ఎంత చెప్పుకున్నా తక్కువే..అర్జున, ఖేల్‌ ‘రత్నాలు’

  • By: sr    latest    Jan 04, 2025 7:09 PM IST
ఎంత చెప్పుకున్నా తక్కువే..అర్జున, ఖేల్‌ ‘రత్నాలు’

2024 సంవత్సరానికి 32 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ గురువారం తుది జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ అమ్మాయి, పారా అధ్లెట్ దీప్తి జివాంజి అర్జున అవార్డుకు ఎంపికై రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచింది. దీప్తితో పాటు ఆంధ్రప్రదేశ్‎లోని విశాఖపట్నంకు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజి కూడా అర్జున అవార్డుకు సెలెక్ట్ అయ్యింది. ఈ విజేతలకు 2025, జనవరి 17న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రధానం చేయనున్నారు.

కల్లెడ నుంచి పారిస్ దాకా..

వరంగల్‎ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‎లో కాంస్య పతకం దక్కించుకున్న విషయం తెలిసిందే. 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్స్‎లో 55.82 సెకన్లలో రేస్‏ని కంప్లీట్ చేసిన తెలంగాణ అమ్మాయి కాంస్య పతకం అందుకుంది. తద్వారా పారాలింపిక్స్‎లో ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్ విభాగంలో భారత్ కు తొలి ఒలింపిక్ మెడల్ సాధించిన అథ్లెట్‍గా దీప్తి జివాంజి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ముందు జపాన్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లోనూ 400 మీటర్ల రేస్‎ను 55.07 సెకన్లలో పూర్తి చేసిన దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డ దీప్తి.. ఖమ్మం డిస్ట్రిక్ అథ్లెటిక్ మీట్‭లో కోచ్ నాగపూరి రమేష్ దృష్టిలో పడింది. దీప్తి అద్భుత టాలెంట్‎ను గుర్తించిన కోచ్ రమేష్.. ఆమెను హైదరాబాద్‭కి తీసుకొని వచ్చి భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ట్రైయినింగ్ ఇప్పించారు. పారిస్ పారాలింపిక్స్‎లో మెడల్ గెలవడం ద్వారా దీప్తి పేరు మారుమోగింది. విశ్వ క్రీడల్లో పతకం సాధించిన దీప్తిని కేంద్రం అర్జున అవార్డుతో సత్కరించింది.

విశాఖపట్నంకు చెందిన పరుగుల రాణి జ్యోతి యర్రాజీ పేద కుటుంబంలో 999 ఆగస్ట్ 28న జన్మించింది. కష్టాల కడలిని దాటి విశ్వక్రీడలకు వరకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. స్థానికంగానే విద్యాభ్యాసం చేసిన జ్యోతి, 25 ఏళ్లకే అనేక జాతీయ రికార్డుల్ని నెలకొల్పింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు(12.78 సెకన్లు) ఇంకా ఆమె పేరిటే ఉంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో రజతం, డబ్యూయూజీలో కాంస్యం సాధించింది. ఈ ప్రయాణంతో ఆమె తల్లి కుమారి కష్టం ఎంతో ఉంది. అమ్మ అండతోనే భారత టాప్ అథ్లెట్‌గా జ్మోతి ఎదిగి, పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటింది. జ్యోతికి చిన్నతనం నుంచే క్రీడారంగా ఆసక్తి ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు కానీ, తల్లి కుమారి జ్యోతిని ఎంతో ప్రోత్సహించారు. జ్యోతి భవిష్యత్ కోసం డబుల్ షిఫ్ట్ పని చేశారు. ఇళ్లల్లో పనిచేయడంతో పాటు స్థానిక ఆసుపత్రిలో క్లీనర్‌గా పనిచేశారు. తల్లి కష్టాన్ని వృథా చేయకుండా జ్యోతి తీవ్రంగా శ్రమించింది ఇప్పటి వరకూ ఎన్నో రికార్డులను తిరగరాసింది. జ్యోతి అత్యున్నత అథ్లెట్‌గా ఎదగడంలో అమ్మ కష్టంతో పాటు కోచ్ జేమ్స్ హీలియర్ కూడా ప్రధాన పాత్ర వహించారు.

నలుగురు క్రీడా రత్నాలు

భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుకు నలుగురు ఎంపికయ్యారు. 2024 ఏడాదికి గాను చెస్‌ విభాగంలో డి.గుకేశ్‌, హాకీ విభాగంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, పారా అథ్లెట్‌ విభాగంలో ప్రవీణ్‌ కుమార్, షూటింగ్‌ విభాగంలో మను బాకర్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాది క్రీడల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన 32మంది క్రీడాకారులకు అర్జున, ఐదుగురిని ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్నవారిలో 17మంది పారా అథ్లెట్స్‌ ఉండటం విశేషం. వచ్చే జనవరి 17న ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకుంటారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఘనతలివే

భారత స్వాతంత్య్రం వచ్చాక, ఒకే ఒలింపిక్‌ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మను బాకర్ ఘనత సాధించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ వ్యక్తిగత విభాగంతోపాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యాలను సొంతం చేసుకుంది. తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రకటించిన జాబితాలో పేరు ఉండటంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేశ్‌కు ఖేల్‌ రత్న అవార్డు వరించింది. ఒలింపిక్స్‌లో వరుసగా భారత్‌ రెండో పతకం సాధించడంలో హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించగా.. పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌ కుమార్ హై జంప్‌ T64 విభాగంలో బంగారు పతకం సాధించాడు.

అర్జున అవార్డు గ్రహీతలు:

జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్‌), అన్ను రాణి (అథ్లెటిక్స్‌), నీతు (బాక్సింగ్‌), స్వీటీ బురా (బాక్సింగ్‌), వంతిక అగర్వాల్‌ (చెస్‌), సలీమా (హాకీ), అభిషేక్‌ (హాకీ), సంజయ్‌ (హాకీ), జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), సుఖ్‌జీత్‌ సింగ్‌ (హాకీ), స్వప్నిల్‌ సురేష్‌ కుసాలే (షూటింగ్‌), సరబ్‌జోత్‌ సింగ్‌ (షూటింగ్‌), అభయ్‌ సింగ్‌ (స్క్వాష్‌), సజన్‌ ప్రకాశ్‌ (స్విమ్మింగ్‌), అమన్‌ (రెజ్లింగ్‌), రాకేశ్‌ కుమార్‌ (పారా ఆర్చర్‌), ప్రీతి పాల్‌ (పారా అథ్లెటిక్స్‌), జీవాంజి దీప్పతి (పారా అథ్లెటిక్స్‌), అజీత్‌సింగ్‌ (పారా అథ్లెటిక్స్‌), సచిన్‌ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్‌), ప్రణవ్‌ సూర్మ (పారా అథ్లెటిక్స్‌), హెచ్‌. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్‌), సిమ్రాన్‌ (పారా అథ్లెటిక్స్‌), నవ్‌దీప్‌ (పారా అథ్లెటిక్స్‌), నితీశ్ కుమార్‌ (పారా బ్యాడ్మింటన్‌), తులసీమతి మురుగేశన్‌ (పారా బ్యాడ్మింటన్‌), నిత్య శ్రీ సుమతి శివన్‌ (పారా బ్యాడ్మింటన్‌), మనీశా రాం దాస్‌ (పారా బ్యాడ్మింటన్‌), కపిల్‌ పర్మార్‌ (పారా జుడో), మోనా అగర్వాల్‌ (పారా షూటింగ్‌), రుబినా ఫ్రాన్సిస్‌ (పారా షూటింగ్‌), అర్జున అవార్డ్స్‌ (లైఫ్‌టైమ్‌), సుచా సింగ్‌ (అథ్లెటిక్స్‌), మురళీకాంత్‌ రాజారాం పెట్కర్‌ (పారా స్విమ్మింగ్‌).

ద్రోణాచార్య అవార్డులు (కోచ్‌లు)
సుభాష్‌ రాణా (పారా షూటింగ్‌), దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్‌), సందీప్‌ సంగ్వాన్‌ (హాకీ).

లైఫ్‌ టైం కేటగిరీ..
మురళీధరన్‌ (బ్యాడ్మింటన్‌),అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్‌).