‘దివ్యాస్త్రం’ అగ్ని-5 ప్రత్యేకతలివిగో.!
భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ - డిఆర్‌డిఓ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంఆర్ఐవి సాంకేతికతను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించింది

భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ – డిఆర్‌డిఓ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎంఆర్ఐవి సాంకేతికతను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించింది. దీంతో ఈ సాంకేతికత సాధించిన దేశాల సరసన సగర్వంగా నిలబడింది.
భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ఎంఆర్ఐవి ( మల్టిపుల్ ఇండిపెండెట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్) సాంకేతికతను తన కొత్త ఖండాతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 ద్వారా విజయవంతంగా పరీక్షించింది. ఈ సాంకేతికతను గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చేస్తున్న డిఆర్‌డిఓ ఎట్టకేలకు ఘనవిజయం సాధించి అభివృద్ధిచెందిన దేశాల సరసన భారత్‌ను నిలబెట్టింది. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా జరిగిన ఈ ప్రయోగం పట్ల దేశ నేతలు, శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేసారు. ప్రధానమంత్రి తన ఎక్స్ సందేశంలో ఎంఆర్ఐవి సాంకేతికతతో స్వంతంగా తయారుచేసిన అగ్ని-5 క్షిపణి విజవంతం అయినందుకు డిఆర్‌డిఓ శాస్త్రజ్ఞులకు అభినందనలు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని కొనియాడారు. ఈ మిషన్‌కు ఆధిపత్యం వహించింది ఒక మహిళ కావడం, పలువురు మహిళలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించడం కొసమెరుపు.

ఇంతకీ ఈ ఎంఆర్ఐవి అంటే ఏంటి?
ఈ ఎంఆర్ఐవి ( మల్టిపుల్ ఇండిపెండెట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికిల్) వ్యవస్థపై భారత శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. ఇది చాలా అధునాతన సాంకేతికత. ఎంఆర్ఐవి కలిగిన అగ్ని-5 లాంటి క్షిపణి ఒకేసారి వివిధ రకాల అస్త్రాలను వేర్వేరు లక్ష్యాలపై గురిపెట్టి ప్రయోగించగలదు. ఇందులో అణ్వస్త్రం కూడా ఉండొచ్చు. ఉదాహరణకు ఐదు బాంబులను ఆకాశంలోకి తీసుకెళ్లి తిరిగివచ్చేటప్పుడు ఈ ఐదింటినీ వేర్వేరు లక్ష్యాలపై వేయొచ్చు. ఈ బాంబులు కూడా వివిధ రకాలుగా ఉండవచ్చు. ఏ బాంబు లక్ష్యం దానిదే. వీటన్నింటిని అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించేలా అత్యాధునిక వైమానిక వ్యవస్థ, సున్నితమైన సెన్సర్లు ఈ క్షిపణిలో ఉంటాయి. అగ్ని-5 లాంటి ఖండాతర క్షిపణి ముందుగా తన పేలోడ్లు ( ఆస్త్రాలు) అన్నింటినీ మోసుకుని, భూకక్ష్య దాటి అంతరిక్షంలోకి ప్రవేశించి, తిరిగి భూమివైపు ప్రయాణిస్తుంది. ఈ తిరిగివచ్చే క్రమంలో ఒక్కో అస్త్రానికి ఒక్కో లక్ష్యాన్ని నిర్దేశించి, అవన్నీ తమ తమ లక్ష్యాలను ఖచ్చితంగా చేరేలా ప్రయోగిస్తుంది. ఈ లక్ష్యాలు వేర్వేరు ప్రదేశాలలో ఉన్నా పని జరిగిపోతుంది. అంటే , వేర్వేరు ప్రదేశాలలోని వేర్వేరు లక్ష్యాలను ఈ అస్త్రాలు అత్యంత ఖచ్చితత్వంతో చేధిస్తాయి. ఈ బాంబులు అణుబాంబులు కావచ్చు, కాకపోవచ్చు. కొన్ని మిసైళ్లు ఒకదానికొకటి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చేధిస్తాయి.
