Aunty | సాధారణంగా పెద్దవారిని ఆంటీ, అంకుల్ అని పిలవడం సహజమే. కానీ ఓ మహిళ తనను ఆంటీ అని పిలవడం అవమానకరంగా భావించింది. దీనిపై ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ కూడా దాన్ని పెద్ద తప్పుగానే భావించింది. ఇష్టం లేకుండా ఆంటీ అని పిలవడం వేధింపుల కిందకే వస్తుందని నిర్ధారించింది. ఈ మేరకు సుమారు రూ.1.8లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. లండన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ లండన్‌లోని వెస్ట్ లండన్ ఎన్‌హెచ్ఎస్ ట్రస్ట్‌లో భారత సంతతికి చెందిన ఐల్డా ఎస్టేవ్స్(61) 2022 సెప్టెంబర్‌లో చేరారు. అక్కడ ఆమెతోపాటు పనిచేసే ఘనా దేశానికి చెందిన చార్లెస్ ఒప్పాంగ్ తరచూ ఆంటీ అని పిలిచేవాడు. ఆంటీ అని పిలిస్తే తనకు నచ్చదని.. అలా పిలవద్దని ఎస్టేవ్స్ చాలాసార్లు చెప్పి చూసింది.
తనను పేరుతో పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఆఫీసు కారిడార్‌లో, అందరి ముందు తనను ఆంటీ అని పిలుస్తుండటంతో ఆమె విసుగుచెందింది. అంతేకాకుండా తమ సహోద్యోగి అయిన ఓ వృద్ధుడితో ఎస్టేవ్స్ జోడీ బాగుంటుందని కూడా కామెంట్ చేసేవాడు. అతని మాటలను తీవ్రంగా పరిగనించిన ఎస్టేవ్స్ వాట్‌ఫోర్డ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.
తనను పదే పదే ఆంటీ అని పిలుస్తూ విసిగిస్తున్నాడని ట్రిబ్యునల్ ముందు ఎస్టేవ్స్ తెలిపింది. తన లిప్‌స్టిక్‌పై కూడా కామెంట్లు చేయడం, సహోద్యోగితో సంబంధం అంటగట్టడం అన్నీ అనుచితమని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఒప్పాంగ్ కూడా తన వాదనను వినిపించాడు. తమ ఘనా సంస్కృతి ప్రకారం పెద్దవారిని గౌరవ సూచకంగా ఆంటీ అని పిలుస్తామని వివరించారు. కానీ అతని వివరణను ట్రిబ్యునల్ పూర్తిగా వ్యతిరేకించింది.
అతని వివరణ అస్పష్టంగా, తప్పించుకునే విధంగా ఉందని జడ్జి జార్జ్ అల్లియాట్ అభిప్రాయపడ్డారు. ఆంటీ అనేది ఘనా సంస్కృతిలో గౌరవ పదమే కావచ్చు.. కానీ అవతలి వ్యక్తికి ఇష్టం లేనప్పుడు అలా పిలవడం వేధింపుల కిందకే వస్తుందని స్పష్టం చేశారు. చార్లెస్ ఒప్పాంగ్ కావాలనే ఎగతాళి చేసేందుకే ఎస్టేవ్స్‌ను ఆంటీ అని పిలిచారని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఆమె మనోభావాలు దెబ్బతీసినందుకు గానూ.. 1425.15 పౌండ్లు (భారతీయ కరెన్సీ ప్రకారం.. సుమారు రూ.1.8 లక్షలు) నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
Read More:
లైవ్‌లో పులుల వేట.. అభయారణ్యంలో మనుషుల అతి!
68 కోట్ల కట్నం ఇచ్చి.. పాతికేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ
