ఆంధ్రా నుంచి పారిపోయి తెలంగాణ వచ్చిన దొంగలను పట్టుకునేందుకు ఆంధ్ర నుంచి పోలీసుల రావడం సహజం. అలాగే తెలంగాణ పోలీసులు ఆంధ్రకు వెళ్తుంటారు.
AP | హైదరాబాద్: ఆంధ్రా నుంచి పారిపోయి తెలంగాణ వచ్చిన దొంగలను పట్టుకునేందుకు ఆంధ్ర నుంచి పోలీసుల రావడం సహజం. అలాగే తెలంగాణ పోలీసులు ఆంధ్రకు వెళ్తుంటారు. అయితే.. ఇక్కడ ఆంధ్ర పోలీసులను తెలంగాణ పోలీసులు పట్టుకోవడం సంచలనం రేపింది. అందునా వారు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. ఎంతైనా స్మగ్లింగ్ చేసేవాళ్లకు కొంత తెలివితేటలు ఉండాలి. అందులో ఆరితేరి ఉండాలి. ఆ ఎక్స్‌పీరియన్స్‌లేకపోవడం వారికి పట్టిచ్చింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరిలోని బాచుపల్లిలో చోటు చేసుకున్నది.బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఎస్‌వోటీ బాలానగర్ పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం ఆధారంగా ఏపీ 39 క్యూహెచ్ 1763 మారుతీ సీఈవో వాహనాన్ని నిలిపి, పరిశీలించగా 11 ప్యాకెట్లలో ఉన్న 22 కేజీల గంజాయిని గుర్తించారు. దీని విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడలోని మూడో బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అని తేలింది. వీరు గంజాయి స్మగ్లింగ్‌తో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో ఆరోగ్యం బాగాలేదు అనే సాకుతో సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్‌కు వచ్చినట్టు తేలింది. అయితే.. ఇదే వారి మొదటి స్మగ్లింగ్ ఘటన. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.