What is Hydra doing? । హైడ్రా చేస్తున్నదేంటి? చేయాల్సిందేంటి? నిపుణులేమంటున్నారు?
సీఎం రేవంత్ రెడ్డి చర్య హీరోయిక్‌గా ఉండవచ్చు.. బాగా చేస్తున్నారన్న సంతోషం కూడా కొదరికి కలుగవచ్చు కానీ.. ప్రజాస్వామ్య తీరు మాత్రం కాదని అంటున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. కానీ చేయాల్సిన పద్ధతి ఇది కాదంటున్నారు మేధావులు. ముందుగా హైదరాబాద్ నగరంలోని చెరువులు, కబ్జా అయిన వాటి జాబాతాను తయారు చేసి, వాటిల్లో జరిగిన నిర్మాణాల అనుమతులు రద్దు చేయాలంటున్నారు.

What is Hydra doing? । ఉరిశిక్ష పడిన ఖైదీకి సైతం క్షమాభిక్ష (pardon) కోరుకునే అవకాశం కల్పిస్తారు. బ్యాంకులకు రూ.10 వేల కోట్ల రుణాలైన ఎగవేసిన వాడికి తన రుణం మాఫీ (loan waiver) చేయయాలని వేడుకునే అవకాశం ఇస్తారు. దివాలా (bankrupt) తీశానని, వెయ్యి కోట్లు మాత్రమే చెల్లించుకోగలనని చెబితే.. సరేనని చెప్పి.. మిగిలిన రూ. 9 వేల కోట్లయినా మాఫీ చేస్తారు. అలా బ్యాంకులు అనేక లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశాయి కూడా. బ్యాంకులు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేటప్పుడు అనేకసార్లు నోటీసులు ఇచ్చి, తరువాత బహిరంగ ప్రకటన చేసి ఇంటిని వేలం (auction) వేస్తారు. ఇది ప్రజాస్వామిక లక్షణం. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలే అనాగరికంగా వ్యవహరిస్తున్న తీరుపైనా ప్రజాస్వామ్యవాదుల నుంచి విమర్శలు వెలువడుతున్నాయి. ప్రజలు తెలిసో, తెలియకో.. దురాశ కొద్దో కోనుగోలు చేసి ఉండొచ్చు! కానీ హైడ్రా (Hydra) పేరుతో ప్రభుత్వం నేరుగా వెళ్లి ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడం ఏమి నాగరికత అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బందిపోటు దొంగల మాదిరిగా ఒక్కసారిగా వెళ్లి వారి ఇండ్లను కూల్చుకుంటూ వెళ్లడం ఏం న్యాయమని అడుగుతున్నారు.
నాడు సక్రమం.. ఇప్పుడు అక్రమం ఎలా?
జీహెచ్ఎంసీ ప్రభుత్వ సంస్థే. జీహెచ్ఎంసీ (GHMC) అనుమతులు ఇచ్చినప్పడు లేనిది ఇప్పుడు అక్రమం ఎలా అవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఏదైనా అక్రమం అని తేలినప్పుడు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, ఇది సహజ న్యాయసూత్రమని (natural justice) చెపుతున్నారు. హైకోర్టు కూడా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. దుర్గం చెరువు (Durgam Cheruvu) ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలోని నిర్మాణాలకు కూల్చివేతలకు ఇల్లు ఖాళీ చేయాలని ఇచ్చిన వాటినే నోటీసులుగా పరిగణించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంటి యజమానులు (house owners) ఇచ్చే సమాధానాన్ని తాసిల్దార్ వినాలని స్పష్టం చేసింది.
అనుమతులు రద్దు చేయకుండా ఎలా కూలుస్తారు?
