Assembly Elections | సంక్షేమం.. ఎన్నికల మంత్రం! అధికార, విపక్షాల తంత్రం
Assembly Elections ఇప్పటికే కాంగ్రెస్ పలు డిక్లరేషన్లు పోటీగా బీఆరెస్ పథకాల ప్రకటన విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్షాలు తమ విజయానికి సంక్షేమ పథకాలే ప్రధాన అస్త్రాలుగా భావిస్తున్నాయి. దీంతో పోటాపోటీ పథకాలతో ప్రజలను అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రేసులో కాంగ్రెస్, బీఆరెస్‌లు నువ్వానేనా అన్నట్లుగా పరుగెడుతున్నాయి. తమ పార్టీకి జనంలో మైలేజ్ తెచ్చే బ్రాండ్ అంబాసిడర్.. పేటెంట్ వంటి సంక్షేమ పథకాల రూపకల్పనలో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ […]
Assembly Elections
- ఇప్పటికే కాంగ్రెస్ పలు డిక్లరేషన్లు
- పోటీగా బీఆరెస్ పథకాల ప్రకటన
విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్షాలు తమ విజయానికి సంక్షేమ పథకాలే ప్రధాన అస్త్రాలుగా భావిస్తున్నాయి. దీంతో పోటాపోటీ పథకాలతో ప్రజలను అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రేసులో కాంగ్రెస్, బీఆరెస్‌లు నువ్వానేనా అన్నట్లుగా పరుగెడుతున్నాయి. తమ పార్టీకి జనంలో మైలేజ్ తెచ్చే బ్రాండ్ అంబాసిడర్.. పేటెంట్ వంటి సంక్షేమ పథకాల రూపకల్పనలో పోటీ పడుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ నుంచి డిక్లరేషన్లు
ప్రతిపక్ష కాంగ్రెస్.. వరుసగా రైతు, యువత, భూమి డిక్లరేషన్ చేయడంతో పాటు ఇప్పటికే కొన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలోని సంక్షేమ పథకాలను జనంలోకి వదిలింది. దీంతో అప్రమత్తమైన అధికార బీఆరెస్.. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు తోడు కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను వరుసగా ప్రకటిస్తూ రేసులో ముందు ఉండేందుకు ప్రయత్నిస్తున్నది. వాటిలో బీసీ బంధు, మైనార్టీ బంధు, రైతు రుణమాఫీ, గృహలక్ష్మి పథకాలతోపాటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వీఆర్ఏల సర్దుబాటు, విద్యార్థుల డైట్ చార్జీల పెంపు, జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ అంశాలు ఉన్నాయి.
తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చి, దేశం ఆశ్చర్యపోయేలా కొత్త పీఆర్సీని ఇస్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు షాకిచ్చేలా.. ‘మీరు వరంగల్ లో నాలుగు వేల పింఛన్ అన్నారు.. మేము ఐదు వేలు అంటాం.. ఇలాంటి అస్త్రాలు మా అమ్ముల పొదిలో చాలానే ఉన్నాయి.. ఒక్కొక్కటిగా బయటకు తీస్తాం’ అంటూ సంక్షేమ రేసును మరింత ఆసక్తికరంగా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి అమలుకు కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇప్పటికే పింఛన్ వయసును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తున్నారు. గొర్రెలు, చేప పిల్లల పంపిణీ స్కీంలు, మత్స్యకారులకు వాహనాల స్కీమ్, దళిత బంధు అమలు చేస్తున్నారు. మహిళలు, యువత పథకాల రూపకల్పనకు కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం గులాబీ వర్గాల్లో వినిపిస్తున్నది.
తెలంగాణలో ఇప్పటికే ప్రకటించిన, కొత్తగా ప్రకటించిన పథకాలతో గడిచిన తొమ్మిదేళ్లలో ఒక్కో నియోజకవర్గంలో రెండున్నర లక్షల మందికి పైగా లబ్ధిదారులున్నారన్న ధీమాతో ఉన్న బీఆరెస్.. ఆ సంక్షేమ పథకాలే తమను మూడోసారి గద్దెనెక్కిస్తాయని లెక్కలేసుకుంటున్నది.
కర్ణాటక వ్యూహాలే అనుసరణీయాలు
అధికార, విపక్ష పార్టీల ఎన్నికలకు వ్యూహాలకు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు, పథకాలు, ప్రచార వ్యూహాలే అనుసరణీయంగా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో మాదిరిగానే ఎన్నికల ఏరును సంక్షేమ పథకాలే దాటిస్తాయని పార్టీలు నమ్ముతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ బీపీఎల్ కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు 2000 ఆర్థిక సహాయం, బీపీఎల్ కుటుంబానికి పది కిలోల బియ్యం, మూడు వేల నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ వసతి, మత్స్య కార్మికులకు 500 లీటర్ల డీజిల్ వంటి పథకాలు ప్రకటించింది.
బీజేపీ ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం, బీపీఎల్ కుటుంబాలకు రోజూ ఫ్రీగా అర లీటర్ పాలు వంటి వాగ్దానాలు చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజరి కమిటీ తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాలని నిర్దేశించింది. అందులో భాగంగా బీఆరెస్ అవినీతి పాలన ప్రజల్లో ప్రచారం చేస్తూనే, సంక్షేమ పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది.
ఈ దిశగా ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎన్నికల పథకాలు రెండు లక్షల రైతు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండర్, నాలుగువేల నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ, పంటలకు మద్దతు ధర, బోనస్, వార్షిక జాబ్ క్యాలెండర్, బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు, రైతు కూలీలకు 12 వేల ఆర్థిక సాయం వంటి అంశాలు ఉన్నాయి.
నెలరోజుల వ్యవధిలో పార్టీ జాతీయ నేతల బహిరంగ సభల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్‌లతో పాటు మహిళా డిక్లరేషన్‌లను కూడా ప్రకటించేసి, సెప్టెంబర్ 17న సోనియాగాంధీ హైదరాబాద్ సభ ద్వారా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు కౌంటర్‌గా సీఎం కేసీఆర్ ఇప్పటికే అసెంబ్లీలో మా అమ్ముల పొదిలో చాలా సంక్షేమ అస్త్రాలున్నాయన్న ప్రకటనతో ఎన్నికల నాటికి ఇంకెన్ని కొత్త పథకాలు తెరపైకి వస్తాయో వేచి చూడాల్సివుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram