Minister Ponnam Prabhakar| మా ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీఆర్ఎస్ కుట్రలు: మంత్రి పొన్నం ప్రభాకర్

విధాత, హైదరాబాద్ : ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన మా ప్రజాప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు ఆరోపించారు. ఆదివారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. పది సంవత్సరాల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ప్రజాశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు పిల్లి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని..మేం వాటిని తిప్పికొడతామన్నారు. ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా సొంత రాష్ట్రాన్ని శత్రు దేశంగా భావిస్తూ ప్రజలకు నష్టం కలిగించేలా ఆందోళనలను రెచ్చగొడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను, ఎన్జీవోలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు ట్రెజరీ ఉద్యోగులను కూడా ప్రతిపక్షం రెచ్చగొట్టి ప్రభుత్వం ప్రజలకు లబ్ధి చేకూర్చేలా చేస్తున్న పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.
ప్రభుత్వం, అధికార యంత్రాంగం వేర్వేరు కాదని…మేము తీసుకున్న నిర్ణయాలు మీరు గౌరవించి అమలుకు సహకరించాల్సిన బాధ్యత ఉందన్నారు. పక్క రాష్ట్రాలలో రాష్ట్ర సమస్యలపై అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నాయని..తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ కేంద్రంతో ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టేలా వ్యవహరిస్తుందన్నారు. బీఆర్ఎస్ కు పదేళ్లు ప్రజలు అధికారమిస్తే రాష్ట్ర ప్రజల కోసం పనిచేయకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని పొన్నం విమర్శించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ను ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో సున్నాకు పరిమితం చేశారని..ఇకనైన బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేయకపోతే రానున్న రోజుల్లో పూర్తిగా కనుమరుగు చేస్తారని హెచ్చరించారు.