Assigned lands | అసైన్డ్ భూములకు అమ్ముకునే హక్కు ఉండాలి

Assigned lands విధాత‌: తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. పేదలకు ప్రభుత్వం పంచిన ఈ భూములపై పట్టా హక్కులు కావాలని ఎంతో కాలంగా డిమాండు వస్తున్నది. పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూములను అమ్ముకునే హక్కు కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వం ఇచ్చిన భూములను 20 ఏండ్ల తరువాత అమ్ముకునే హక్కు కల్పిస్తూ చట్టం అమలులో ఉంది. ఇదే తీరుగా […]

Assigned lands | అసైన్డ్ భూములకు అమ్ముకునే హక్కు ఉండాలి

Assigned lands

విధాత‌: తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. పేదలకు ప్రభుత్వం పంచిన ఈ భూములపై పట్టా హక్కులు కావాలని ఎంతో కాలంగా డిమాండు వస్తున్నది. పట్టా ఇచ్చిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూములను అమ్ముకునే హక్కు కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వం ఇచ్చిన భూములను 20 ఏండ్ల తరువాత అమ్ముకునే హక్కు కల్పిస్తూ చట్టం అమలులో ఉంది.

ఇదే తీరుగా తెలంగాణలో కూడా అసైన్డ్‌ భూములను అత్యవసరాలకు అమ్ముకునే హక్కు కావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. మరోవైపు.. ఇచ్చిన భూములు అమ్ముకోవడానికి అనుమతి ఇస్తే పేదల భూములన్నీ పరాధీనం అవుతాయన్న వాదన కూడా అంతే బలంగా ఉంది. అయితే అసైన్డ్‌ భూములు పొందినవారంతా పేదలేనని, అత్యవసరాలకు మార్కెట్‌ రేటుకు పట్టా భూముల మాదిరిగా అమ్ముకునే హక్కులు వారికి కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ కూడా గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసైన్డ్‌ భూములు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్న చర్చ నడుస్తున్నది.

ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది. అదే కొంచెం భూమి ఇస్తే జీవితం నిలబడుతుంది. ఆ వ్యక్తి కుటుంబం పేదరికం నుండి బయటపడుతుంది. కొన్ని తరాలకు మేలు జరుగుతుంది. రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకే, దశాబ్దాలుగా పేదలకు భూములపై హక్కులను కల్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే దాదాపు అరకోటి ఎకరాల ప్రభుత్వ భూమి, లక్ష ఎకరాల పైచిలుకు భూదాన భూమిని పేదలకు పంచారు. ప్రభుత్వ భూములపై పేదలకు ఇచ్చిన పెట్టాలనే అసైన్డ్, డిఫార్మ్, లావణి, డీకేటీ పట్టాలని అంటారు. దేశం మొత్తంలో పంచిన ప్రభుత్వ భూమిలో ఇది 28%. భూకమతాలపై పరిమితులు విధించి, నిర్దేశిత పరిమితి కన్నా ఎక్కువ భూమి ఉన్నవారి దగ్గరినుండి భూమి తీసుకుని పేదలకు పంచారు. అలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఆరు లక్షల ఎకరాల సీలింగ్, మిగులు భూములను పంచారు.

పేదలకు పంచిన (అసైన్డ్) భూములను ఎవరూ ప్రలోభాలకు గురిచేసి తీసుకోకుండా, దౌర్జన్యంగా లాక్కోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. అసైన్డ్ భూములను తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ ఇతరులకు ఏవిధంగానైనా బదలాయించకూడదనేది చట్ట నియమం. పకడ్బందీ చట్టం ఉన్నా ఒక ప్రక్క వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి. మరోపక్క అవసరానికి అసైన్డ్ భూములను అమ్ముకునే వెసులుబాటు లేకపోవడం వలన అవస్థలు పడుతున్నామనేది కొందరి ఆవేదన.

పేదలకు ఇలా పంచిన భూములను వారసత్వంగా అనుభవించాలే కానీ అమ్ముకోవడం, దానం, కౌలు, వీలునామా, తనఖా లేదా మరే విధంగానైనా బదలాయిచడానికి వీలులేదనేది ప్రభుత్వం ఇచ్చిన పట్టాలో ఒక ముఖ్యమైన షరతు. కానీ, పేదలకు ఇచ్చిన భూములు వారి స్వాధీనంలో ఎక్కువకాలం ఉండటం లేదు. అందుకే, పేదలకు ఇచ్చిన భూముల రక్షణ కోసం 70వ దశకంలో కేంద్రం ఒక ముసాయిదా చట్టం రూపొందించి రాష్ట్రాలకు పంపింది.

ఈ ముసాయిదా చట్టాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు చట్టాలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 1977లో అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ చట్టాన్ని పీవోటీ లేదా 9/77 చట్టం అని అంటారు. ఈ చట్టం మేరకు అసైన్డ్ భూముల బదలాయింపు చెల్లదు.

పేదలకిచ్చిన భూదాన్ భూములను అమ్మకూడదని భూదాన, గ్రామదాన చట్టం- 1965లో, సీలింగ్ పట్టాలిచ్చిన వాటిని అమ్మకూడదని వ్యవసాయ భూపరిమితి చట్టం-1961లో నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలకు కొన్ని మినహాయింపులు చట్టం చేసినప్పుడే కల్పించారు. మరికొన్నిటిని ఆ తరువాత చట్టంలో చేర్చారు.

1958 కంటే ముందు తెలంగాణలో, 1954 కంటే ముందు ఆంధ్రప్రదేశ్‌లో అసైన్ చేసిన, 1977కి ముందు భూమిలేని పేదలు కొనుగోలు చేసిన, వేలంలో కొన్న, రాజకీయ బాధితులకు, స్వతంత్ర సమరయోధులకు, మాజీ సైనికులకు ఇచ్చిన అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాలను 20 సంవత్సరాల తరువాత అమ్ముకోవచ్చు.

భూమిని సాగు చేసుకోవడంతోపాటు అవసరానికి అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలనే వాదన ఎంతో కాలంగా ఉంది. భూమిపై హక్కు అంటే అనుభవించడం మాత్రమే కాదు, తనఖా పెట్టడం, వీలునామా రాయడం, దానం చెయ్యడం లాంటి సర్వహక్కులు కలిగి ఉండడం. పట్టా భూములపై ఉండే ఇలాంటి హక్కులన్నీ ప్రభుత్వం ఇచ్చిన భూములపైన కూడా ఉండాలనే వాదన బలపడుతున్నది. అసైన్డ్ భూములపై నిషేధం ఉన్నా అమ్మకాలు ఆగడంలేదు.
పైగా అమ్ముకునే అవకాశం లేకపోవడం వలన పేదల దగ్గర నుండి తక్కువ ధరకే భూములు కొంటున్నారు. అవసరానికి తనఖా పెట్టడానికో, అమ్ముకోవడానికో అవకాశం ఉంటే పేదలకు మరింత భరోసా ఉంటుందనేది పలువురి అభిప్రాయం. కర్ణాటక రాష్ట్రంలో 15 ఏండ్ల తరువాత, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో 10 ఏండ్ల తరువాత ప్రభుత్వం ఇచ్చిన భూములను అనుమతితో అమ్ముకోవచ్చు.

మరో పక్క అసైన్డ్ భూముల అమ్మకాలపై నిషేధం లేకపోతే పేదల చేతుల్లో సెంటుభూమి కూడా మిగలదనే వాదనా అంతే బలంగా ఉంది. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని తిరిగి మొదటి అసైనీకి అప్పగించడమో లేదా మరో పేద కుటుంబానికి అసైన్‌ చెయ్యాలని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు భూకమిటీ సూచించింది.

అసైన్డ్ భూములను బ్యాంకులు వేలం వేస్తే అవి ఇతరుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘వ్యవసాయ సంబంధాలు, అసంపూర్ణ భూసంస్కరణల’ కమిటీ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది.

భూమి కేవలం ఆర్థిక వనరు మాత్రమే కాదు. భూమి అంటే ఒక గుర్తింపు, సామాజిక గౌరవం, అధికార చిహ్నం. భూమి ఉంటేనే రైతుగా ప్రభుత్వం నుండి మేలు పొందగలిగేది. ఒక్క మాటలో చెప్పాలంటే భూమే జీవితం. భూమే సర్వస్వం. కాబట్టి భూమి ఉండటం, ఆ భూమిపై సర్వహక్కులు కలిగి ఉండటం అందరికీ కీలకమే.
అది పట్టా భూమైనా, అసైన్డ్ పట్టా అయినా. అసైన్డ్ భూములను అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తూనే అది పేదలను పూర్తిగా భూములకు దూరం చెయ్యడానికి కారణం కాకుండా చూడాలి. ఇప్పటికే దళితులు, గిరిజనుల చేతిలో ఉన్న భూములు ఏటేటా తగ్గుతున్నాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నిర్దేశిత గడువు తరువాత అసైన్డ్ భూములను అమ్ముకునే వీలు కల్పించే అంశాన్ని పరిశీలించాలి. అదే సమయంలో పేదరికం నుండి బయటపడటానికి ఇచ్చిన భూమిని అమ్ముకునే స్వేచ్ఛ మళ్ళీ ఆ కుటుంబాన్ని మరింత పేదరికంలోకి నెట్టకుండా జాగ్రత్త పడాలి.

ఇటీవల లీఫ్స్‌ సంస్థ ‘అసైన్డ్ భూములకు పట్టా హక్కులు’ అంశంపై చేపట్టిన చర్చలో వచ్చిన అభిప్రాయాలు ఇవే..

ప్రభుత్వ, సీలింగ్, భూదాన భూములకు పట్టాలు పొందిన పేదలకు మరింత మేలు జరగాలంటే సంపూర్ణ హక్కులు కల్పించాలి. దీంతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి. ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు, ల్యాండ్ లీజ్ లాంటి ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించాలి.
– భూమి సునీల్, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం అసెంట్‌ ప్రొఫెసర్‌

అసైన్డ్‌ భూములపై పేదలదే హక్కు

ఎందుకు పనికిరాని అసైన్డ్ భూములను కష్టాలకోర్చి అభివృద్ధి చేసిన తరువాత ప్రభుత్వం లాక్కోవటం అన్యాయం. ఆ భూమి పూర్తి లబ్ధి పొందే హక్కు పేదలదే.
– కరుణాకర్ దేశాయ్, లీఫ్స్‌ సలహాదారు

పేదలకు మేలు జరగాలంటే వారికి పట్టా హక్కులు కల్పించడం ఒక కీలక ప్రత్యామ్నాయం. ఇతర మార్గాలు కూడా ఆలోచించాలి.
– ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జనసమితి

హక్కు ఇస్తే మొదటికే మోసం

అసైన్డ్‌ భూములను అమ్ముకునే హక్కు కల్పిస్తే.. మొదటికే మోసం రావొచ్చు. షెడ్యూల్డ్ కులాలు, తెగల వారు నష్టపోయే అవకాశం ఉంది.
– గోపాల్ రావు, కోనేరు రంగారావు కమిటీ సభ్యులు

తిరిగి స్వాధీనం నియమం తొలగించాలి

ప్రభుత్వం అసైన్డ్ భూములను లబ్ధిదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకునే నియమాన్ని తొలగించాలి.
– మురళి, మాజీ ఐఏస్ అధికారి

అసైన్డ్ భూములకు పూర్తి పట్టా హక్కులు కల్పిస్తాం. ఇప్పటికే కాంగ్రెస్ భూమి డిక్లరేషన్ లో ఈ అంశం పేర్కొన్నాం.
– కోదండ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు

– వ్యాసకర్త, జీవన్ రెడ్డి, లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షులు, న్యాయవాది