Bhatti | తెలంగాణ మోడల్ అంటే.. లిక్కర్, కాళేశ్వరం స్కాములా KTR ?
Bhatti Vikramarka రాష్ట్ర సంపదను పందికొక్కులా మెక్కుతున్నారు గోదావరి జలాలు భూములకు మళ్లిస్తాం రైతన్నల కాళ్లు కడుగుతాం చిల్పూర్ మండలం లింగంపల్లిలో రచ్చబండ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి కేటీఆర్ పదేపదే చెబుతున్న తెలంగాణ మోడల్ అంటే లిక్కర్, కాళేశ్వరం, భగీరథ, మిషన్ కాకతీయ స్కాములు, హైదరాబాద్ భూముల అమ్మకం, అవుటర్ రింగురోడ్డు 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడం, రూ.5లక్షల కోట్లు అప్పులు చేయడం, మద్యం అమ్మకాలు రూ.36 […]

- రాష్ట్ర సంపదను పందికొక్కులా మెక్కుతున్నారు
- గోదావరి జలాలు భూములకు మళ్లిస్తాం
- రైతన్నల కాళ్లు కడుగుతాం
- చిల్పూర్ మండలం లింగంపల్లిలో రచ్చబండ
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర మంత్రి కేటీఆర్ పదేపదే చెబుతున్న తెలంగాణ మోడల్ అంటే లిక్కర్, కాళేశ్వరం, భగీరథ, మిషన్ కాకతీయ స్కాములు, హైదరాబాద్ భూముల అమ్మకం, అవుటర్ రింగురోడ్డు 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడం, రూ.5లక్షల కోట్లు అప్పులు చేయడం, మద్యం అమ్మకాలు రూ.36 వేల కోట్లకు పెంచడం ఇదేనా మీరు చెప్పే తెలంగాణ మోడల్ అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రశ్నించారు. జనగామ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ చేయకపోతే.. 30 ఏళ్లకు లీజుకు ఇచ్చిన అవుటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, హైదరాబాద్ చుట్టూ స్థాపించిన పరిశ్రమలు, తెలంగాణ రాష్ట్రంలో పారుతున్న నీళ్లు, ఎస్సారెస్పీ, కడెం, దేవాదుల ఎత్తిపోతల పథకం, శ్రీపాద ఎల్లంపల్లి, జూరాల, నెట్టెంపాడు, కోయల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం, నాగార్జున సాగర్, భీమా అనేక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది శూన్యం మాత్రమే.
రాష్ట్రంలో 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందించిపెట్టించింది కాంగ్రెస్ మాత్రమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఒక్క ఎకరానికి నీళ్లు పారిస్తున్నారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఒక మోటార్ పెట్టలేదు. గోదావరి, కృష్ణ నీళ్లు తీసుకురాలేదు. దశాబ్ద కాలంలో ఒక్క బీహెచ్ఈ ఎల్ వంటి పరిశ్రమ తీసుకురాలేదని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు.
పందికొక్కులా మెక్కుతున్నారు
రాష్ట్ర సంపదను పందికొక్కులా మెక్కుతున్నారు. తెలంగాణ తెచ్చుకుంది. ప్రజల కోసం మాత్రమే.
తెచ్చుకున్న తెలంగాణలో సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. గోదావరి జలాలు భూములకు మళ్లిస్తాం. రైతన్నల కాళ్లు కడుగుతామని భట్టి భరోసా ఇచ్చారు.
యాత్రలో భాగంగా చిల్పూర్ మండలం లింగంపల్లిలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. జీవితాల్లో మార్పు కోసం విద్యార్థులు అగ్నికి ఆహుతయ్యారు. బలిదానాలు చేశారు. మనకు కావాల్సింది కుటుంబ దొరల ప్రభుత్వం కాదు. రాష్ట్రసంపదను ప్రభుత్వ పెద్దలు పందికొక్కుల్లా మెక్కుతున్నారని విమర్శించారు.
అడుగడుగున జనావేదన
ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీలను, గిరిజనులను, బొగ్గుబాయి కార్మికులను, కాకతీయ విద్యార్థులను, వరంగల్-హన్మకొండ ప్రజలతో మాట్లాడానని విక్రమార్క చెప్పారు. అందరికీ అన్నీ వస్తాయనుకున్నాం. కానీ, ఎవ్వరికీ ఏమీ రాలేదని ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు.
నీళ్లు రావడం లేదు. నిధులు ప్రభుత్వ పెద్దలే దోచేస్తున్నారు. ఆత్మగౌరవం లేకుండా పోయింది. భూమిని పంచడం లేదు. నిరుపేదల జీవితాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. మిగులు బడ్జెట్ తో తెచ్చుకున్న రాష్ట్రం అప్పులపాలైంది. ఆంధ్రావాళ్లు ఏమీరాకుండా అడ్డుకుంటున్నారనుకుంటే ఇప్పుడు తెలంగాణ పాలకులు అడ్డుకుంటున్నారని భట్టి విమర్శించారు.
గోడు వెల్లబోసుకున్న పల్లె జనం
కల్లుగీత కార్మికులు మాటూరి కిరణ్, తీగల గిరి మాట్లాడుతూ.. బెల్టుషాపులు, చీప్ లిక్కర్ తెచ్చి మా పొట్ట కొడ్తుంది ఈ ప్రభుత్వం. మా బతుకులు ఆగమవుతున్నాయి.
మట్టా అంజవ్వ మాట్లాడుతూ కూలీ చేసుకుని బతుకుతున్నాం. ఫింఛన్లు ఇవ్వలేదు. వంద రోజులు పనిలేదని ఆవేదనతో చెప్పారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ రాజయ్య, కాంగ్రెస్ నాయకురాలు ఇందిర తదితరులు పాల్గొన్నారు.