Sitakka | అంతర్జాతీయ సదస్సుకు మంత్రి సీతక్క

అంతర్జాతీయ స్థాయి మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్’ (VVGF) సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు ప్రత్యేక ఆహ్వానం లభించింది.

Sitakka | అంతర్జాతీయ సదస్సుకు మంత్రి సీతక్క

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

అంతర్జాతీయ స్థాయి మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్’ (VVGF)’ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళా నాయకత్వం, సామాజిక మార్పు, ప్రజా సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న నాయకులను వివిజీఎఫ్ ఈ సదస్సుకు ఆహ్వానిస్తుంది. మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం మంత్రి సీతక్క చేసిన కృషిని గుర్తిస్తూ సదస్సులో పాల్గొనాలని ఆ సంస్థ ఆహ్వానించించింది. ఈ మేరకు సీతక్క నెదర్లాండులో జరుగుతున్న సదస్సులో సోమవారం పాల్గొన్నారు.

ఈ సదస్సులో తెలంగాణలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను, గ్రామీణ అభివృద్ధి చర్యలను మంత్రి సీతక్క వివరించారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వాటి ఫలితాలను వెల్లడించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసినట్టు వివరించారు. దీంతో మహిళలకు ఆర్థికంగా చేదోడుగా నిలిచిందని చెప్పారు. ముఖ్యంగా చేతి వృత్తులపై ఆధారపడి జీవించే మహిళలకు ఈ పథకం ఎంతో భరోసా ఇచ్చిందన్నారు. మహిళలను లక్షాధికారులను చేసే విధంగా పొదుపు పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం తో పాటు బ్యాంకుల సహకారం తీసుకుంటున్న విషయాన్ని తెలియజేశారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ఈ పథకం పునాదిగా మారింది చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు, ప్రభుత్వం అమలు చేసే పథకాల లబ్ధిదారుల ఎంపికలో మహిళలను ఎంపిక చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.