Actor Tom Chacko: రోడ్డు ప్రమాదంలో నటుడు టామ్ చాకోకు తీవ్ర గాయాలు..తండ్రి మృతి

Actor Tom Chacko: రోడ్డు ప్రమాదంలో నటుడు టామ్ చాకోకు తీవ్ర గాయాలు..తండ్రి మృతి

విధాత : ప్రముఖ మలయాళ నటుడు, తెలుగులో దసరా సినిమా విలన్ షైన్ టామ్ చాకో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చాకో కుటుంబం ప్రయాణిస్తున్న కారు సేలం – బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చాకో తండ్రి మృతి చెందగా..చాకోతో పాటు తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్, చాకో తమ్ముడికి కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని హుటాహుటిన ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షైన్ కుటుంబం ఎర్నాకుళం నుండి బెంగళూరుకు వెళుతుండగా ముందు వెళ్తున్న లారీనీ కారు ఢీకొట్టింది.

తమిళనాడులోని పాలకోట్టాయ్ సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. తండ్రి మృతితో టామ్ చాకో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందిన చాకో ఇటీవల డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కోన్నారు. అలాగే ఆయనపై మలయాళ నటి లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా దూమారం రేపాయి.