Uppal Flyover| మోదీ పాలనకు 11ఏళ్లు..ఉప్పల్ ఫ్లైఓవర్ కు 10ఏండ్లు!

Uppal Flyover| మోదీ పాలనకు 11ఏళ్లు..ఉప్పల్ ఫ్లైఓవర్ కు 10ఏండ్లు!

విధాత, హైదరాబాద్ : దేశ ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ 11ఏండ్ల పరిపాలన పూర్తి చేసుకున్న క్రమంలో బీజేపీ శ్రేణులు ప్రచార ఆర్భాటం సాగిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రమంతా జోరుగా వెలిశాయి. ఇదే క్రమంలో ఉప్పల్-వరంగల్ హైవే మార్గంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఫిల్లర్లపై కూడా మోదీ 11ఏళ్ల పాలన పోస్టర్లను అంటించారు. ఆ మార్గంలో వెలుతున్న వాహనదారులు, ప్రయాణికులు వాటిని చూస్తూ..మోదీ పాలనకు 11ఏళ్లు..ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం పనులకు 10ఏండ్లు అంటూ సైటైర్లు వేసుకుంటున్నారు.

ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించి పదేళ్లయినా పనులు సగం కూడా పూర్తికాలేదని..పనుల పూర్తికి ఇంకెన్నేళ్లు పడుతుందంటూ ఆ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో అస్తవ్యస్తమైన రోడ్ల మీదుగా గుంతలపైన ప్రయాణిస్తూ నిత్యం ట్రాఫిక్ లో నరకం చూస్తున్నామని..నిత్యం అక్సిడెంట్ లు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వర్షం పడితే వాహనాలు ముందుకు కదల్లేక వాహనదారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు.

ఉప్పల్ ఫ్లై ఓవర్‌ను హైదరాబాద్ నుంచి యాదాద్రి-భువనగిరి-వరంగల్ 163 జాతీయ రహదారి మార్గంలో రద్దీ తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018 లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు 6.25 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టును రూ. 626.8కోట్ల వ్యయంతో చేపట్టారు. 2020 జూలైలో పూర్తి చేయాల్సిన పనులు వివిధ కారణాల వల్ల ఆలస్యంగా కొనసాగుతూ..వాహనదారుల సహనానికి పరీక్షగా నిలుస్తున్నాయి. ..నగరంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు(ఓ కేంద్ర మంత్రి) ఉన్నా మా ఉప్పల్ ఫ్లైఓవర్ మాత్రం ఎందుకు సకాలంలో పూర్తికావడంలేదంటూ స్థానికులు ప ప్రశ్నిస్తున్నారు.

గతంలో ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఏడాది మే 5న అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ ఉప్పల్-మేడిపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌ను వచ్చే 8 నుండి 10 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ దిశగా పనుల పురోగతి మాత్రం కనిపించడం లేదు. 145 పిల్లర్ల నిర్మాణానికి సగం కూడా పూర్తవ్వని పరిస్థితి. నల్ల చెరువుపై ఆరు పోర్టల్‌ బీమ్‌లను నిర్మిస్తున్నారు. నారపల్లి వద్ద స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల ఆలస్యంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. దీనికి తోడు నిత్యం ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది.