Telangana Kabaddi Association: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌లో రూ.1.20కోట్ల నిధుల గోల్‌మాల్ !

విధాత, హైదరాబాద్ : తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ లో రూ.1.20కోట్ల నిధుల గోల్ మాల్ వ్యవహారం వెలుగు చూసింది. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మాజీ సెక్రటరీ కె. జగదీశ్ యాదవ్, మాజీ ట్రెజరర్ కె.బి. శ్రీరాములు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కేటాయించిన నిధుల్లో రూ.60లక్షలు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని మాజీ జాయింట్ సెక్రటరీ తోట సురేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు ఖర్చు చేయాల్సిన నిధులు రూ.1.20 కోట్లు వారు దుర్వినియోగం చేశారని పోలీసులకు తోట సురేష్ ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ అబిడ్స్ పోలీసులు ఆ సంఘం మాజీ సెక్రటరీ కె. జగదీశ్ యాదవ్, మాజీ ట్రెజరర్ కె.బి. శ్రీరాములుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
గత 40 ఏండ్లుగా అసోసియేషన్‌లో ఉన్న ఈ ఇద్దరూ అక్రమాలకు పాల్పడ్డారని తోట సురేష్ ఆరోపించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టోర్నీల కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ కేటాయించిన నిధులను జిల్లా కమిటీలకు చేరకుండా జగదీశ్, శ్రీరాములు దుర్వినియోగం చేశారన్నారు. సంఘానికి అధికారికంగా ఒకే బ్యాంకు ఖాతా ఉండాలి..కానీ, మరో ఖాతా తెరిచి దాని ద్వారా సుమారు రూ. 60 లక్షలు విత్‌డ్రా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.