పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదు ఇండ్లు నేలమ‌ట్టం

ఆర్థిక రాజధాని ముంబైలో బుధ‌వారం ఉద‌యం ఘోర అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. చెంబూర్ గోల్ఫ్ క్లబ్ ప్రాంత‌ సమీపంలోని ఓల్డ్ బ్యారక్ వ‌ద్ద గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డంతో ఐదు ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి

పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదు ఇండ్లు నేలమ‌ట్టం
  • శిథిలాల నుంచి 11 మందిని ర‌క్షించిన పోలీసులు
  • ముంబైలోని చెంబూర్‌లో ఉద‌యం వేళ ఘ‌ట‌న‌



విధాత‌: ఆర్థిక రాజధాని ముంబైలో బుధ‌వారం ఉద‌యం ఘోర అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. చెంబూర్ గోల్ఫ్ క్లబ్ ప్రాంత‌ సమీపంలోని ఓల్డ్ బ్యారక్ వ‌ద్ద గ్యాస్ సిలిండ‌ర్ పేల‌డంతో ఐదు ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు నుంచి ఐదు అంతస్థుల ఇండ్లు కూలిపోవ‌డంతో ప‌లువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాల నుంచి 11 మందిని అగ్నిమాప‌క సిబ్బంది ర‌క్షించారు.


పేలుడు కారణంగా కూలిపోయిన ఇండ్ల మెట్లు, బాల్కనీల భాగాలు గాలిలో వేలాడుతూ ధ్వంసమైన ఇండ్ల దృష్ట్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. పేలుడు జ‌రిగిన ప్రాంతం ఇరుకుగా ఉండటం, చిన్న అపార్ట్‌మెంట్లు కావ‌డంతో ప్ర‌మాదం తీవ్రత ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన న‌లుగురిని చికిత్స నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. క్ష‌త‌గాత్రుల్లో వృద్ధుల‌తోపాటు మిడిల్ ఏజ్ వ్య‌క్తులు, యువ‌కులు ఉన్న‌ట్టు శతాబ్ది హాస్పిటల్‌లోని డాక్టర్ కేదార్ తెలిపారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.