Revanth Reddy| మహిళా సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణవ్యాప్తంగా మ‌హిళా సంఘాలు ఉత్ప‌త్తి చేస్తున్న వివిధ వ‌స్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అంత‌ర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స‌చివాల‌యం నుంచి జిల్లాల్లోని మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల (ఎస్‌హెచ్‌సీ) స‌భ్యుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు

Revanth Reddy| మహిళా సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా మ‌హిళా సంఘాలు(Telangana Women Self-Help Groups) ఉత్ప‌త్తి చేస్తున్న వివిధ వ‌స్తువులను ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా అంత‌ర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్ర‌దింపులు చేస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. రాష్ట్ర స‌చివాల‌యం నుంచి జిల్లాల్లోని మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల (ఎస్‌హెచ్‌సీ) స‌భ్యుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. మ‌హిళ‌ల ఉన్న‌తే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. మ‌హిళా సంఘాల‌కు పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు, బ‌స్సుల నిర్వహణ అప్పగించడం ద్వారా వారి ఆర్థిక వృద్ధికి చేయూతనిస్తున్నామని తెలిపారు.

గ‌త ప్ర‌భుత్వం వ‌డ్డీలేని రుణాల విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించింద‌ని… తాము వ‌డ్డీలేని రుణాలు ఇవ్వ‌డంతో పాటు అందుకు సంబంధించిన నిధులు విడుద‌ల చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించ‌డ‌మే కాకుండా ఆర్టీసీ బ‌స్సుల‌కు మ‌హిళ‌ల‌ను య‌జమానుల‌ను చేశామ‌ని సీఎం తెలిపారు. యూనిఫాంలు కుట్టే బాధ్య‌త‌ను అప్ప‌జెప్ప‌డంతో మ‌హిళా సంఘాల‌కు రూ.30 కోట్ల ఆదాయం స‌మ‌కూరింద‌ని, అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల క‌మిటీల ద్వారా పాఠ‌శాలల్లో రూ.534 కోట్ల ప‌నులు చేప‌ట్టామ‌ని, ధాన్యం కొనుగోళ్లు మ‌హిళా సంఘాల‌కే అప్ప‌జెప్పామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పారామం ప‌క్క‌న రూ.వంద‌ల కోట్ల విలువైన 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామ‌ని సీఎం అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్‌ కార్య‌ద‌ర్శి శేషాద్రి, సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్, సెర్ప్ సీఈవో దివ్య దేవ‌రాజ‌న్‌, చేనేత‌, జౌళి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌య్య‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

* మీ పెట్రోల్ బంక్ ఎలా న‌డుస్తోంది..:

మీ సంఘం ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా న‌డుస్తోంద‌ని నారాయ‌ణ‌పేట జిల్లా మ‌హిళా స‌మాఖ్య అధ్య‌క్షురాలు అధ్య‌క్షురాలు అరుంధ‌తిని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అడిగారు. బాగా న‌డుస్తోంద‌ని.. నెల‌కు రూ.4 ల‌క్ష‌ల రాబ‌డి వ‌స్తోంద‌ని ఆమె సీఎంకు తెలియ‌జేశారు. ఇత‌ర జిల్లాల నుంచి సంఘాల‌ను అక్క‌డ‌కు తీసుకెళ్లి వారి ప‌ని తీరు.. రాబ‌డిని ప్ర‌త్య‌క్షంగా చూపాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సీఎం సూచించారు..

* డిజైన్లు ఎంతో బాగున్నాయి…

త‌మ‌కు ఇస్తున్న చీర‌ల డిజైన్లు ఎంతో బాగున్నాయ‌ని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురాలు భాగ్య ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 9 మీట‌ర్లు, 6 మీట‌ర్ల చీర‌లు త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఉన్నాయ‌ని…. త‌మ‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని ఆమె సీఎంకు తెలియ‌జేశారు.

* మాకు యూనిఫాం ఇచ్చిన‌ట్లు ఉంది….

ఇందిరామ‌హిళా శ‌క్తి చీర‌లు ఇవ్వ‌డం ద్వారా త‌మ‌కు యూనిఫాం వ‌చ్చింద‌నే సంతోషం ఉంద‌ని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మ‌హిళా సమాఖ్య అధ్య‌క్షురాలు శ్రీ‌దేవి తెలిపారు. ఈ చీర‌లు ధ‌రించ‌డం ద్వారా త‌మ సంఘాల మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంద‌ని ఆమె అన్నారు.