Snowfall | హిమాచల్ అంత‌టా హిమపాతం.. 475 రోడ్లు మూసివేత‌

హిమాచల్ ప్రదేశ్ అంత‌టా ద‌ట్టంగా హిమ‌పాతం కురుస్తున్న‌ది. దాంతో ఐదు జాతీయ రహదారులతో సహా 475 రహదారులను మూసివేశారు

Snowfall | హిమాచల్ అంత‌టా హిమపాతం.. 475 రోడ్లు మూసివేత‌

Snowfall | విధాత‌: హిమాచల్ ప్రదేశ్ అంత‌టా ద‌ట్టంగా హిమ‌పాతం కురుస్తున్న‌ది. దాంతో ఐదు జాతీయ రహదారులతో సహా 475 రహదారులను మూసివేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మంచు కురుస్తున్న కారణంగా 333 విద్యుత్ సరఫరా పథకాలు, 57 నీటి సరఫరా పథకాలు కూడా దెబ్బతిన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆదివారం తెలిపింది.


చంబాలో 56, కాంగ్రాలో 1, కిన్నౌర్‌లో 6, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు మంచు కారణంగా మూసుకుపోయాయని వెల్ల‌డించింది. శనివారం నాలుగు జాతీయ రహదారులతో సహా 504 రహదారులు మూసివేయబడ్డాయి. మంచు కారణంగా రాష్ట్రంలో విద్యుత్తు, నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు ద‌ట్టంగా కురుస్తున్నందున లాహౌల్-స్పితిలోని తొమ్మిది స్టేషన్లలో మంచు తొలగింపు ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి.


తొమ్మిది స్టేషన్లు 1-5 అడుగుల మంచు లోతును నివేదించాయి. స్టేషన్లలో కీలాంగ్, కాజా, సుమ్డో, ఉదయపూర్, తిండి, కోక్సర్, సిస్సు, నార్త్ పోర్టల్, సౌత్ పోర్టల్ ఉన్నాయి. కొండ ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్‌కు కొత్త సంవత్సరం నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఇతర ఉత్తర భారత రాష్ట్రాలు పొగమంచుతో కమ్ముకోగా, హిమాచల్ ప్రదేశ్‌లో మంచు కురుస్తున్న‌ది. ప‌ర్యాట‌కులు ప్రయాణాలు ప్రారంభించే ముందు వాతావరణ పరిస్థితులను అంచనా వేయాలని, అనుకూల ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు మాత్రమే ప్రయాణాలు కొన‌సాగించాల‌ని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు సూచ‌న‌లు చేశారు.