విధాత : పశ్చిమ బెంగాల్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారిశనివారం ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్.రవి సీఎంగా సువేందు అధికారితో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తదితరులు హాజరయ్యారు.
బెంగాల్ తొమ్మిదవ సీఎంగా సువేందు అధికారి
55 ఏళ్ల సువేందు అధికారి బెంగాల్ కు తొమ్మిదవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు బీజేపీ నేతలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తనియా, నితీశ్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడూ మంత్రులుగా ప్రమాణం చేశారు.
1970 డిసెంబరు 15న బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లాలో సువేందు జన్మించారు. 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. అప్పటినుంచి ఆ పార్టీలో నంబర్ టూ గా మారారు. 2004లో తమలుక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2006లో తొలిసారి కాంథీ దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మమతా బెనర్జీ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి లోక్‌సభకు వెళ్లారు. గతంలో మమత తన మేనల్లుడికి ప్రాధాన్యతనివ్వడం ఇష్టంలేని కారణంగా ఆమెతో విభేదించిన సువేందు అధికారి 2020లో టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. అప్పటినుంచి రాష్ట్రంలో బీజేపీనీ బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
రెండుసార్లు మమతను ఓడించిన సుబేందు
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని 3సీట్ల నుంచి 77సీట్ల వరకు తీసుకొచ్చారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ 15ఏళ్ల పాలనకు తెరదించి మొత్తం 294స్థానాల్లో 206 సీట్లతో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలకంగా పనిచేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో, తాజా ఎన్నికల్లో భవానీపూర్‌లో మమతా బెనర్జీని రెండుసార్లు ఓడించి సువేందు సంచలనం సృష్టించారు.
