తెలంగాణ జనాభా కొత్త లెక్కలు ఆసక్తి రేపుతున్నాయి. కేంద్రం ఇటీవల చేపట్టిన తొలి దశ జనగణన అంచనా ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 1 కోటీ 14 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా.. జనాభా 4.35 కోట్లు దాటినట్లు సమాచారం. ఇక 2011తో పోలిస్తే జనాభా 85 లక్షలు, కుటుంబాల సంఖ్య 31 లక్షలు పెరిగినట్లుగా తాజా గణంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో ఓఆర్‌ఆర్ లోపల గ్రేటర్ హైదరాబాద్‌లోనే దాదాపు 36 లక్షల కుటుంబాలు, , ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10.43 లక్షల కుటుంబాలుఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్క హైదరాబాద్ మహానగరం పరిధిలోనే జనాభా కోటిన్నరకు చేరినట్లు అంచనా. అయితే అధికారికంగా 2027 జనగణన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర జనాభా లెక్కలు వెల్లడికావాల్సి ఉంది.
సమగ్ర కుటుంబ సర్వేలో కంటే అధిక జనాభా..
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు రెండుసార్లు సర్వేలు నిర్వహించాయి. 6 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే, కులగణన నిర్వహించింది. అందులో రాష్ట్ర జనాభా 3.55 కోట్లుగా తేలింది. అయితే ఆ సమయంలో 3 శాతం ప్రజలు సర్వేకు సహకరించలేదని ప్రభుత్వం తెలిపింది. అప్పుడు ప్రభుత్వం రాష్ట్ర జనాభా దాదాపు 3.65 కోట్లలోపే ఉన్నారని భావించింది. కానీ తాజా జనగణన సర్వే ప్రకారం ఆ సంఖ్య సుమారు 4.35 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో రాష్ట్రంలో బీసీలు 56.33 శాతం, ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నట్లుగా వెల్లడైన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి జన గణన..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతా కేంద్రం నుంచి జరుగుతున్న తొలి జనగణన ఇదే కావడం విశేషం. ప్రస్తుతం తొలి దశ జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యింది. జనాభా లెక్కల్లో భాగంగా మొదటి దశలో ఇంటింటికీ తిరిగి కుటుంబాలను, భవనాలు, ఇళ్లు, ఇతర అన్ని రకాల కట్టడాలను నమోదు చేశారు. ఈ ప్రక్రియను మే 11 నుంచి జూన్ 9 వరకు జరిపారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో వ్యక్తిగతంగా జనాభా వివరాలు సేకరిస్తారు. వచ్చే నెలలో నల్లొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి జిల్లాలో పినపాక, హైదరాబాద్ శివారులోని రామచంద్రపురంలో ప్రయోగాత్మకంగా రెండో దశ జనగణన నిర్వహిస్తారు. దీనిని ఆన్లైన్లో నమోదు చేసుకోనున్నారు. అయితే ఈ పైలట్ ప్రాజెక్టులో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దుకుని, 2027 ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు 3 రోజుల క్రితమే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
2010-11లో కేంద్ర ప్రభుత్వం చివరగా అధికారికంగా జనాభా లెక్కలను సేకరించింది. ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రం ఉంది. అప్పుడు తెలంగాణ ప్రాంతం మొత్తం జనాభా 3.50 కోట్లు ఉండగా, కుటుంబాలు 83.03 లక్షలుగా తేలింది. కేంద్రం నిర్వహించి తొలి దశ జనగణనలో రాష్ట్ర జనాభా అదనంగా 85 లక్షలు, కుటుంబాల సంఖ్య 31 లక్షలు పెరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఉమ్మడి జిల్లాల ప్రకారం కుటుంబాల సంఖ్యను, జనాభాను ప్రకటించారు. గత లెక్కల్లో 12.35 లక్షల కుటుంబాలతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా 10.43 లక్షల కుటుంబాలతో ప్రథమ స్థానంలో ఉండటం విశేషం.
