SLBC: శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం.. కూలిన పైకప్పు

  • By: sr    latest    Feb 22, 2025 3:56 PM IST
SLBC: శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం.. కూలిన పైకప్పు

విధాత,నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద శనివారం ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్‌బీసీ ఎడమవైపు (Srisailam Left Tunnel) సొరంగం పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ వద్ద ఉన్న టన్నెల్‌లో ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో మూడు మీటర్ల మేర పైకప్పు కింద పడిపోయింది. 4 రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలవగా.. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో విషాదం నెలకొంది.

అయితే సొరంగంలో బోర్ మెషిన్‌తో పని జరుగుతున్న సమయంలో లోపల ఉన్న ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాద సమయంలో విష్పోటన శబ్ధం భారీగా రావడంతో సమీపంలో పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై లోపలికి పరిగెత్తారు. ఏడాది లోపు ఈ పనులు పూర్తి కావాలన్న ప్రభుత్వ టార్గెట్‌తో ఇంజినీర్‌ల పర్యవేక్షణలో ఇటీవలే టన్నెల్ పనులు వేగం అందుకున్నాయి.

ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇరగేషన్‌ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టెక్నికల్ అధికారులు, వర్క్ చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు సహాయ చర్యలు అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు.