Madhya Pradesh | బీజేపీకి.. మరో అసెంబ్లీ ఎన్నికల గండం! తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత
నవంబర్‌లో మధ్యప్రదేశ్ ఎన్నికలు రెడ్ జోన్‌లో 15 మంది మంత్రులు Madhya Pradesh Elections । ఒకవైపు కర్ణాటకలో వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇంతకంటే గడ్డుకాలం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు కానున్నది. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌కు బీజేపీ అధిష్ఠానం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. కారణం.. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటమే. విధాత : మధ్యప్రదేశ్‌లో ఈసారి బీజేపీ విజయావకాశాలు దారుణంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. […]

- నవంబర్‌లో మధ్యప్రదేశ్ ఎన్నికలు
- రెడ్ జోన్‌లో 15 మంది మంత్రులు
Madhya Pradesh Elections । ఒకవైపు కర్ణాటకలో వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇంతకంటే గడ్డుకాలం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు కానున్నది. ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌కు బీజేపీ అధిష్ఠానం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. కారణం.. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటమే.
విధాత : మధ్యప్రదేశ్‌లో ఈసారి బీజేపీ విజయావకాశాలు దారుణంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. 2018లోనే భారీ పరాజయం మూటగట్టుకున్నా.. కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయింపులతో 2020లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది.
ఈసారి బీజేపీ ఎమ్మెల్యేలు తమ సీట్లను నిలబెట్టుకోవడం అంత సులభం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార పార్టీలకు ప్రభుత్వ వ్యతిరేకత తప్పదు. కానీ.. మధ్యప్రదేశ్‌లో రెండు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈసారి అది తీవ్ర స్థాయిలో ఉండబోతున్నదని చెబుతున్నారు. రానురాను పరిస్థితి మరింత తీవ్రం కానున్నదని అంచనా వేస్తున్నారు.
సర్వేలో దిగ్భ్రాంతికర అంశాలు
రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతర్గత సర్వే ఒకటి చేయించగా.. దానిలో ఫలితాలు దిమ్మతిరిగేలా ఉన్నాయని సమాచారం. దాదాపు 15 మంది మంత్రులే డేంజర్ జోన్‌లో ఉన్నారట. ప్రజల్లో ఆగ్రహం తగ్గని పక్షంలో వారు ఓడిపోవడం ఖాయమని సమాచారం. ప్రజాగ్రహాన్ని చల్లార్చడం, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవడం అనే రెండు లక్ష్యాలతో బీజేపీ వికాస్ యాత్ర పేరిట యాత్రకు సన్నద్ధమవుతున్నది. ఈ యాత్రలో తేలే అంశాల ఆధారంగా 30 నుంచి 35 స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పిస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.
వికాస్ యాత్రతో మేలా? కీడా?
‘వికాస్ యాత్ర సందర్భంగా ప్రజల్లో కనిపించే వ్యతిరేకతను ప్రతిపక్షాలు సొమ్ము చేసుకుంటాయని మాకు తెలుసు. కానీ.. ఇది బలహీన అభ్యర్థులను ముందే గుర్తించేందుకు వీలు కల్పిస్తుంది’ అని పార్టీ నాయకుడొకరు చెప్పారు. అయితే.. ఈ వికాస్ యాత్ర బీజేపీకి మేలు కంటే నష్టం చేసేదే ఎక్కువని ఒక సీనియర్ పాత్రికేయుడు వ్యాఖ్యానించారు.
మోదీ, అమిత్‌షా వరుస పర్యటనలు
రాష్ట్రంలో ప్రభుత్వం పట్ల నానాటికీ పెరిగిపోతున్న ప్రజా వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నాల్లో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే ఇప్పటి నుంచే మధ్యప్రదేశ్‌పై ముఖ్య నాయకత్వం కేంద్రీకరించనున్నదని అంటున్నారు. 9 లేదా 10 నెలల్లో ఎన్నికలు జరిగే లోపే.. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 20 నుంచి 30 సార్లు రాష్ట్రంలో పర్యటించేలా షెడ్యూలు రూపొందిస్తున్నారని తెలుస్తున్నది.
ఛింద్వారాపై కేంద్రీకరణ
గడిచిన రెండు నెలల వ్యవధిలో అమిత్‌షా ఇప్పటికే రెండుసార్లు మధ్యప్రదేశ్ పర్యటనకు వచ్చారు. తాజాగా కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నేత కమల్‌నాథ్‌కు పెట్టని కోటగా భావించే ఛింద్వారాకు వచ్చి.. అనధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఛింద్వారా అనేది 1952 నుంచి కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతంగా ఉన్నది.
ఇన్నేళ్లలో 1997లో ఒకే ఒక్కసారి అక్కడ బీజేపీ గెలిచింది. 1980నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ లేదా ఆయన కుటుంబీకులే ఛింద్వారా నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొంతకాలంగా ఛింద్వారాపై బీజేపీ దృష్టిసారించింది. కమల్‌నాథ్‌ను ఇక్కడే ఉండేలా ఆపగలిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాభవాన్ని తగ్గించేందుకు అవకాశం కలుగుతుందనేది బీజేపీ ప్లాన్‌గా చెబుతున్నారు