Supreme Court | ఎన్నికల వేళ ఓటరు జాబితా సవరణా? పౌరసత్వం నిర్ణయంలో మీకేంటి అధికారం? : సుప్రీంకోర్టు
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టిన ఈసీఐ ప్రయోగాత్మకంగా మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రాన్ని ఎంచుకోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం కనుసన్నల్లో ఈసీఐ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సవరించే పనిలో ఉన్నదని ఇండియా కూటమి ఆరోపిస్తోంది.

Supreme Court | బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎన్నికల సమయంలోనే ఎందుకు జాబితా సవరణ చేపట్టారంటూ ప్రశ్నించింది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని వ్యాఖ్యానించింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేసింది. ఎన్నికల తరుణంలో ఓటర్ల జాబితా సవరణను సవాల్ చేస్తూ బీహార్ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఈసీ చర్యను సుప్రీంకోర్టు సమర్థిస్తునే కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇది రాజ్యంగ బద్దమైన ప్రక్రియనే అని.. ఇందులో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నది. అయితే.. ఇక్కడ సమస్యంతా చేపడుతున్న సమయం.. దాని చెల్లుబాటు గురించేనని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ తప్పనిసరి చేసిన 11 పత్రాల జాబితాలో ఆధార్ కార్డు ఎందుకు లేదనే దానిపై ప్రత్యక్ష సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఓటర్ల జాబితా సవరణపై 10 పిటిషన్లను న్యాయమూర్తులు సుధాంషు ధులియా, జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది. ఆధార్ కార్డు పౌరసత్వ నిర్ధారణ కాదని ఈ సందర్భంగా ఈసీ పేర్కొంది.
ఓటు కోల్పోతే అడిగే సమయం ఎక్కడ?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక వ్యక్తి ఓటును కోల్పోతే దాని గురించి అడిగేందుకు సదరు వ్యక్తికి సమయం ఉండదని.. ఒకసారి ఓటర్ల జాబితా ఖరారైన తర్వాత కోర్టులు ఆ అంశం జోలికి వెళ్లవని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఓటు కోల్పోయిన వ్యక్తి ఎన్నికల ముందు ఆ సవరించిన జాబితాను సవాలు చేసేందుకు వీలు ఉండదని.. ఇలాంటి ప్రక్రియతో మన దేశ పౌరులు కాని వారికి ఆ జాబితా చోటు ఉండదని తెలిపింది. ఈ ప్రక్రియ నిర్వహించడానికి ఈసీకి ఉన్న అధికారం.. ఈ సవరణ ప్రక్రియ చెల్లుబాటు.. నిర్వహిస్తున్న సమయంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
ప్రతిపక్షాల అభ్యంతరం
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టిన ఈసీఐ ప్రయోగాత్మకంగా మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రాన్ని ఎంచుకోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం కనుసన్నల్లో ఈసీఐ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సవరించే పనిలో ఉన్నదని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ఈసీఐ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే ఎన్జీవో సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశంపై సుప్రీంలో పది పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు.