Sri Lanka MP pension abolition| చిన్న దేశం..పెద్ద సందేశం..మనం చేయగలమా?

భారత్ కు పొరుగున ఉన్న చిన్న దేశం శ్రీలంక తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలకు పెను సవాల్ విసిరింది. ఎంపీల పెన్షన్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారత్, పాక్ సహా అసియా దేశాలలో చర్చనీయాంశమైంది.

Sri Lanka MP pension abolition| చిన్న దేశం..పెద్ద సందేశం..మనం చేయగలమా?

విధాత : భారత్ కు పొరుగున ఉన్న చిన్న దేశం శ్రీలంక తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలకు పెను సవాల్ విసిరింది. ముఖ్యంగా వెనుకబడిన లేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు..ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోంటున్న దేశాలకు ద్వీప దేశం శ్రీలంక నిర్ణయం స్ఫూర్తిదాయకమంటున్నారు ఆర్థిక నిపుణులు. పాలకుల అస్తవ్యస్థ రాజకీయ, ఆర్థిక విధానాలతో 2022లో దివాళా తీసి తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంకను ఆర్థికంగా మళ్లీ గాడిన పెట్టేందుకు ఆ దేశపు ప్రభుత్వం తాజాగా 49 ఏళ్ల నాటి పార్లమెంటరీ పెన్షన్ల చట్టాన్ని రద్దు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారత్, పాక్ సహా అసియా దేశాలలో చర్చనీయాంశమైంది.

ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం

ఆర్ధికంగా పెను సంక్షోభంలోకి వెళ్లిన సందర్బంలో శ్రీలంక ప్రజలు చేసిన డిమాండ్లలో ప్రజా ప్రతినిధులకు జీత భత్యాల రద్దు కూడా ఒకటి.  ప్రజా తిరుగుబాటుతో నాటి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పదవికి రాజీనామా చేశాక.. కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ ఎంపీల పెన్షన్లు రద్దు.  ఇచ్చిన హామీ మేరకు ఇపుడు అక్కడ ఎంపీల పెన్షన్లు రద్దు చేసి మాట నిలబెట్టుకుంది. దేశం క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ చట్టసభ సభ్యులకు పెన్షన్లు పొందే నైతికత లేదంటూ ఈ బిల్లుపై చర్చ సందర్భంగా న్యాయ శాఖ మంత్రి హర్షణ నానాయక్కర పేర్కొనడం గమనార్హం. మొత్తం 225 మంది సభ్యులు ఉన్న శ్రీలంక పార్లమెంట్ పార్లమెంట్ లో 154మంది సభ్యుల మద్దుతో ఈ బిల్లు ఆమోదం పొందింది. నలుగురు బిల్లును వ్యతిరేకించగా.. మిగతా సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.  శ్రీలంకలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన పార్లమెంట్‌ సభ్యులకు ప్రస్తుతం పెన్షన్‌ అందుతుంది. పెన్షన్ల రద్దు చట్టంతో ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న వారితో పాటు, కొత్తగా అర్హత సాధించిన వారికీ పెన్షన్లు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే మాజీ అధ్యక్షులకు ఇచ్చే ప్రయోజనాలను దిసనాయకే ప్రభుత్వం నిలిపివేసింది. ఇంటి అద్దె, అలవెన్సులు, పెన్షన్లు, రవాణా సౌకర్యాలను గతేడాది సెప్టెంబర్‌లోనే రద్దు చేసింది.

భారత్ లో సాధ్యమేనా..?

శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్, నేపాల్ వంటి అసియా దేశాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలోనే రోజులు నెట్టుకొస్తున్నాయి.  ఆ దేశాల స్థితిగతులు పక్కన పెడితే..భారత దేశం అప్పుల భారం కూడా పెరిగిపోతున్నప్పటికి..సాధిస్తున్న అభివృద్ది మాటునా ఆర్థిక సంక్షోభం కనిపించడం లేదు. అయితే శ్రీలంకతో పోల్చితే భారత్ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నమాట నిజమైనప్పటికి..భారత్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులకు వేతనాలు, పెన్షన్ లు, అలెన్స్ ల భారం మాత్రం కేంద్ర రాష్ట్ర ఖజానాలపై భారీగానే పడుతుంది. నిజానికి ప్రజాసేవ అంటూ రాజకీయాల్లో వస్తున్న వారిలో ప్రస్తుత రోజుల్లో మెజార్టీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు మిలీయనీర్లు, కోట్లకు పడగలెత్తినవారే ఉన్నారు.  అందులో భారీగా ఐటీ పన్నులు చెల్లించే వారు..బడా పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు ఉంటున్నారు.  మరి వారికి నెలకు జీతాలు, పెన్షన్లు, అలవెన్స్ లు అవసరమా అన్న చర్చ ఇప్పుడు శ్రీలంక నుంచి భారత్ లోకి బలంగా వ్యాపిస్తుంది.  సంపన్న వర్గాల వారే చట్టసభలకు ఎన్నికవుతున్నప్పుడు వారికి సామాన్య జనం కట్టే పన్నుల నుంచి జీతభత్యాల చెల్లింపు అవసరమా అన్న ప్రశ్న మరోసారి శ్రీలంక పుణ్యమా అని తెరపైకి వచ్చింది.

సామాజిక పెన్షన్ దారులకు, రిటైర్డు ఉద్యోగుల పెన్షన్ చెల్లింపులకు, పేదల విద్య, వైద్య సదుపాయాలు, కనీస మౌలిక వసతు కల్పనకు డబ్బులు లేక..నెలనెల అప్పులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న ప్రభుత్వాలు శ్రీలంక తరహాలో నిర్ణయాలు తీసుకోవాలన్న వాదన బలపడుతుంది. ప్రతీ అయిదేళ్ళకు కొత్త ప్రజా ప్రతినిధులు వస్తుంటారని…అలా ఎప్పటికప్పుడు వారిపై ఖర్చు భారం పెరిగిపోతోంది అన్న ఆందోళన వినిపిస్తుంది.  అంతేకాదు సామాజిక పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలులో ప్రజల  ఆర్థిక స్థోమతలు, వారు పన్నుచెల్లింపుదారులా అని చూసే ప్రభుత్వాలు .. సంపన్నులైనా ప్రజాప్రతినిధులకు మాత్రం లక్షల రూపాయల ప్రజాధనాన్ని జీతభత్యాలు, పెన్షన్ల రూపంలో కట్టబెట్టడం ఏమిటన్న అసహనం వ్యక్తమవుతుంది.

భారత్ పెరిగిన ప్రజాప్రతినిధుల జీత భత్యాలు

ఓ వైపు పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే దిద్దుబాటు చర్యలలో భాగంగా ఎంపీల పెన్షన్లు రద్దు చేయగా.. భారత్ లో మాత్రం కేంద్ర రాష్ట్రాలలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు భారీగా జీత భత్యాలు పెంచుకుంటూ వెలుతుండటం గమనార్హం.  తమ చేతిలోనే పని కదా అన్నట్లుగా చట్టసభ సభ్యులు జీతభత్యతాల పెంపు బిల్లులు ఆమోదించేసుకుంటూ సంక్షేమ..అభివృద్ది పనులకు వినియోగించాల్సిన ప్రజాధనానికి చిల్లు పెడుతున్నారు.  ఈ తరహా విధానాలు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల మీద శ్రీలంక తరహాలో వ్యతిరేకతను పెంచుతోందంటున్నారు విశ్లేషకులు.  జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు..విద్యార్థులకు బస్ పాస్ వంటివి జారీ చేయాలంటేనే సవాలక్ష కొర్రీలు పెడుతున్న పాలక వర్గాలు తమ ఆర్థిక స్థోమతలను విస్మరించి చట్ట సభలను దుర్వినియోగం చేస్తూ నిస్సిగ్గుగా తమ జీత భత్యాలు పెంచుకోవడం చూస్తుంటే.. బడితున్నోడిదే రాజ్యం అన్నట్లుగా కనిపిస్తుంది. ఈ పరిణామం రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యవస్థల లక్ష్యాలనే అపహాస్యం చేస్తుంది.

