Sri Bharat
విధాత: శ్రీ భరత్.. ఇలా అంటే తెలేదేమో.. బాలయ్యబాబు చిన్నల్లుడు, విశాఖ గీతం కాలేజీల అధినేత శ్రీభరత్ అంటే తెలుస్తుంది ఏమో.. ఈయన గత లోక్ సభ ఎన్నికల్లో చాలా దగ్గర్లో అంటే కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఎంపి పదవికి దూరమయ్యారు. మళ్ళీ ఈసారి ఆయన పోటీ చేస్తారా.. టికెట్ వస్తుందా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన గత 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి టిడిపి తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో నిలబడిన జన సేన అభ్యర్థి మాజీ సీబీఐ జెడి లక్ష్మీనారాయణ దాదాపు 2.8 లక్షల ఓట్లు సంపాదించారు.
ఇందులో ఎక్కువ ఓట్లు టిడిపి లేదా విద్యావంతులకు చెందినవి కావడంతో శ్రీ భరత్ చాలా తక్కువ ఓట్ల తేడాతో అంటే నాలుగువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్ళీ పోటీ చేసి ఎలాగైనా గెలవాలని ఆశిస్తున్నారు.
అయితే విశాఖ సీటుకు ఇపుడు భారీ పోటీ నెలకొంది. బీజేపీతో టిడిపికి పొత్తులు ఉంటాయని భావిస్తున్న సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి లేదా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇక్కడ నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు..
టిడిపి బిజెపి మధ్య పొత్తు ఉంటే విశాఖ సీటు బిజెపి ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. దీంతో ఇవ్వక తప్పని పరిస్థితి చంద్రబాబుది. కాబట్టి ఈసారి శ్రీ భరత్ గెలుపు మాట అటుంచి కనీసం టికెట్ అయినా దక్కుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. సరే.. ఏదైతే అదవ్వనీ అని భరత్ మాత్రం ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు.. నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ పోతున్నారు.