Nara Lokesh| మంత్రి నారా లోకేష్ ఫోటోతో రూ.54 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

మంత్రి నారా లోకేష్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని సైబర్ నేరగాళ్లు రూ.54లక్షలు కాజేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ముగ్గురు సైబర్ నేరగాళ్లు రూ.54.34 లక్షలు వసూలు చేశారు. నిందితులను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

Nara Lokesh| మంత్రి నారా లోకేష్ ఫోటోతో రూ.54 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

విధాత : మంత్రి నారా లోకేష్( Nara Lokesh) ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని సైబర్(Cyber Criminals) నేరగాళ్లు రూ.54లక్షలు కాజేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. టీడీపీ ఎన్నారై కన్వీన్ పేరిట కొండూరి రాజేశ్‌ తన వాట్సాప్ డీపీగా నారా లోకేష్ ఫోటోను పెట్టుకోవడంతో పాటు ఎక్స్‌’లో… హెల్ప్‌ ఎట్‌ నారా లోకేష్, హెల్ప్‌ ఎట్‌ పవన్‌కల్యాణ్, హెల్ప్‌ ఎట్‌ ఎన్‌సీబీఎన్‌ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెట్టి చలామణి అవుతున్నాడు. రాజేశ్, అతని సహచరులు గుత్తికొండ సాయి శ్రీనాథ్, చిత్తడి తల సుమంత్‌ లతో కలిసి వైద్యచికిత్సల కోసం ఆర్థికసాయం అవసరమైన వ్యక్తుల వివరాలు సేకరించేవారు. యూఎస్‌ మొబైల్‌ నంబర్‌లాగే కనిపించే నంబర్‌తో వాట్సప్‌లో అలాంటి వారిని సంప్రదించేవారు. వైద్యచికిత్సల కోసం ఆర్థికసాయం చేస్తానని నమ్మించేవాడు. నకిలీ బ్యాంకు క్రెడిట్‌ రసీదులు పంపించి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు నమ్మించేవాడు.

కొన్ని రోజుల తర్వాత బ్యాంకు మేనేజర్లుగా మాట్లాడుతూ.. సాయంగా అందించిన డబ్బులు జమ కావాలంటే 4శాతం రేమిటెన్స్ చార్జెస్ కట్టాలంటూ డబ్బులు వసూలు చేసేవాడు. అలా ముగ్గురు సైబర్ నేరగాళ్లు రూ.54.34 లక్షలు వసూలు చేశారు. వీరి మోసాలపై ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌కు సంబంధించిన 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు 16 ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీసత్యసాయి జిల్లా రాచువారిపల్లెకు చెందిన కొండూరి రాజేష్‌నుఏపీ పోలీసులు(AP Police) జనవరి 5న అరెస్టు చేయగా, అతని మోసాలకు సహకరించిన గచ్చిబౌలిలో నివసించే గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి శ్రీనాథ్‌ (ఏ-2), పటాన్‌చెరు నివాసి చిత్తడి తల సుమంత్‌ను (ఏ-3) బుధవారం అదుపులోకి తీసుకున్నారు.