VIJAYAWADA FLOODS । విజయవాడను ముంచెత్తిన వరదల వెనుక..
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని అల్లకల్లోలం చేశాయి. దారులన్నీ వాగులుగా మారిపోవడంతో జన జీవనం స్తంభించిపోయింది.

VIJAYAWADA FLOODS । గత రెండు రోజులుగా కనివిని ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలు, వాటి కారణంగా భారీ వరదలతో విజయవాడ నగరం అల్లకల్లోలంగా మారింది. పొరుగునే ఉన్న గుంటూరు నగరం సైతం జలాశయాన్ని తలపిస్తున్నది. విజయవాడ నగరంలో ఎటు చూసినా వర్షపు నీరు నిలిచిపోయి దారులన్నీ వాగులుగా మారిపోయాయి. గడిచిన 50 సంవత్సరాలలోనే ఇంతటి వర్షపాతం ఎన్నడూ నమోదు కాలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. అసలు విజయవాడను ఇంత పెద్ద ఎత్తున వరద నీరు, వర్షపు నీరు చుట్టుముట్టడం వెనుక కారణమేమిటి?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. విజయవాడ మీదుగా ప్రవహించే కృష్ణా నది ఒకవైపు, బుడమేరు వాగు మరోవైపు ప్రమాదకర స్థాయిలో ప్రవహించాయి. ఆదివారం ఒక్కరోజే విజయవాడ నగరంలో 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇది గత 30 ఏళ్లలో అత్యధిక ఏకైక రోజు వర్షపాతం అని అధికారులు చెబుతున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో 37 సెంటీమీటర్ల దాకా వర్షం కురిసినట్టు తెలుస్తున్నది. దీంతో విజయవాడలో బుడమేరు ఉప్పొంగి, 40% నగరం నీట మునిగింది. మరోవైపు తెలంగాణ ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద పెనుముప్పుగా పరిణమించింది. వాగులు, వంకలు కృష్ణానదిలో కలవడంతో కృష్ణా నది ఉధృతస్థాయిలో ప్రవహిస్తున్నది.
2005లోనూ విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో బడుమేరు ఉప్పొంగడంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే.. 2005 వరదలతో పోల్చితే ఇప్పుడు వచ్చిన వరదలు రెండింతలు అధికమని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.