అరాచకాలపై పోరాడుతున్న సందేశ్‌ఖాలి

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖలీ ప్రాంతం అరాచక శక్తులకు కేంద్రంగా మారిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌ విమర్శించారు

అరాచకాలపై పోరాడుతున్న సందేశ్‌ఖాలి
  • వ్యవసాయ కార్మిక సంఘం సంఘీభావం
  • మమతా, బీజేపీ సృష్టించిన
  • అరాచక గ్యాంగ్ లీడరే షాజహాన్
  • మమత ప్రభుత్వం అరాచకత్వం
  • మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ
  • సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖలీ ప్రాంతం అరాచక శక్తులకు కేంద్రంగా మారిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌ విమర్శించారు. సందేశ్‌ఖలీ ప్రాంతంలో అరాచకాలకు గురైన గిరిజన ప్రజలను కలుసుకొని, వారి బాధలు తెలుసుకునేందుకు, వారిలో మనోధైర్యం నింపేందుకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధి బృందం ఆ ప్రాంతానికి వెళ్లింది. ఈ బృందంలో వెంకట్‌తోపాటు.. సంఘం జాతీయ నాయకులు తుషార్‌ ఘోష్‌, అమియా పాత్ర తదితరులున్నారు.


సందేశ్‌ఖలిలో గిరిజనులు ఎదుర్కొంటున్న బాధలు ఇప్పటివి కావని, 2011 నుంచి తాము ఎదుర్కొంటున్న అరాచకాలు వర్ణనాతీతమని చెబుతూ బృందం ముందు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. 2011నాటికి ఆ ప్రాంతంలోని ఐదు పంచాయతీల్లో వామపక్ష కూటమి అభ్యర్థులు విజయం సాధించారని, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ కనీసం నామినేషన్‌ వేయడానికి కూడా ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఇక్కడి అరాచక గుంపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే, ఇక్కడి గిరిజనుల ప్రియతమనేత నిరా సర్దార్‌.. వారి బృందానికి అభినందనలు తెలిపేందుకు బుధవారం కోల్‌కతాలో వ్యవసాయ కార్మిక సంఘం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.


ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మమతా బెనర్జీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు సృష్టించిన అరాచక గ్యాంగులు బెంగాల్ అంతలా అకృత్యాలకు తెగబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వామపక్ష ప్రభుత్వం పేదలకు భూములు పంచి, వారి జీవితాలకు, భవిష్యత్తుకు భద్రతను కల్పించగా, మమత అధికారంలోకి రాగానే అరాచక శక్తుల చేతుల్లోకి అధికారం చేరిందని అన్నారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ అండదండలతో విచ్చలవిడి భూ ఆక్రమణలు, కబ్జాలకు టీఎంసీ నేతలు తెగబడ్డారని ఆయన మండిపడ్డారు. భూ కబ్జాలను అడ్డుకున్న వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ సాగించారని, వారి అరాచకాలను ప్రశ్నించిన మహిళలపై అమానుషంగా లైంగిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఇటువంటి అరాచక గుంపును ఆసరా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇటు తృణమూల్ కాంగ్రెస్, అటు బీజేపీలు చెట్టపట్టాలేసుకుని సాగుతున్నాయిని విమర్శించారు.


ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ, టీఎంసీ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని ఆరోపించారు. అరాచకాలకు పాల్పడుతున్న షేక్ షాజహాన్‌ను అరెస్టు చేసేందుకు ఎలాంటి ప్రయత్నం తృణమూల్‌ సర్కార్‌ చేయలేదని, కోర్టులు తీవ్రంగా మందలించి, హెచ్చరించిన తర్వాతే అతడిని సీబీఐకి అప్పగించారని విమర్శించారు. దోషులను అరెస్టు చేయకుండా.. వారి దౌర్జన్యాలను అడ్డుకుంటున్న గిరిజన నేత, మాజీ ఎమ్మెల్యే నిరాఫర్ సర్దార్‌పై భౌతిక దాడులు చేసి. అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఈ చర్యలపై సుప్రీంకోర్టు టీఎంసీ ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన తర్వాతనే నీరా సర్దార్ని విడుదల చేసి, షాజహాన్‌ను అరెస్టు చేశారని పేర్కొన్నారు.

సందేశ్ ఖలీలో అరాచకాలను ఎదుర్కొంటున్న పేదలను ఆసరా చేసుకుని, అల్లర్లను మరింత పెంచి బెంగాల్లో హిందూ మత ఉన్మాదాన్ని రగిలించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని వెంకట్‌ విమర్శించారు. బీజేపీ ఉన్మాద చర్యలను బెంగాల్ ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బెంగాల్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.