ఈ సాంకేతికత మనకు శత్రుదేశాల కంటే ముందుగా బహుళ లక్ష్యాలను గురిపెట్టి, వారిని అయోమయానికి గురిచేయడం, వారి క్షిపణి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్షిపణి నిరోధక వ్యవస్థ ఒకేసారి ఒకే మిసైల్‌ను టార్గెట్ చేసుకుంటుంది. అగ్ని క్షిపణిని ఇంతకుముందు పరీక్షించారు గానీ, అప్పుడు ఒకే వార్‌హెడ్‌తో చేసారు. ఎప్పుడైనా ఒక క్షిపణి అంతరిక్షంలోకి వెళ్లి, తిరిగి భూవాతావరణంతోకి ప్రవేశించినప్పుడు అది చాలా వేగంగా గతిశక్తి సహకారంతో కిందకు పడడానికి వస్తుంది. అప్పుడు దాని వేగం శబ్ద వేగానికంటే ఐదు రెట్లు పెరుగుతుంది. అగ్ని-5 క్షిపణి పరిధి 5వేల కి.మీ పైగా ఉంది. ఈ పరిధిలోని అనేక నగరాలను ఒకేసారి గురిపెట్టి చేధించడం ఎంఆర్ఐవీ టెక్నాలజీ ప్రత్యేకత. ఒకసారి మిసైల్ సరైన ఎత్తుని చేరుకుని వార్‌హెడ్లను వదిలాక, అవి లక్ష్యాలవేపు దూసుకుపోవడమే కాకుండా క్షిపణి నిరోధక వ్యవస్థను తప్పించుకునే విన్యాసాలను కూడా చేస్తాయి.
అగ్ని-5 పరీక్ష నిర్వహించేందుకు గతవారం భారత్ ఒక నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్)ను విడుదల చేసింది. అందులో 3500 కి.మీ మేర దక్షిణ బంగాళఖాతం ఆకాశాన్ని నో-ఫ్లై జోన్‌గా నిర్థారించింది. దాంతో చుట్టుపక్కల దేశాలకు భారత్ క్షిపణి పరీక్ష చేపట్టబోతోందని అర్థమైంది. దీంతో చైనా హుటాహుటిన తన నిఘానౌక జియాన్ యాంగ్ హాంగ్-01ను విశాఖపట్నానికి 480 కి.మీ దూరంలో తిష్టవేసింది. ఈ నౌక ఉపరితలం మీద, సముద్రం లోపల జరిగే మార్పులను శబ్దతరంగాల ద్వారా గుర్తించగలదు. అంటే ఇతర దేశాల జలాంతర్గాముల కదలికలను గుర్తించగలిగే సామర్థ్యం కలిగిఉంది. అన్నట్టు, భారత్ తన మూడు అణు సామర్థ్య జలాంతర్గాములను విశాఖపట్నంలోనే మోహరించింది. అయితే ఈ చైనా నౌక కదలికలను తాము నిశితంగా గమనిస్తున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. అది అంతర్జాతీయ జలాల్లో ఉంది కాబట్టి ఏమీ అనలేం.
నిజానికి ఈ సాంకేతికతను 1960ల్లోనే అభివృద్ధి చేయడం ప్రారంభించినా, మొదటిగా అమెరికా 1970లో ఖండాతర బాలిస్టిక్ క్షిపణి ద్వారా, 1971లో జలాంతర్గత బాలిస్టిక్ క్షిపణి (జలాంతర్గామి నుండి) నుండి పరీక్షించి విజయం సాధించింది. వెనువెంటనే రష్యా కూడా ఈ ప్రయోగం చేపట్టి 1971లోనే విజయవంతంగా పరీక్షించింది. ప్రస్తుతం ఈ సాంకేతికత అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇజ్రాయెల్, భారత్‌ల వద్ద మాత్రమే ఉంది.