BJP | మోదీ క్యాబినెట్‌లో బండి సంజయ్!
BJP | బీజేపీ రాష్ట్ర బాధ్యతలు కిషన్‌రెడ్డికి ఈటలకు ఎన్నికల కమిటీ చైర్మన్‌గిరీ అధిష్ఠానం నిర్ణయం.. ప్రకటనే ఆలస్యం తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు అసమ్మతి వ్యవహారాలతో దిద్దుబాట్లు ఉదయం నుంచి నేతల్లో టెన్షన్ టెన్షన్ హుటాహుటిన ఢిల్లీకి బండి సంజయ్ అప్పటికే అక్కడ కిషన్‌రెడ్డి, రఘునందన్ మొయినాబాద్‌లో జితేందర్‌రెడ్డి క్యాంప్ ఈటల రాజేందర్, దత్తాత్రేయ హాజరు రఘునందన్ ఫొటోతో బాక్స్ అధ్యక్ష పదవికి నాకేం తక్కువ? మూడు పదవుల్లో ఒకటి నాకు ఇవ్వాల్సిందే దుబ్బాకలో నన్ను […]

BJP |
- బీజేపీ రాష్ట్ర బాధ్యతలు కిషన్‌రెడ్డికి
- ఈటలకు ఎన్నికల కమిటీ చైర్మన్‌గిరీ
- అధిష్ఠానం నిర్ణయం.. ప్రకటనే ఆలస్యం
- తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు
- అసమ్మతి వ్యవహారాలతో దిద్దుబాట్లు
- ఉదయం నుంచి నేతల్లో టెన్షన్ టెన్షన్
- హుటాహుటిన ఢిల్లీకి బండి సంజయ్
- అప్పటికే అక్కడ కిషన్‌రెడ్డి, రఘునందన్
- మొయినాబాద్‌లో జితేందర్‌రెడ్డి క్యాంప్
- ఈటల రాజేందర్, దత్తాత్రేయ హాజరు
- రఘునందన్ ఫొటోతో బాక్స్
- అధ్యక్ష పదవికి నాకేం తక్కువ?
- మూడు పదవుల్లో ఒకటి నాకు ఇవ్వాల్సిందే
- దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు
- పుస్తెలు తాకట్టు పెట్టి పోటీ చేసిన బండి
- వంద కోట్ల యాడ్స్ ఇచ్చేంత డబ్బెక్కడిది?
- ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యలు
విధాత : కొద్దినెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి, ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు జరుగనున్న వేళ.. రాష్ట్ర బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల పతాకస్థాయికి చేరుకున్న అసమ్మతి కార్యకలాపాల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వాన్ని మార్చింది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మోదీ క్యాబినెట్‌లోకి తీసుకుని, సహాయ మంత్రి పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బండి స్థానంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించారు. ఇక ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నదని, అధికారిక ప్రకటనే మిగిలి ఉన్నదని చెబుతున్నారు.
ఉదయం నుంచి ఉత్కంఠ
ఈ పరిణామానికి ముందు రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఉదయం నుంచి ఉత్కంఠ భరిత వాతావరణం కొనసాగింది. పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడంతో బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కిషన్‌రెడ్డి, రఘనందన్‌రావు అప్పటికే ఢిల్లీలో ఉన్నారు. కొద్ది రోజులుగా కే లక్ష్మణ్ కూడా అక్కడే మకాం వేశారు. మరోవైపు బండి సంజయ్ గ్రూపులో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మొయినాబాద్‌లోని తన ఫాంహౌస్‌లో ముఖ్య నాయకులతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
అయితే.. జితేందర్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి ఈటల రాజేందర్ రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. బండి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ తదితరులను ఉద్దేశించి జితేందర్‌రెడ్డి ఈ ట్వీట్ చేశారన్న చర్చ జరిగింది. దీనికి ఈటల కూడా సుతిమెత్తగానే కౌంటర్ ఇచ్చారు. సమావేశానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా హాజరయ్యారు.
మోదీ సభ లోపేనా..?
ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులతో కలిసి ఆదివారం ఏర్పాట్లను సమీక్షించిన సంజయ్.. కొంత అంటీముట్టనట్టు వ్యవహరించడంతో పాటు తన సహజత్వానికి భిన్నంగా మాట్లాడిన తీరు కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రధాని మోదీ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హాజరౌతానో లేదోనని బండి సంజయ్ ఆదివారం రోజున హన్మకొండలో అనడం బీజేపీ అధ్యక్ష మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది.
కాక రేపిన రఘునందన్ వ్యాఖ్యలు
ఒకవైపు ఢిల్లీలో మంత్రాంగం నడుస్తున్న సమయంలోనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక పుట్టించాయి. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసిన రఘునందన్‌రావు.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కానా..? అని ప్రశ్నించారు. ‘పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్‌లో ఏదో ఒకటి పదవి ఇవ్వాలి. జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చినా ఓకే’ అని చెప్పారు. గత పదేండ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేశారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావొచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు.
దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యే గెలుస్తా..
దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల్లో తనకెవరూ సాయం చేయలేదన్నారు. తాను బీజేపీలోనే ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ‘వంద కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలవలేదు. అదే వంద కోట్లు నాకిస్తే.. తెలంగాణను దున్నేసేవాడిని. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు’ అని రఘునందన్ రావు పేర్కొన్నారు. బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధమని రఘునందన్‌రావు అన్నారు. భార్య పుస్తెలమ్మి సంజయ్ ఎన్నికల్లో పోటీ చేశారని, అలాంటి సంజయ్ వంద కోట్లతో యాడ్స్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ బొమ్మలతో ఓట్లు రావని, రఘునందన్, ఈటల రాజేందర్ బొమ్మలతోనే ఓట్లు వస్తాయన్నారు. ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమే అని పేర్కొన్నారు. పార్టీకి శాసనసభాపక్ష నేత లేడని నడ్డాకు తెలియదని చెప్పారు. తాను గెలిచినందుకే ఈటల బీజేపీలోకి వచ్చారని పేర్కొన్నారు. పదేండ్లలో పార్టీ కోసం తనకంటే ఎక్కువ ఎవరూ కష్టపడలేదన్న రఘునందన్.. సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై మోదీకి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. రఘునందన్‌రావు ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల్లో కలకలం రేగింది.
నాయకత్వాన్ని వ్యతిరేకించలేదు: రఘునందన్
ఇష్టాగోష్ఠిలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించడంతో స్పందించిన రఘునందన్.. టీ తాగుతూ సరదాగా మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పారు. తాను రాష్ట్ర, కేంద్ర నాయకత్వాన్ని గౌరవిస్తానని, వారిని ధిక్కరించే ప్రసక్తే లేదని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గత పది సంవత్సరాల నుంచి బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నానన్నారు. రెండు నెలలుగా నియోజక వర్గానికే పరితమైన తాను, అభివృద్ధి పనులపై చర్చించడానికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి వచ్చానన్నారు