Bhuavanagiri | సమానత్వ సాధనే భారత రాజ్యాంగం లక్ష్యం: హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్
Bhuavanagiri విధాత: భారత రాజ్యాంగం ప్రధాన ఉద్దేశం సమానత్వమని, ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఆదివారం భువనగిరి పట్టణం న్యూదీప్తి హోటల్లో జరిగిన అఖిల భారత న్యాయవాదుల యూనియన్ (ఐలు) మూడవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులను, న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగం ఒక గొప్ప గ్రంథమని, ఈ గ్రంథాన్ని అందించిన మహానుభావులకు మనం కృతజ్ఞతలుగా […]

Bhuavanagiri
విధాత: భారత రాజ్యాంగం ప్రధాన ఉద్దేశం సమానత్వమని, ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. ఆదివారం భువనగిరి పట్టణం న్యూదీప్తి హోటల్లో జరిగిన అఖిల భారత న్యాయవాదుల యూనియన్ (ఐలు) మూడవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులను, న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…
భారత రాజ్యాంగం ఒక గొప్ప గ్రంథమని, ఈ గ్రంథాన్ని అందించిన మహానుభావులకు మనం కృతజ్ఞతలుగా ఉండాలని సూచించారు. రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం సమానత్వమని, ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగిందన్నారు. చట్టం మనకు హక్కులను, స్వేచ్ఛాయుత జీవితాన్ని కల్పిస్తుందని, కాని చట్టాన్ని ఉల్లంఘించుట నాగరిక సమాజ దురదృష్టమని అన్నారు.
గౌరవ సుప్రీం కోర్టుకు ప్రతిష్ట తెచ్చిన న్యాయమూర్తులు ఎందరో ఉన్నారని, వారు తమ తీర్పులతో న్యాయవ్యవస్థకు గౌరవం తెచ్చారని అన్నారు. రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేర్పులు చేయవచ్చు కానీ ప్రాథమిక హక్కులను మార్పు చేయలేమని, రాజ్యాంగంలో మార్పులెన్ని తెచ్చినా న్యాయ వ్యవస్థ రాజ్యంగ మౌళిక సూత్రాలకు లోబడే పనిచేస్తుందని, సహజ న్యాయం అందించడంలో స్వాగతించాలని అన్నారు. సమానత్వం, స్వేచ్ఛలపై వచ్చిన అనేక కేసులు, మార్పులు, చేర్పులపై విశదీకరించారు.
రాజ్యాంగంలోని 21 ఆర్టికల్ కు సవాలుగా ఎన్ని కేసులు వచ్చినా స్వేచ్చ, సమానత్వపు మౌళిక సూత్రాలకు ఎన్నటికీ విఘాతం కలగలేదని, న్యాయవిద్యలో ఎంతో విజ్ఞానాన్ని సంపాదించినా ఎప్పటికీ అందరమూ విద్యార్థులమేనని, న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, పరిపూర్ణమైన సహజ తీర్పులు రావాలన్నా, సత్వర న్యాయం ప్రజలకు చేరువ కావాలన్నా న్యాయవాదుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.
రాజ్యాంగం యొక్క మౌళిక సూత్రాలకు ఎవరూ ఆటంకం కలిగించకూడదని, అధికార పరిధి రాజ్యాంగానికి లోబడి, మౌళిక సూత్రాలకు కట్టుబడి ఉండాలని చెప్పిన విస్తృత ధర్మాసనం వెలువరించిన తీర్పును కేశవానంద భారతి కేసులో అంశాలను ప్రత్యేకంగా గుర్తించడం జరిగిందని ఆయన అన్నారు. పౌరుల హక్కులను కాల రాసినప్పుడు న్యాయ వ్యవస్థలు వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. పౌరుల యొక్క హక్కులను రక్షించే విషయంలో న్యాయవాదులు ప్రముఖమైన పాత్ర వహించాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాల భాస్కర్ రావు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. మారుతి దేవి, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కె.మురళి మోహన్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.దశరథ రామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.కవిత, ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి సుమలత, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏనుగు నరసింహారెడ్డి, ఐలు రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు జి.విద్యాసాగర్, ఐలు రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రెటరీ పి.వి.సురేంద్ర నాథ్, భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య, రిసెప్షన్ కమిటీ సెక్రెటరీ ఎండి. ఇస్మాయిల్, న్యాయవాదులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు వీర బ్రహ్మం, రాజు మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సిల్ న్యాయ సహాయ న్యాయవాదులు, కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు.