

మొదటి రోజు: ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 7 గంటలకు భారత గౌరవ రైలు బయల్దేరుతుంది. రైలులోనే భోజనం ఉంటుంది.

రెండో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం ఉదయం 9 గంటలకు అయోధ్య కంటోన్మెంట్ చేసుకుంటారు. అక్కడి నుంచి రామ్ కీ పైడికి చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో ఫ్రెష్ అయిన తర్వాత రామ జన్మభూమి మందిరం, హనుమాన్ గఢి దర్శనం ఉంటుంది. రాత్రికి అయోధ్యలోనే బస ఉంటుంది.

మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం చేసుకుని నందిగాం వెళ్లి వస్తారు. అనంతరం అయోధ్య నుంచి జనక్‌పూర్‌కు బయల్దేరి వెళ్తారు.

నాలుగో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం సీతామఢి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జనక్‌పూర్‌కు రోడ్డు మార్గంలో వెళ్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం జానకీ మందిరం, సీతారాముల కల్యాణ మండపం దర్శించుకుంటారు. సాయంత్రం గంగాసాగర్‌లో హారతిని వీక్షిస్తారు. రాత్రికి జనక్‌పూర్‌లోనే బస ఉంటుంది.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం రోడ్డుమార్గంలో వెళ్లి ధనుష్‌ధామ్, పరుషురాం కుండ్ దర్శించుకుంటారు. అలాగే జానకీ మందిరం, పునవురా ధామ్ చూస్తారు. రాత్రికి సీతామఢి రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరతారు.

ఆరో రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం బక్సర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రామరేఖ ఘాట్‌కు వెళ్లొస్తారు. రామేశ్వరనాథ్ ఆలయంలో దర్శనం అనంతరం వారణాసికి బయల్దేరతారు. అక్కడ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకుంటారు. రాత్రికి గంగా హారతి కార్యక్రమాన్ని వీక్షిస్తారు. రాత్రికి వారణాసిలోనే బస ఉంటుంది.

ఏడో రోజు: ఉదయం తులసి మందిరం, సంకటమోచన హనుమాన్ మందిరం దర్శించుకుంటారు. అనంతరం హోటల్‌కు వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. లంచ్ తర్వాత హోటల్ చెక్‌అవుట్ చేసి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తారు. అక్కడ సీతా సమాధి స్థలాన్ని సందర్శిస్తారు. రాత్రికి ప్రయాగ్‌రాజ్‌లోనే బస చేస్తారు.

ఎనిమిదో రోజు: ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం, బడే హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం బరద్వాజ్ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం శృంగి రిషి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి చిత్రకూట్ బయల్దేరి వెళ్తారు. రాత్రికి చిత్రకూట్‌లోనే బస ఉంటుంది.

తొమ్మిదో రోజు: ఉదయాన్నే రామ్ ఘాట్, గుప్త గోదావరిని దర్శించుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం సతి అనసూయ ఆశ్రమం సందర్శిస్తారు. అక్కడి నుంచి మానిక్‌పూర్ రైల్వే స్టేషన్‌కు బయల్దేరి వెళ్తారు. అక్కడి నుంచి నాసిక్‌కు బయల్దేరతారు.

10వ రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం మధ్యాహ్నానికి నాసిక్ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో దిగి ఫ్రెష్ అవుతారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.

11వ రోజు: నాసిక్‌లోని త్రయంబకేశ్వర్, పంచవటి ఆలయాను సందర్శిస్తారు. అక్కడి నుంచి హోసపేటకు బయల్దేరి వెళ్తారు.

12వ రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం సాయంత్రానికి హోసపేట రైల్వే జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో హంపికి చేరుకుంటారు. రాత్రికి హంపిలోనే బస ఉంటుంది.

13వ రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం అంజనాద్రి హిల్స్, విరూపాక్ష ఆలయం, విఠల్ ఆలయం సందర్శిస్తారు. తిరిగి హోసపేట జంక్షన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు రామేశ్వరం బయల్దేరతారు.

14వ రోజు: ఓవర్‌నైట్ జర్నీ అనంతరం రాత్రికి రామేశ్వరం చేరుకుంటారు. రాత్రికి అక్కడే హోటల్‌లో బస చేస్తారు.

15వ రోజు: ఉదయాన్నే రామేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ధనుష్కోడి దర్శనం ఉంటుంది. మధ్యాహ్న భోజనం అనంతరం ఢిల్లీకి బయల్దేరతారు.

16వ, 17వ రోజు: ఈ రెండు రోజులు కూడా రైలులోనే గడిచిపోతుంది. 17వ రోజు రాత్రి 11.30 గంటలకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో శ్రీ రామాయణ యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* రైలు ప్రయాణం
* 3 స్టార్ హోటల్ వసతి
* బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ (వెజ్)
* సైట్ సీయింగ్, లోకల్ ట్రాన్స్‌పోర్టు
* టూర్ గైడ్
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* ఎంట్రీ టికెట్లు

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* ప్రత్యేక దర్శనం చార్జీలు
* వ్యక్తిగత ఖర్చులు
*అదనపు ఫుడ్ ఐటెమ్స్
* టిప్స్

ముఖ్య నిబంధనలు

* 15 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే రూ.250 చార్జ్ చేస్తారు.
* అదే నాలుగు రోజుల గడువులో క్యాన్సిల్ చేస్తే 100 శాతం చార్జ్ చేస్తారు.
* ట్రైన్ షెడ్యూల్ మారవచ్చు.
* మొత్తం 150 మంది యాత్రికులతో టూర్ ఉంటుంది. ఈ జర్నీకి కనీస ప్యాసింజర్లు అవసరం.

Read More:

Sri Lanka Ramayana Yatra | హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాలివే!

IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!