బ‌స్త‌ర్‌లో ఎదురు కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి

చ‌త్తీస్‌ఘ‌డ్‌లో బీజాపూర్ జిల్లాలోని బాసా గూడెం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని చూపురు బట్టి గ్రామంలో బుధ‌వారం పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి.

  • By: Somu    latest    Mar 27, 2024 12:36 PM IST
బ‌స్త‌ర్‌లో ఎదురు కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
  • డిప్యూటి క‌మాండ‌ర్ నాగేష్ అత‌ని భార్య సోనిలు మృతి

రాయ పూర్: చ‌త్తీస్‌ఘ‌డ్‌లో బుధ‌వారం పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. బీజాపూర్ జిల్లాలోని బాసా గూడెం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని చూపురు బట్టి గ్రామంలో జ‌రిగిన‌ ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందార‌ని, వారిలో ఇద్ద‌రు మ‌హిళ మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు. గ్రామానికి ప‌క్క‌నే ఉన్న తాళిపేరు నదిలో మావోయిస్టులు ఉన్నార‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. రెండ బృందాలుగా విడిపోయిన పోలీసులు న‌దికి రెండు వైపులా వెళ్లి గాలిస్తుండ‌గా పోలీసుల‌కు, మావోయిస్టుల‌క మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు.


గాలింపుకు వెల్లిన బృందాలు ఇంకా తిరిగి రాలేద‌ని, కాల్పులు ఇంకా జ‌రుగుతూనే ఉన్న‌ట్లు తెలిపారు. మృతి చెందిన వారంతా ప్లాటూన్‌-10కి చెందిన వార‌ని, అందులో ప్లాటూన్ డిప్యూటి క‌మాండ‌ర్ నాగేష్ అత‌ని భార్య సోనీలు ఉన్నార‌న్నారు. కాల్పులు జ‌రిగిన ప్ర‌దేశంలో భారీగా మందు గుండు, పేలుడు ప‌దార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా బెటాలియ‌న్‌, బ‌స్త‌ర్ ఫైట‌ర్స్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ స్పెష‌ల్ ఫోర్స్ క‌లిసి పాల్గొన్న‌ట్లు బీజాపూర్ ఎస్పీ తెలిపారు.


గ‌త ఎన్నిక‌ల్లో చ‌త్తీస్‌ఘ‌డ్‌లో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ మావోయిస్టుల‌కు వ్య‌తిరేకంగా క్యాంపెయిన్‌లు చేప‌ట్టింది. పోలీసు బ‌ల‌గాల‌ను పెద్దఎత్తున మోహ‌రించి నిరంత‌రం కూంబింగ్‌లు చేప‌డుతోంది. ఈ సంద‌ర్భంగా పోలీసులు సామాన్య‌ప్ర‌జ‌ల‌పై అఘాయిత్యాలు చేస్తున్నార‌ని, ఆదివాసి మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆదివాసీలు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు దిగారు. దీంతో బీజేపీ ప్ర‌భుత్వం పార్లమెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మావోయిస్టుల‌తో శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మేనంటూ బ‌హిరంగంగా పిలుపునిచ్చింది.


దీంతో మాయిస్టులు కూడా బ‌హిరంగ చర్చ‌ల‌కు సిద్ధ‌మేనంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా నిత్యం బ‌స్త‌ర్ ప్రాంతంలో పోలీసు బ‌ల‌గాల‌కు మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇది విచారించ ద‌గ్గ విష‌య‌మ‌ని ఆ ప్రాంత సామాజిక‌వేత్త‌లు, మేధావులు భావిస్తున్నారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలో శాంతి చ‌ర్చ‌ల‌పై కారు మేఘాలు క‌మ్ముకుంటున్నాయని, చ‌ర్చ‌ల‌పై విశ్వాసాలు స‌న్న‌గిల్లుతాయ‌ని మాన‌వ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


మార్చి 30న‌ మావోయిస్టుల బంద్

మార్చి 30వ తేదిన బీజాపూర్ జిల్లా బంద్‌కు పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చ‌త్తీస్‌ఘ‌డ్‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌ల కాలంలోనే 15మంది అమాయ‌క ఆదివాసి బిడ్డ‌ల‌ను పోలీసులు బూటకు ఎన్‌కౌంట‌ర్‌లో కాల్చి చంపార‌ని పేర్కొన్నారు. పోలీసుల అత్యాచారాల‌కు, బూట‌కు ఎదురు కాల్పుల‌కు వ్య‌తిరేకంగా మార్చి 30న బీజాపూర్ జిల్లా బంద్‌కు పిలిపునిస్తున్న‌ట్లు పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ మోహన్ ఈ ప్ర‌క‌ట‌ను విడుద‌ల చేశారు. బంద్‌కు క‌ర్ష‌కులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, పాఠ‌శాల‌లు, దుకాణాలు, బ‌స్సులు బంద్ చేయాల‌ని ప్ర‌క‌ట‌న‌లో కోరారు.