ఇద్దరు మాజీ సీఎంల కొడుకులకు ఎంపీ టికెట్లు
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో రెండో జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం విడుదల చేసింది. ఇందులో 43 పేర్లు ఉన్నాయి

కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో రెండో జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ మంగళవారం విడుదల చేసింది. ఇందులో 43 పేర్లు ఉన్నాయి. పది మంది జనరల్ కాండిడేట్లు ఉంటే.. ఓబీసీలకు 13, ఎస్సీలకు 10, ఎస్టీలకు 9, ముస్లింలకు 1 కేటాయించారు. రెండో జాబితాలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్, సిటింగ్ ఎంపీ గౌరవ్ గగోయ్ పేర్లు ఉన్నాయి. అసోం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తాజాగా అభ్యర్థులను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. గౌరవ్ గగోయ్ అసోంలోని జొర్హాట్ నుంచి పోటీ చేస్తారు. నకుల్‌నాథ్ మద్యప్రదేశ్‌లోని ఛింద్వారా నుంచి, రాజస్థాన్‌లోని చురు నుంచి వైభవ్ గెహ్లాట్ పోటీచేయనున్నారని వేణుగోపాల్ తెలిపారు. కమల్‌నాథ్, నకుల్‌నాథ్ ఇద్దరూ బీజేపీతో టచ్‌లో ఉన్నారని, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఆ పార్టీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీలో వారిద్దరూ అవమానాలకు గురయ్యారని కమల్‌నాథ్ సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు కూడా! అయితే.. తమ రాజీనామా వార్తలు అవాస్తవాలని తేల్చి చెప్పారు. గౌరవ్ గగోయ్ దివంగత కాంగ్రెస్ నేత తరుణ్‌గగోయ్ కుమారుడు.