Bandi Sanjay : నా నోటి నుండి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్లే
హిందుత్వమే నా శ్వాస అని బండి సంజయ్ వ్యాఖ్య. తెలంగాణలో బీజేపీ గెలుపు హిందుత్వంతోనే సాధ్యమని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
విధాత : నా నోటి నుండి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్లేనని..హిందుత్వమే నా శ్వాస అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వాతావరణం తీసుకొస్తాం అని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో హిందుత్వంవల్లే 4 నుండి 48 సీట్లు గెలిచాం అని, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది కదా..మరి ఆ ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయడం లేదు? అని ప్రశ్నించారు. ఎన్నికలొస్తే… మసీదుల్లో ముస్లింలంతా ఒక్కటై ప్రతిజ్ఞ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారని, 12 శాతం ముస్లింలంతా ఒక్కటైతే తప్పు లేనిది.. 80 శాతం హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే తప్పేంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పంచాయతీలకు నయాపైసా రాదు
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటిస్తే పంచాయతీలకు నయాపైసా రాదు అని..పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతుందని, కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని సంజయ్ తెలిపారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తేనే పంచాయతీలు బాగుపడతాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో చేసిన హామీలు, డిక్లరేషన్ల అమలులో దారుణంగా విఫలమైందని సంజయ్ విమర్శించారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచారని కాంగ్రెస్ సంబురపడుతున్నారని, ముస్లింల ఓట్లతో డబ్బులను నీళ్లలా ఖర్చు చేసి గెలిచారే తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనా వైఫల్యాలు, బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాలను వివరిస్తూ కరపత్రం రూపొందించాం. ఇంటింటికీ పంపాలి. అట్లాగే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఈనెల 26 నుండి ‘సంతకాల సేకరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్’ నిర్వహించాలని నిర్ణయించడం సిగ్గు చేటు అని, వారు జరుపుకోవాల్సింది ‘‘తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్’’ కానే కాదు…. ‘‘తెలంగాణ డౌన్ ఫాల్ ఫెస్టివల్ (తెలంగాణ పతన వేడుకలు) నిర్వహించుకుంటే బాగుండేదన్నారు. లేకపోతే కాంగ్రెస్ సింకింగ్ ఫెస్టివల్ (కాంగ్రెస్ దిగజారుడు ఉత్సవాలు) నిర్వహిస్తామంటే బాగుండేదని సంజయ్ ఎద్దేవా చేశారు. గ్రామాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్రమోదీదేనన్నారు. రైతులకు రెట్టింపు గిట్టుబాటు ధరను అందిస్తామని మాట ఇచ్చి నిలుపుకున్నామని… క్రమం తప్పకుండా కిసాన్ సమ్మాన్ నిధులను అందిస్తున్న ఘనత మాదేనని సంజయ్ తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram