అంగన్వాడీలపై సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా
తమ డిమాండ్లను పరిష్కారించాలని గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

విధాత : తమ డిమాండ్లను పరిష్కారించాలని గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మెను నిషేదిస్తున్నట్లు అందులో పేర్కొంది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేదిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. దాదాపు రూ.3వేలు తగ్గించి.. రూ.8,050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమచేసింది.
ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మెలు, ఆందోళనలు చేసే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో పాటు చట్టపరమైన క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారిని, ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష జరిమానా, లేక ఆ రెండు కూడా విధించే అవకాశముంది. కాగా అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి