Adilabad | ప్రమాదంలో కడెం.. డ్యామ్ ఫిల్లర్లకు పగుళ్లు
Adilabad కేంద్ర జల సంఘం నివేదిక డ్యామ్‌లో నీరు స్టోరేజ్ చేయొద్దని నిపుణుల సూచన ప్రాజెక్టు ఆధునీకరణ కు 6 వందల కోట్ల రూపాయల అంచనా విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఇటీవల భారీ వర్షాల వరదలతో గేట్లు మొరాయించి, ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో డేంజర్ లో పడిన కడెం ప్రాజెక్టు పరిస్థితిపై కేంద్ర జల సంఘం అధ్యయన బృందం సంచలన నివేదిక సమర్పించింది. జూలై 29 ఏబి పాండ్యా నేతృత్వంలోని డిఎస్ఆర్సి […]

Adilabad
- కేంద్ర జల సంఘం నివేదిక
- డ్యామ్‌లో నీరు స్టోరేజ్ చేయొద్దని నిపుణుల సూచన
- ప్రాజెక్టు ఆధునీకరణ కు 6 వందల కోట్ల రూపాయల అంచనా
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ఇటీవల భారీ వర్షాల వరదలతో గేట్లు మొరాయించి, ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో డేంజర్ లో పడిన కడెం ప్రాజెక్టు పరిస్థితిపై కేంద్ర జల సంఘం అధ్యయన బృందం సంచలన నివేదిక సమర్పించింది. జూలై 29 ఏబి పాండ్యా నేతృత్వంలోని డిఎస్ఆర్సి కమిటీ 24 మంది సభ్యుల బృందం ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించింది.
మూడు ఫిల్లర్లకు పగుళ్ళు తేలినట్లు నిర్ధారించింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తే క్రమంలో వాటికి రక్షణ కవచంలా ఉండే ఫిల్లర్లకు పగుళ్లు ఉన్నట్లు గుర్తించారు. కౌంటర్ వెయిట్ లు బలంగా తగలడం వల్లే పగుళ్లు ఏర్పడినట్లు నివేదిక సమర్పించారు. ప్రాజెక్టు 3 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద నీటిని మాత్రమే తట్టుకోగలదని, జూలై 27 న వచ్చిన భారీ వరద సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరకు వచ్చిందని, 5 లక్షల క్యూసెక్కుల నీటిని ఆపగలిగే విధంగా ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి ఆధునికరించాలని, స్పిల్ వే పెంచాలని సూచన చేశారు.
అప్పటివరకు కడెం ప్రాజెక్టుకు వచ్చిన వరద వచ్చినట్లే వెంటనే కిందికి పంపాలని ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయరాదని పేర్కొన్నారు . ప్రాజెక్టు 5 లక్షల క్యూసెక్కుల సామర్థ్యానికి స్పిల్ వే పెంచడానికి సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు.
ఈ ప్రాజెక్టును కేంద్రం డ్యాం రిహాబిలిటేషన్ ఇంప్లిటేషన్ ప్రాజెక్టుల జాబితాలోకి చేర్చింది. కడెం ప్రాజెక్టు ఆధునికరణ కోసం కేంద్ర ప్రభుత్వం 70% నిధులను రుణ రూపంగా ఇస్తుందని 30% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. 5 లక్షల క్యూసెక్కుల నీటి సామర్ధ్యాన్ని పెంచిన తరువాతే ప్రాజెక్టులో నీటి నిల్వ చేయాలని సూచించినట్లు సమాచారం.
రైతుల ఆందోళన
గత సంవత్సరం వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు ఎత్తిన గేట్లలో వర్షాలు తగ్గు ముఖం పట్టినప్పటికీ కొన్ని గేట్లు కిందికి దిగకపోవడంతో వరద నీరు మొత్తం గోదావరిలో కలిసింది. దాని మూలంగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందలేదని రైతులు ఆరోపించారు. ఈ సంవత్సరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచరాదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో కడెం ఆయకట్టు రైతుల సాగునీటి వసతి ప్రశ్నా ప్రశ్నార్థకంగా మారింది.
గత సంవత్సరమే ప్రాజెక్టు ఆధునికరించినట్లయితే ఈ సంవత్సరం వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు తప్పేది. సాగునీటికి ఇబ్బంది ఉండకపోయేది. పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఈ సంవత్సరం పూర్తిగా ఆయకట్టు స్తంభించే అవకాశాలున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు కడెం, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు సాగునీరు అందిస్తుంది.