యూపీలో షాకింగ్ ఘటన.. ముగ్గురు మహిళలపై నక్కదాడి
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో మరో షాకింగ్ ఘటన జరిగింది. నక్క దాడిలో ఓ మహిళ మరణించింది

- చికిత్స పొందుతూ ఒకరు మృతి
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘటన
విధాత: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో మరో షాకింగ్ ఘటన జరిగింది. నక్క దాడిలో ఓ మహిళ మరణించింది. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్ఖాన్ గ్రామానికి చెందిన బాధితురాలు ఛోటీ బేగం (50) మరో ఇద్దరు మహిళలతో కలిసి సమీప అడవిలో పశువుల మేత కోసం వెళ్లింది. గడ్డి కోస్తున్న సమయంలో బేగంపై నక్క దాడి చేసింది.
ముఖంపై కరిచి గాయపరిచింది. మరో ఇద్దరు మహిళలపై కూడా దాడిచేసింది. ముగ్గురు మహిళలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లి చికిత్స పొందారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు మహిళల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఛోటీబేగం ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. 20 రోజులుగా బరేలీలో చికిత్స పొందుతూ తాజాగా తుదిశ్వాస విడిచింది.
ప్రాణాలతో బయటపడినవారిలో ఒకరైన అఫ్సారీ బేగం మాట్లాడుతూ.. తమ ముగ్గురిపై నక్క దాడిచేసిందని, ఛోటీ బేగం ముఖాన్నినక్క తీవ్రంగా గాయపర్చిందని తెలిపారు. గ్రామస్థులు వచ్చి తమను రక్షించి నక్కను చంపారని పేర్కొన్నారు. డాక్టర్ తమకు చికిత్స అందించారు.. కానీ, రేబిస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఛోటీబేగం చనిపోయిందని, ఇప్పుడు తమకు భయంగా ఉన్నదని వెల్లడించారు.
ఈ ప్రాంతంలో చాలా నక్కలు ఉన్నాయని, కానీ, అటవీశాఖ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఇదే రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో రేబిస్ సోకిన పిల్లి కాటుకు కారణంగా ఇటీవలే తండ్రీకొడుకులు మృతి చనిపోయారు.