కేంద్రం ఏప్రిల్ 1, 2023 నుండి పార్లమెంటు సభ్యుల జీతాలు, భత్యాలు , పెన్షన్లను పెంచింది.  లోక్‌సభ లేదా రాజ్యసభ సభ్యుడికి నెలకు రూ.1.24 లక్షలు పొందుతారు. రోజువారీ భత్యం గతంలో రూ. 2,000 నుంచి రూ. 2,500కు పెంచారు.  మాజీ ఎంపీలకు చెల్లించే పెన్షన్‌ను ప్రస్తుతం నెలకు రూ.25,000 నుండి రూ.31,000కి పెంచారు.  ఐదు సంవత్సరాలకు పైగా ఉన్న వారికి ప్రతి సంవత్సరం సర్వీస్‌కు అదనపు పెన్షన్‌ను గతంలో ఉన్న రూ. 2,000 నుండి రూ. 2,500 కు పెంచారు. సిట్టింగ్, మాజీ ఎంపీలకు చెల్లించే జీతాలు, అలవెన్సుల సవరణను 2018 ఏప్రిల్‌లో ప్రకటించారు.

ఒక్కసారి చట్టసభకు ఎంపికైతే చాలు…

మన దేశంలో ఎవరైనా ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా ఒక్కసారి ఎన్నికైతే చాలు వారికి పదవీ కాలంలో జీత భత్యాలతో పాటు జీవిత కాలం పెన్షన్ లభిస్తుంది.  అది కూడా కాలానుగుణంగా పెరుగుతూ వస్తుండటం గమనార్హం.  పదవీ విరమణ పొందిన ఎంపీకి 31 వేల రూపాయలు పెన్షన్ అందుతోంది. అయిదేళ్ళకు మించి ఆ పదవిలో ఉంటే ప్రతీ ఏడాది అదనంగా 2,500 వంతున అలా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మాజీ ఎంపీ మరణిస్తే వాళ్ల జీవిత భాగస్వామికి లేదా డిపెండెంట్లకు ఎంపీ పొందే పెన్షన్‌లో 50 శాతం అందుతుంది. ఇక ఎమ్మెల్యే ఎంపీ ఇలా వేరు వేరు పదవులు నిర్వహించిన వారికి వేరు వేరు పెన్షన్లు కూడా ఇస్తున్నారని తెలుస్తుంది. జీత భత్యాలు పెన్షన్లతో పాటు ఉచిత ప్రయాణాలు, గృహ అలవెన్స్ లు, టెలిఫోన్,ఇంటర్నెట్, విద్యుత్ బిల్లులు, వాహనాల అలవెన్స్ వంటి చెల్లింపులు అదనం. ఉచిత వైద్యం, వారి సీనియారిటీ ఆధారంగా వారు ప్రభుత్వ గదులు, బంగ్లాలను పొందవచ్చు. అధికారిక వసతిని ఉపయోగించుకోని వ్యక్తులు నెలవారీ గృహ భత్యం పొందేందుకు అర్హులు.

ఇక నియోజకవర్గం కార్యాలయం నిర్వహణ నిమిత్తం ప్రతి ఎంపీకి రూ.87 వేలు నియోజకవర్గ భత్యంతో పాటు రూ.75 వేలు కార్యాలయ ఖర్చుల కోసం మంజూరు చేస్తారు. ఇక కార్యాలయంలో ఫర్నిచర్ కొనుగోలు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు.  వీటితోపాటు ఉచిత విమాన, రైలు ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తారు. ప్రజాప్రతినిధుల కోసం చేస్తున్న వ్యయం భారీగా ఉండటంతో భారత్‌లో కూడా ఎంపీ, ఎమ్మెల్యేల పెన్షన్లు రద్దు చేయాలని సామాజిక కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.  చట్టసభలకు వెళ్లినవారికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముదంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు పదవిలో లేనప్పుడు ఈ పెన్షన్ గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమని రాజకీయ పార్టీల వాదన.  శ్రీలంక పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులోనైనా భారత్ లో కూడా ఎంపీ, ఎమ్మెల్యేల పెన్షన్లు రద్దు చేసే బిల్లు వస్తుందా ? రాదా? అనేది వేచి చూడాల్సి ఉంది.

