Maha Vikas Aghadi । మహా వికాస్‌ అఘాడీకి ఉద్ధవ్‌ గుడ్‌బై? ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన సంజయ్‌ రౌత్‌

Maha Vikas Aghadi । మహా వికాస్‌ అఘాడీకి ఉద్ధవ్‌ గుడ్‌బై? ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన సంజయ్‌ రౌత్‌

Maha Vikas Aghadi । మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్రంలోని మహా వికాస్‌ అఘాడీ (MVA)లో చిచ్చు రేపుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలక భాగస్వామ్య పక్షమైన శివసేన (ఉద్ధవ్‌) నాయకత్వం ఎంవీఏ నుంచి బయటకు రావాలని పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. పరాజయం పాలైన నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించిన సమయంలోనే ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి. అఘాడీలో ఉండటం వల్ల పార్టీకి ఏమైనా లాభం జరిగిందా? లేక స్వతంత్రంగానే వ్యవహరిస్తేనే ఉపయోగం ఉంటుందా? అనే అంశంపై పునరాలోచన చేస్తానని ఆ సమావేశంలో ఉద్ధవ్‌ ఠాక్రె హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

స్వతంత్రంగానే పోటీ చేయాలనే వాదనకు మద్దతు పెరుగుతున్నదని మండలిలో ప్రతిపక్ష నాయకుడు, శివసేన (ఉద్ధవ్‌) నేత అంబాదాస్‌ దాన్వే బుధవారం మీడియాకు తెలిపారు. ‘పార్టీని పునర్నిర్మించే పని చేపట్టి.. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది’ అని ఆయన చెప్పారు. ‘ఎన్నికల్లో గెలిచామా లేక ఓడిపోయామా అనేదానితో సంబంధం లేదు. ఇది మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి సంబంధించినది’ అని ఆయన పేర్కొన్నారు. మహా వికాస్‌ అఘాడీలోని భాగస్వామ్య పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు నిలబడటంతో తమ విజయావకాశాలు దెబ్బతిన్నాయని అనేక మంది పరాజిత నేతలు మంగళవారం నాటి సమావేశంలో తమ ఆందోళనలను వ్యక్తం చేశారని సమాచారం. కాంగ్రెస్‌, ఎన్సీపీ (ఎస్‌పీ) నుంచి తగినంత సహకారం కూడా అందలేదని ఉదాహరణలతో సహా చెప్పారని తెలిసింది. కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా తమ సంప్రదాయ ఓటు బ్యాంకు దూరమైందని పలువురు నాయకులు భావిస్తున్నారు.

ఇటీవలి ఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్‌) పార్టీ 95 సీట్లలో పోటీ చేస్తే.. 20 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. గెలిచినవాటిలో దాదాపు సగం సీట్లు పార్టీకి బలమైన పట్టు ఉన్న ముంబైలోనే ఉన్నాయి. అయితే.. మహా వికాస్‌ అఘాడీ నుంచి శివసేన (ఉద్ధవ్‌) వైదొలుగుతున్నట్టు వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. వాటిల్లో వాస్తవం లేదని పేర్కొన్నది. ఏక్కడో ఎవరో వ్యాఖ్యానించినంత మాత్రాన అవి పార్టీ అధిష్ఠాన అభిప్రాయాలు కావని తెలిపింది. ప్రస్తుతం వస్తున్న కథనాలన్నీ ఊహాగానాలేనని పేర్కొన్నది. బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఉద్ధవ్‌ సేన ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక మహా వికాస్‌ అఘాడీ తరఫున పోటీ చేస్తుందా? అని పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘మీరెండు కంగారు పడుతున్నారు? ఇప్పుడే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. చూద్దాం.. ఏం చేయాలో మాకు తెలుసు. బీఎంసీ ఎన్నికల విషయంలో నిర్ణయాలు తీసుకోగల స్థితిలో మహా వికాస్‌ అఘాడీ నేతలు ఉన్నారు’ అని ఆయన బదులిచ్చారు.