భవనాలు, ఇండ్ల నిర్మాణాలకు జీహెచ్ఎంసీ కానీ, ఇతర మున్సిపాలిటీలు, హెచ్ఎండీఏలు ఇచ్చిన అనుమతులు రద్దు చేయకుండా ఏ విధంగా కూలుస్తారని న్యాయనిపుణులు (Legal experts) ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర పురపాలక సంస్థలు కానీ, డీటీసీపీ కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (occupancy certificate) ఇచ్చిన తరువాత తప్పని తేలితే ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఆ క్లాజ్‌ను అందులో చేరుస్తారు. ముఖ్యంగా నీళ్లకు ఆటంకం కలుగుతున్నప్పుడో.. అక్రమమని తేలితేనో.. ఇలా పలు పారామీటర్ల ఆధారంగా ఇచ్చిన అనుమతులను రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. కానీ నోటీసులు లేకుండా, అనుమతులు రద్దు చేయకుండా ఒక్కసారిగా దాడి చేసి కూల్చుడేందన్న చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది. ఒక పద్ధతి, విధానం అంటూ లేకుండా కూల్చివేస్తున్న తీరు చూస్తుంటే ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లు’ ఉందని ఒక విద్యావేత్త ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేపట్టిన చర్య హీరోయిక్‌గా ఉండవచ్చు.. బాగా చేస్తున్నారన్న సంతోషం కూడా కొదరికి కలుగవచ్చు కానీ.. ప్రజాస్వామ్య (democracy) తీరు మాత్రం కాదని అంటున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. కానీ చేయాల్సిన పద్ధతి ఇది కాదంటున్నారు మేధావులు. ముందుగా హైదరాబాద్ నగరంలోని చెరువులు, కబ్జా అయిన వాటి జాబాతాను తయారు చేసి, వాటిల్లో జరిగిన నిర్మాణాల అనుమతులు రద్దు చేయాలంటున్నారు. తదుపరి వారికి నోటీసులు ఇచ్చి, సమాధానం వచ్చిన తరువాత చట్టం ప్రకారం చర్యలు తీసుకొని అక్రమాలను తొలగిస్తే పద్ధతి ప్రకారం ఉన్నట్టు అవుతుందని చెబుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై సర్వే చేయాలి
మొదలు పెట్టడమే కాదు.. ముగింపు కూడా చేయాల్సి ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు. తప్పును తప్పని ముందుగా తేల్చాలని చెపుతున్నారు. ‘ముందుగా అక్రమ నిర్మాణాలపై సర్వే చేయండి. నాలాలు, చెరువులు, కుంటలలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు (illegal constructions) సర్వే చేసి లిస్ట్ చేయండి. ఆ తరువాత పబ్లిక్ నోటీస్ ప్రధాన పత్రికలల్లో ఇవ్వండి. వాటిల్లో జీహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు ప్రకటించండి’ అని ఆయన సూచించారు. అనుమతులు రద్దు చేయకుండా కూల్చివేస్తామంటే సభ్య సమాజం అంగీకరించదని సదరు జర్నలిస్ట్ అభిప్రాయ పడ్డారు.
భారీ అవినీతికి ఆనవాళ్లుగా టవర్లు
భారీ అవినీతికి ఆనవాళ్లే అడ్డగోలుగా టవర్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమని పట్టణ నిర్మాణ రంగ నిపుణులు చెపుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎఫ్‌ఎస్‌ఏ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్) (floor space index) ఎత్తి వేయడంలోనే అసలు మతలబు ఉందంటారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఎఫ్ఎస్ఏ ఎత్తి వేశారు. తర్వాత దాని పర్యవసానాలు అర్థమయ్యాయి. తరువాత వచ్చిన పాలకులు దానిని సరిచేయాల్సింది పోయి.. అదే విధానాన్ని కొనసాగించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఫలితంగానే 40 అంతస్తులు, 50 అంతస్తులు, వంద అంతస్తుల టవర్లకు అనుమతులు ఇస్తున్నారని అంటున్నారు. ఇలా అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలకు వాటిల్లో నివశించే ప్రజలకు నీళ్లు, డ్రైనేజీ, రోడ్లు ఏమిటన్న సోయి కూడా లేదంటున్నారు. అడ్డగోలుగా టవర్లకు అనుమతులు ఇవ్వడంలోనే భారీ కుంభకోణం దాగి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందుగా హైదాబాద్ క్షేమం కోరే సీఎం రేవంత్ రెడ్డి టవర్ల నిర్మాణాలకు ఇచ్చే అనుమతులకు ఫుల్ స్టాఫ్ పెట్టాలని, అనుమతులు ఇచ్చిన వాటిని రద్దు చేయాలని కోరుతున్నారు. అప్పుడే నగరంపై కొంత భారాన్ని తగ్గించిన వాళ్లు అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దూకుడు కొనసాగుతుందా? చల్లారుతుందా?
రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఎవరిని కదలించినా హైడ్రా కూల్చివేతలపైనే చర్చిస్తున్నారు. కేటీఆర్కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ (Janwada farm house) కూలుస్తారా? సీఎం రేవంత్ రెడ్డి దుర్గం చెరువులో ఉన్న తన అన్న తిరుపతి రెడ్డి (Tirupati Reddy) ఇల్లు కూలుస్తాడా లేదా? ఒవైసీ సలకం చెరువులోనే నిర్మించిన పాతిమా ఒవైసీ మహిళా కళాశాల భవనాన్ని కూల్చి వేస్తాడా? అంత గట్స్ ఉన్నాయా? అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులే కాకుండా ఏపీ రాష్ట్రానికి చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన భవనాలు అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ కూల్చివేస్తారా? హైడ్రా ఇదే దూకుడుతో పని చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్ హైటెక్ సిటీ సమీపంలోని గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నట్లు హడావిడి చేసి, వదిలేశారని, అదే తీరుగా సీఎం రేవంత్ హడావిడి చేసి వదిలేస్తాడా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.