తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 93 ఏండ్ల వృద్ధుడు.. ఎక్కడంటే..?

ఆయన వయసు 93 ఏండ్లు.. ఈ కాలంలో ఎన్నో అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కానీ ఏ ఒక్క ఎన్నికలోనూ ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎందుకంటే.. తన పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించుకోలేదు. మొత్తానికి కలెక్టర్ చొరవతో.. ఆయన 93 ఏండ్ల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ భానుప్రతాప్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని బైన్‌శకన్‌హార్ గ్రామానికి చెందిన షేర్ సింగ్ హేడ్కో(93) ఇప్పటి వరకు ఓటు వేయలేదు. తన పేరును ఓటరు లిస్టులో కూడా నమోదు చేయలేదు. డాక్యుమెంట్లు సరిగా లేవని చెప్పి దరఖాస్తు చేసిన ప్రతిసారి అతని పేరు తిరస్కరణకు గురయ్యేది.

అయితే కాంకేర్ జిల్లా ప్రస్తుత కలెక్టర్ ప్రియాంక శుక్లా ఓటరు జాబితాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఓటు వేసేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరును నమోదు చేయాలని బీఎల్‌వోలను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఆమె. దీంతో బూత్ లెవల్ ఆఫీసర్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు. హేడ్కో మనువడి పేరును ఓటరు లిస్టులో నమోదు చేస్తుండగా, హేడ్కోకు ఇప్పటి వరకు ఓటు లేదని అధికారులకు తెలిసింది.
ఈ క్రమంలో షేర్ సింగ్ హేడ్కో విషయంలోనూ డాక్యుమెంట్లు సరిచేసి, అతని పేరును ఓటరు లిస్టులో నమోదు చేశారు అధికారులు. ఇక తనకు ఓటు హక్కు రావడంతో హేడ్కో సంతోషం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హేడ్కో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక శుక్లాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హేడ్కో. డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్లను కలెక్టర్ అభినందించారు.