Pragati Bhavan | ప్రగతిభవన్‌లో బుజ్జగింపులు! హామీలిచ్చి పంపుతున్న అధిష్ఠానం

Pragati Bhavan | సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్ల కేటాయింపు! అసమ్మతి లేకుండా ముందు జాగ్రత్త 33 నియోజకవర్గాల్లో బీఆరెస్‌ వీక్‌? గెలుపు బాధ్యత కేటీఆర్‌, హరీశ్‌పై! ఈసారి కూడా గజ్వేల్‌ నుంచే కేసీఆర్‌? (విధాత ప్రతినిధి): బీఆరెస్ తొలి జాబితా రేపో మాపో విడుదల చేయనున్న నేపథ్యంలో టికెట్ దక్కని సిటింగ్‌లు, ఆశావహుల నుంచి అసమ్మతి తలెత్తకుండా ఆ పార్టీ అధిష్ఠానం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నది. అసంతృప్తులను బుజ్జగించే ప్రక్రియ చేపట్టింది. సిటింగ్ ఎమ్మెల్యేలకు దాదాపుగా […]

  • By: krs    latest    Aug 18, 2023 12:00 PM IST
Pragati Bhavan | ప్రగతిభవన్‌లో బుజ్జగింపులు! హామీలిచ్చి పంపుతున్న అధిష్ఠానం

Pragati Bhavan |

  • సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్ల కేటాయింపు!
  • అసమ్మతి లేకుండా ముందు జాగ్రత్త
  • 33 నియోజకవర్గాల్లో బీఆరెస్‌ వీక్‌?
  • గెలుపు బాధ్యత కేటీఆర్‌, హరీశ్‌పై!
  • ఈసారి కూడా గజ్వేల్‌ నుంచే కేసీఆర్‌?

(విధాత ప్రతినిధి): బీఆరెస్ తొలి జాబితా రేపో మాపో విడుదల చేయనున్న నేపథ్యంలో టికెట్ దక్కని సిటింగ్‌లు, ఆశావహుల నుంచి అసమ్మతి తలెత్తకుండా ఆ పార్టీ అధిష్ఠానం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నది. అసంతృప్తులను బుజ్జగించే ప్రక్రియ చేపట్టింది. సిటింగ్ ఎమ్మెల్యేలకు దాదాపుగా టికెట్లు ఇస్తూ 2018 మాదిరిగానే మొత్తం 105 స్థానాలతో తొలి జాబితా ఇస్తారని బీఆరెస్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతున్నది. ఏడు స్థానాల్లో మాత్రమే సిటింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తారని సమాచారం.

తన లక్కీ నంబర్ ఆరును అనుసరించి, శ్రావణ మాసం సెంటిమెంట్ నేపథ్యంలో తొలి జాబితాను ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని తెలుస్తున్నది. తొలుత చాలా మంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తారని ప్రచారం జరిగినా.. ఏడుగురిని మాత్రమే ఈసారి మార్చబోతున్నారని సమాచారం. మరికొందరు ఆశావహులకు కూడా అవకాశం కల్పించడం లేదు.

ఈ నేపథ్యంలో టికెట్లు దక్కని వారిని, అసంతృప్తితో ఉన్న నేతలను, టికెట్‌ ఆశిస్తున్న వారిని అసమ్మతివాదులను నేరుగా ప్రగతిభవన్‌కు పిలిపించి.. రెండు రోజులుగా మమ్మరంగా బుజ్జగింపుల పర్వం సాగిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ప్రధానంగా తాండూరు టికెట్ ఆశిస్తున్న పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవిని, నకిరేకల్ టికెట్ ఆశిస్తున్న వేముల వీరేశం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రకారం జరుగుతున్నది.

ఇతర నియోజకవర్గాల్లోని అసంతృప్త, అసమ్మతి నేతలకు కూడా ఎమ్మెల్సీ సీట్లు, కార్పొరేషన్‌ పదవులు ఆశచూపుతున్నారని సమాచారం. ఈసారికి సర్దుకుపోవాలని, అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తామని హామీలిస్తున్నారని తెలుస్తున్నది. అయితే.. ఈ బుజ్జగింపులతో అసంతృప్త నాయకులు, టికెట్‌ దక్కదని తెలిసినవారు ఎంతమేరకు చల్లబడ్డారన్నది మునుముందు తేలనుంది.

వివాదాలే లేని వారితోనే తొలి జాబితా!

అయితే బీఆరెస్ తొలి జాబితా పేర్లలో ఎక్కువగా వివాదాలు లేనటువంటి, సీనియర్ నాయకులు, మంత్రులు ఉన్నటువంటి స్థానాలే ఉంటాయని భావిస్తున్నారు. కేసీఆర్ మరోసారి గజ్వేల్‌ నుండి పోటీ చేయనుండగా, ఆయన నియోజకవర్గ మార్పు ప్రచారానికి చెక్ పడనుంది.

పలు చోట్ల అభ్యర్థుల మార్పు?

బీఆరెస్ అభ్యర్థుల ఖరారులో పలుచోట్ల సిటింగ్ అభ్యర్థులను మారుస్తారని తెలుస్తున్నది. ఉమ్మడి కరీంనగర్‌, నిజమాబాద్ జిల్లాల్లో మార్పు లేదని సమాచారం. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోసం ఆ స్థానంలో బీఆరెస్ టికెట్ పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ పదవీ ఆఫర్ చేశారని సమాచారం.

జహీరాబాద్‌లో సిటింగ్ ఎమ్మెల్యే కే మాణిక్ రావుకు కూడా టికెట్ దక్కకపోవచ్చని తెలుస్తున్నది. అదిలాబాద్‌లో బోథ్ ఎమ్మెల్యే బాబురావు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్‌లకు ఈసారి చాన్స్‌ లేనట్టేనని అంటున్నారు.

ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం సీట్లు సీపీఐ, సీపీఎంలకు కేటాయించేందుకు పెండింగ్‌లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుకు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు టికెట్ దక్కకపోవచ్చని తెలుస్తుంది. అలాగే నల్లగొండ జిల్లాలో మునుగోడు, ఖమ్మంలోని భద్రాచలం సీట్లను కూడా కమ్యూనిస్టుల కోసం పెండింగ్‌లో పెట్టనున్నారని సమాచారం.

ఆ 33 సీట్లలో బలహీనం?

మరోవైపు బీఆరెస్ సర్వేల్లో పార్టీ 33 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ గుర్తించారని, ఆ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుపై పెట్టారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఆ నియోజకవర్గాల్లో బీఆరెస్ నేతలతో ఒకవైపు కేటీఆర్, హరీశ్‌ సంప్రదింపులు చేస్తునే ఇంకోవైపు ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలకు గాలం వేసే పనులు ముమ్మరం చేశారని తెలుస్తున్నది.

మూడోసారి అధికారంలోకి రావడానికి సదరు 33 స్థానాల్లో గెలుపు చాలా ముఖ్యమని పార్టీ అధినాయకత్వం తలపోస్తున్నది. అందుకు కేటీఆర్‌, హరీశ్‌ డైరెక్షన్‌లో వలసల ఆపరేషన్ సాగుతున్నదని సమాచారం. గెలుపు కోసం సర్వ శక్తులొడ్డటంతోపాటు పదవులు సహా ఇతరత్రా ఎలాంటి ఆఫర్లు ఇచ్చేందుకైనా సిద్ధమని సంకేతాలు పంపుతున్నారని, దీంతో ఆ నియోజకవర్గాల్లో అనూహ్య వలసలుంటాయని భావిస్తున్నారు.