జైలు గోడ‌ల మ‌ధ్య‌.. ప్రేయ‌సిని పెళ్లాడిన ఖైదీ..

పెళ్లిళ్లు స్వ‌ర్గంలో జ‌రుగుతాయ‌న్న‌ది నిజ‌మే కానీ.. ఈ పెళ్లి మాత్రం అందుకు భిన్నంగా జ‌రిగింది. జైలు గోడ‌ల మ‌ధ్య‌.. పోలీసుల స‌మ‌క్షంలో ప్రేమించిన ప్రేయ‌సిని ఓ ఖైదీ పెళ్లాడాడు

జైలు గోడ‌ల మ‌ధ్య‌.. ప్రేయ‌సిని పెళ్లాడిన ఖైదీ..

భువ‌నేశ్వ‌ర్ : పెళ్లిళ్లు స్వ‌ర్గంలో జ‌రుగుతాయ‌న్న‌ది నిజ‌మే కానీ.. ఈ పెళ్లి మాత్రం అందుకు భిన్నంగా జ‌రిగింది. జైలు గోడ‌ల మ‌ధ్య‌.. పోలీసుల స‌మ‌క్షంలో ప్రేమించిన ప్రేయ‌సిని ఓ ఖైదీ పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకకు ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్‌లోని ఝ‌ర‌ప‌డ జైలు వేదికైంది. నూత‌న వ‌ధూవ‌రుల‌ను జైలు అధికారులు, పోలీసులు ఆశీర్వ‌దించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందిన 31 ఏండ్ల యువ‌కుడు బాలిక‌(18)ను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అత‌న్ని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు బాలిక వ‌య‌సు 17 ఏండ్లు మాత్ర‌మే. కొద్ది రోజుల క్రితం బాలిక 18 ఏండ్ల వ‌య‌సులోకి అడుగుపెట్ట‌డంతో.. జైల్లో అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీగా ఉన్న త‌న ప్రియుడ్ని పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది.

దీంతో యువ‌తి త‌న ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీని సంప్ర‌దించింది. ఈ క్ర‌మంలో యువ‌కుడు కూడా జైలు అధికారుల‌ను సంప్ర‌దించాడు. మొత్తంగా ఇరువురి అభ్య‌ర్థ‌న‌పై జైలు, న్యాయ‌శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు. పెళ్లి తంతుని మ‌రింత ప్రోత్స‌హించి ముందుకు న‌డిపించాయి. చ‌ట్ట‌ప‌ర‌మైన నిబంధ‌న‌ల మేర‌కు ఆ ప్రేమికులిద్ద‌రికి జైలు గోడ‌ల మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా వివాహం నిర్వ‌హించారు. పెళ్లి పందిరి వేసి, భాజాభ‌జంత్రీలు, వేద మంత్రోచ్ఛ‌ర‌ణాల మ‌ధ్య పెళ్లి చేశారు. ఈ పెళ్లి వేడుక‌లు ఇరు కుటుంబాలు పాల్గొన్నాయి.