రాకెట్ షెల్‌తో ఆట‌లు.. పేలి 8 మంది మృతి

  • By: Somu    latest    Sep 27, 2023 11:46 AM IST
రాకెట్ షెల్‌తో ఆట‌లు.. పేలి 8 మంది మృతి
  • మృతుల్లో న‌లుగురు చిన్నారులు
  • పాకిస్థాన్‌లోని సింధ్ జిల్లాలో ఘ‌ట‌న‌


విధాత‌: మందుగుండు సామగ్రి (రాకెట్ లాంచర్ షెల్) తో పిల్ల‌లు ఆట‌లాడుతుండ‌గా అది పేల‌డంతో ఎనిమిది మంది చ‌నిపోయారు. మృతుల్లో న‌లుగురు పిల్ల‌లు కూడా ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన‌వారు. ఈ పేలుడు ఘ‌ట‌న పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోర్ జిల్లా జాంగీ సబ్జ్వాయ్ గోత్ గ్రామంలో బుధ‌వారం చోటుచేసుకున్న‌ది.


“చిన్న‌పిల్లలు మైదానంలో ఆట‌లు ఆడుతుండగా రాకెట్ షెల్ వారికి దొరికింది. దానిని ఇంటికి తీసుకొచ్చి ఆడుతుండ‌గా అది ఒక్క‌సారిగా పేలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తితో సహా ఎనిమిది మంది మరణించారు” అని కాష్మోర్-కంద్‌కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ ఎస్ పీ) రోహిల్ ఖోసా తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని, కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని వెల్ల‌డించారు.


గ్రామానికి రాకెట్ లాంచర్ ఎలా వ‌చ్చింద‌నే దానిపై ఉన్న‌తాధికారులు ఆరా తీస్తున్నారు. మైదాన ప్రాంతాల‌కు ఆయుధాల డంప్‌ ఏమైనా స్మగ్లింగ్ చేశారా? ఆ గ్రామంలో ఎవ‌రైనా ఆయుధ అక్ర‌మ ర‌వాణాదారులు ఉన్నారా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.