పెళ్లి మంటపంలో రక్తదానం శిబిరం.. నూతన వధూవరులపై ప్రశంసల జల్లు
పెళ్లిళ్లు అనగానే కానుకల మీద దృష్టి పడుతోంది. ఎవరు ఎలాంటి కానుకలు తీసుకువస్తారని వధూవరుల కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు

పాట్నా : పెళ్లిళ్లు అనగానే కానుకల మీద దృష్టి పడుతోంది. ఎవరు ఎలాంటి కానుకలు తీసుకువస్తారని వధూవరుల కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఓ పెళ్లి వేడుక మాత్రం వినూత్నంగా జరిగింది. పెళ్లికి వచ్చిన వారు ఎలాంటి కానుకలు సమర్పించాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా రక్తదానం చేయాలని వరుడు డిమాండ్ పెట్టాడు. దీంతో పెళ్లి మంటపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో 70 మంది దాకా వధువు తరపు బంధువులు రక్తదానం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ ఔరంగాబాద్ జిల్లా హస్‌పురా గ్రామానికి చెందిన అనీష్ కేసరి, ఆరా ప్రాంతానికి చెందిన సిమ్రాన్ కేసరికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కాగా అనీష్ తమ ప్రాంతంలో అత్యధికంగా రక్తదానాలు చేయిస్తూ రక్తవీర్‌గా పేరు పొందాడు. దీంతో తన పెళ్లిలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని, అలా చేస్తేనే వధువు ఇంటికి వస్తానని వరుడు అనీష్ డిమాండ్ పెట్టాడు. మొదట ఆలోచనలో పడ్డ వధువు కుటుంబ సభ్యులు చివరకు అంగీకరించారు.
దీంతో పాట్నాలోని నిరామయ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ రంజన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇక వధువు తరపు బంధువులు 70 మంది దాకా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో తొలిసారిగా ఇలాంటి రక్తదాన శిబిరాన్ని చూశానని డాక్టర్ రాకేశ్ తెలిపారు.