ఎమ్మెల్యేల జీత భత్యాలలో తెలంగాణదే పై చేయి !

ఎమ్మెల్యేల జీత భత్యాలు, పెన్షన్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఉన్నాయి. దేశంలో ఎమ్మెల్యేల జీత భత్యాల చెల్లింపులలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.  తెలంగాణ ఎమ్మెల్యేల జీతం నెలకు రూ.20 వేలు. వీటితో అలవెన్సులు కలిపి నెలకు రూ.2.50 లక్షలు పొందుతారు. అలాగే సభ సమావేశాలు, కమిటీ సమావేశాలకు హాజరయ్యే రోజులకు రోజుకు రూ.1,000 దినభత్యం ఇస్తారు.  పీఏలు, పీఆర్వోలకు వేతనం, ట్రావెల్ అలవెన్స్ అదనంగా అందిస్తారు.

ఇక ఎమ్మెల్యేల జీతాల విషయంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.  అక్కడి ఎమ్మెల్యేలు జీతభత్యాలు కలిపి నెలకు రూ. 2.10 లక్షలుగా ఉన్నాయి.  ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు ప్రతి నెల రూ. 1.87 లక్షల జీతంగా అందుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఎమ్మెల్యేలు ప్రతి నెల రూ. 34 వేలు జీతంగా తీసుకొంటున్నారు. దేశంలో అత్యల్ప జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేలగా త్రిపుర రాష్ట్రం చిట్ట చివరి స్థానంలో నిలిచింది.

తెలంగాణ, ఏపీలో పెన్షన్ రూ.30,000 నుంచి ప్రారంభమై, ప్రతి అదనపు సంవత్సరానికి రూ. 1000పెరుగుదలతో గరిష్టంగా రూ.50,000 పైగా ఉంటుంది. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పెన్షన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. పలు సందర్భాల్లో రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంటుంది.

కర్ణాటకలో ఒకేసారి 100శాతం పెంపు !

2025లో కర్ణాటక ప్రభుత్వం చట్ట సభ్యుల జీతాలను 100 శాతం పెంచుకుని వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.  కర్ణాటక ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు అందరికీ 100 శాతం జీతాలు పెరిగాయి.  ఏటా రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.92 కోట్ల అదనపు భారం పడనుంది.  కొత్త వేతనాల ప్రకారం ముఖ్యమంత్రి వేతనం రూ.75,000 నుంచి 1.5 లక్షలకు చేరింది.  మంత్రుల వేతనం 108 శాతం పెరిగి రూ.60,000 నుంచి రూ.1.25 లక్షలకు చేరింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది. వారి పెన్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. ఇవి మాత్రమే కాకుండా శాసన సభ్యుల నియోజకవర్గ భత్యం నెలకు రూ.60,000 నుంచి లక్ష రూపాయలకు పెంచారు. సవరించిన వేతనాల ప్రకారం అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్‌పర్సన్ వేతనం రూ.75,000 నుచి 1.25 లక్షలకు పెరిగింది. మంత్రుల ఇంటి అద్దె భత్యం నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచారు. ప్రయాణ అలవెన్స్ లు రూ.2.50లక్షల నుంచి 3.50లక్షలకు పెరిగింది. కర్ణాటక మినిస్టర్స్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ (అమెండమెంట్) బిల్లు, కర్ణాటక లెజిస్లేచర్ సేలరీస్, పెన్షన్స్ అండ్ అరవెన్సెస్ (అమెండమెంట్) బిల్లు సవరణ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీతాల పెంపుదల తప్పనిసరిగా మారింది.