కేజీఎఫ్ యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం
కేజీఎఫ్ సినిమా హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతుండగా షార్ట్ సర్క్యూట్‌తో ముగ్గురు అభిమానులు దుర్మరణం చెందారు

- బ్యానర్ కడుతుండగా షార్ట్ సర్క్యూట్
- ముగ్గురు అభిమానులు మృతి
- మరో నలుగురికి గాయాలు
- కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని
- సురనాగి గ్రామంలో విషాదం
విధాత: కేజీఎఫ్ సినిమా హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతుండగా షార్ట్ సర్క్యూట్‌తో ముగ్గురు అభిమానులు దుర్మరణం చెందారు. విద్యుదాఘాతంతో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, స్థానిక వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని సురనాగి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. సురానాగి గ్రామానికి చెందిన పలువురు యువకులు తమ అభిమాన నటుడు యశ్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి ఆదివారం అర్ధరాత్రి గుమిగూడారు. 25 అడుగుల కటౌట్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. సోమవారం తెల్లవారుజామున ఎనిమిది మంది యువకులు యశ్ కటౌట్‌ను కడుతుండగా, అది విద్యుత్తు వైర్లకు తాకి షార్ట్ సర్క్యూట్ జరిగింది.
కాగా.. ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై స్పృహతప్పి అక్కడికక్కడే పడిపోయారు. వారిని స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. మృతులను హనుమంత హరిజన్ (21), మురళి (20), నవీన్ గాజీ (19)గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన మరో నలుగురు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘోర ప్రమాదానికి గురైన యువకులు నటుడు యశ్ అభిమానులని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు. వారు ప్రతి సంవత్సరం నటుడి పుట్టినరోజును జరుపుకుంటారని, యశ్ కొత్త చిత్రం విడుదలైనప్పుడల్లా సంబురాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. గడగ్ జిల్లా దవాఖానలో మృతుల కుటుంబాలను పరామర్శించిన శిరహట్టి ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాని.. ఇది దురదృష్టకర సంఘటన అని తెలిపారు. ఈ విషాద ఘటనపై నటుడు ఇంకా స్పందించలేదు. లక్ష్మీశ్వర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు