ISRO: ఇస్రో సెంచ‌రీ.. నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్‌

  • By: sr    news    Jan 29, 2025 4:31 PM IST
ISRO: ఇస్రో సెంచ‌రీ.. నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్‌
  • వందవ ప్రయోగం విజయవంతం 
  • అమెరికా తరహాలో వ్యవసాయ సేవలు అందించనున్న ఉపగ్రహం
  • అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విధాత: ఇస్రో భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని సాధించింది. బుధవారం ఇస్రో శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 6-23 గంటలకు GSLV F-15 రాకెట్‌ని ప్రయోగించింది. స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన వందవ ప్రయోగం విజయవంతం అయింది. GSLV F-15 రాకెట్‌ రెండవ లాంఛ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకు పోయింది. ఇస్రో అభివృద్ధి చేసిన NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది.భూమికి 36 వేల కి.మీ ఎత్తున GTO ఆర్బిట్‌లో NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది.

దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు హర్షద్వానాలు వ్యక్తం చేశారు. భారత భూభాగంపై సముద్ర తీరానికి 1500 కి.మీ మేర మెరుగైన నావిగేషన్ సిస్టం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఇస్రో తెలిపింది. దీంతో అమెరికా తరహాలో జీపిఎస్, వ్యవసాయం, అత్యవసర సేవలు, విమానాల రవాణా, మొబైల్ లొకేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా GSLV సీరీస్ లో GSLV F-15 రాకెట్ ప్రయోగం 17వది. రాకెట్ పొడవు 5O.9 మీటర్లు. బరువు 420 టన్నులు. ప్రపంచ దేశాలకు మన దేశకీర్తిని ఇస్రో మరోసారి చాటింది.

 

ఈ ఏడాది నింగిలోకి మరో రెండు డాకింగ్ ఉపగ్రహాలు

డాక్టర్ నారాయణన్ ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక ఇది మొదటి ప్రయోగం. ఇది ఇస్రోకి ప్రతిష్ఠాత్మకమైమ వందవ ప్రయోగం. ఈ ఏడాది ఆరంభంలోనే నింగిలో రెండు ఉపగ్రహాలని డాకింగ్ ద్వారా రెండు కలిపి ఇస్రో సత్తా చాటింది. ఈ ఏడాది మరో రెండు డాకింగ్ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపనుంది. అతిత్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది.