Stalin Government| రాష్ట్రపతి నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన స్టాలిన్ సర్కార్
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ అధికారాలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో విజయం సాధించిన తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం తాజాగా రాష్ట్రపతి లక్ష్యంగా మరో కేసులో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల ప్రవేశ బిల్లు, 2021కి ఆమోదాన్ని నిలిపివేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్(Governor)అధికారాలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో విజయం సాధించిన తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం(Stalin Government) తాజాగా రాష్ట్రపతి లక్ష్యంగా మరో కేసులో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల ప్రవేశ బిల్లు, 2021కి ఆమోదాన్ని నిలిపివేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఇప్పటికే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వర్సెస్ స్టాలిన్ సర్కార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించి పంపిన 10బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా.. వాటిని రాష్ట్రపతికి పంపడాన్ని డీఎంకే ప్రభుత్వం సవాల్ చేసింది. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్ష నిర్ణయమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ బిల్లులను గవర్నర్‌కు తిరిగి పంపిన తేదీ నుంచే ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని స్పష్టం చేసింది. తిరిగి అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాలని తెలిపింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి/గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలని తీర్పిచ్చింది. బిల్లులను వెనక్కి పంపితే ఎందుకు అలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొంది. గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని వెల్లడించింది.
అయితే, తనను న్యాయస్థానం అలా ఆదేశించవచ్చా? అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టును వివరణ కోరారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని అధికరణం 143(1) కింద 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించి.. న్యాయ సలహా కోరారు. ఏదైనా ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశంపై 143(1) ప్రకారం సుప్రీంకోర్టు నుంచి న్యాయసలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది. దీంతో ఈ విషయంపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం కోరింది. రాష్ట్రాల నుంచి స్పందన స్వీకరించిన సుప్రీంకోర్టు ఇరువైపుల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ వివాదం ఇలా ఉండగానే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ కోర్సుల ప్రవేశ బిల్లుపై రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram