Australia | యజమానిపై పడి కండలు పీకేసిన పెంపుడు కుక్కలు.. మహిళకు తీవ్రగాయాలు
Australia విధాత: ఆస్ట్రేలియా (Australia) లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రాట్‌వీలర్స్ జాతికి చెందిన రెండు పెంపుడు కుక్కలు తమను పెంచుకుంటున్న యువతిపైనే విరుచుకుపడ్డాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో నికిత పీల్ అనే 31 ఏళ్ల యువతి తన రెండు పెంపుడు కుక్కలు బ్రాంక్స్, హార్లెమ్‌లను తీసుకుని వాకింగ్‌కు వచ్చారు. ఏమైందో ఏమోగానీ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై ఆ రెండు కుక్కలూ ఎగబడి దాడి చేశాయి. రాట్‌వీలర్స్ జాతి కుక్కలు బలిష్ఠంగా ఉంటాయి. […]

Australia
విధాత: ఆస్ట్రేలియా (Australia) లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రాట్‌వీలర్స్ జాతికి చెందిన రెండు పెంపుడు కుక్కలు తమను పెంచుకుంటున్న యువతిపైనే విరుచుకుపడ్డాయి. శనివారం జరిగిన ఈ ఘటనలో నికిత పీల్ అనే 31 ఏళ్ల యువతి తన రెండు పెంపుడు కుక్కలు బ్రాంక్స్, హార్లెమ్‌లను తీసుకుని వాకింగ్‌కు వచ్చారు.
ఏమైందో ఏమోగానీ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై ఆ రెండు కుక్కలూ ఎగబడి దాడి చేశాయి. రాట్‌వీలర్స్ జాతి కుక్కలు బలిష్ఠంగా ఉంటాయి. దీంతో వాటి నుంచి విడిపించుకోవడం నిక్‌కు కష్టమైపోయింది. వాటి ధాటికి ఆమె శరీరంలోని కొంత మాంసం కూడా బయటకువచ్చేసింది. చుట్టుపక్కల ఉన్న వారు అటూ ఇటూ తిరిగి బ్యాట్లు, చెట్టు కొమ్మలు పట్టుకుని బెదిరించినా అవి వెనక్కి తగ్గలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక కుక్కను కాల్చి చంపేశారు. మరో కుక్కను బందీగా పట్టుకుని కుక్కల హాస్టల్‌కు తరలించారు. ఈ ఘటనలో నికిత తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పటికీ.. చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
‘నా చేతిలో కత్తి లేదు ఉంటే ఆ కుక్కలను పొడిచేవాడినే. నా దగ్గర ఉన్న బ్యాట్‌తోనే వాటిని బెదిరిద్దామని చూశా అయినా ఉపయోగం లేదు. ఆవిడ శరీరాన్ని కుక్కలు ముక్కలు ముక్కలుగా కొరికేయడం నా కాళ్లతో చూశా’ అని ప్రత్యక్ష సాక్షి బ్రిన్ స్పెన్సర్ కళ్లకు కట్టినట్లు చెప్పారు. మరోవైపు తన రెండు కుక్కల గురించి నికిత తన ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేవారు. 2017లో బ్రాంక్స్ పుట్టిన రోజు సందర్భంగా ‘దేవుణ్ని ఇంతకన్నా ఏమీ అడగను.. అందమైన, విశ్వాసమైన, ముద్దొచ్చే నా బుజ్జి స్నేహితుడు చాలు’ అని పోస్ట్ కూడా పెట్టారు.
ఈ కుక్కల్లో ఒక దానిని నికితకు అమ్మిన రాట్‌వీలర్ బ్రీడర్ ఈ ఘటనపై స్పందించారు. కారణం లేకుండా ఈ జాతి కుక్కలు ఇలా దాడికి పాల్పడవని ఆయన అన్నారు. ‘నేను ఊహిస్తున్న దాని ప్రకారం.. ఆ రెండు పెంపుడు కుక్కల మధ్య గొడవ జరిగి ఉంటుంది. ఆ సమయంలో నికిత వాటిని సముదాయించడానికి ప్రయత్నించి ఉండొచ్చు. అది వాటికి నచ్చక దాడికి పాల్పడి ఉంటాయి’ అని పేర్కొన్నారు.