37 వేల మంది మహిళలతో మహారాస్ ప్రదర్శన
గుజరాత్‌లో శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారకానగరంలో ఆదివారం అద్భుతం ఆవిష్కృతమైంది

- గుజరాత్‌లోని ద్వారకలో వైభవోపేతంగా నిర్వహణ
- ప్రపంచ రికార్డ్ కోసం అహిర్ మహిళల నృత్యం
విధాత: గుజరాత్‌లో శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారకానగరంలో ఆదివారం అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ రికార్డ్ నెలకొల్పేందుకు బ్రహ్మ ముహూర్తంలో 37 వేల మంది అహిర్ మహిళలు ‘మహా రాస్’ ప్రదర్శన నిర్వహించారు. వైభవోపేతంగా జరిగిన ఈ నృత్య ప్రదర్శనను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఈ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా అహిర్ కమ్యూనిటీకి చెందిన సుమారు 1.5 లక్షల మంది ఈ నృత్యాన్ని వీక్షించారు.
సుమారు 5000 ఏండ్ల క్రితం శ్రీకృష్ణుని కాలంలో చేసిన ఈ పదర్శనను వేలాది మహిళలు కలిసి మరోసారి పునరావృతం చేశారు. దేశ విదేశాల్లో నివసిస్తున్న అహిర్ వర్గానికి చెందిన మహిళలు ద్వారకకు వచ్చిఈ నెల 23-24 తేదీల్లో రెండు రోజులపాటు ‘మహా రాస్’ ప్రదర్శన ఇచ్చారు. రాస్ జ్ఞాపకార్థం బాణాసురుని కుమార్తె, శ్రీకృష్ణుని కోడలు అయిన ఉష ఈ కార్యక్రమం నిర్వహించినట్టు సమాచారం. శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన మహిళలు లయబద్ధమైన నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ అహిరాణి మహర్ష్ సంఘటన్ నిర్వహించింది.