మహారాష్ట్రకు SRSP నీళ్ల వెనుక.. BRS ప్రయోజనాలు? నాందేడ్‌లో KCR వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం

నాటి ఉద్యమ నినాదాల్లో కీలకంగా ‘నీళ్లు’ బాబ్లీనే ఆనాడు ఒప్పుకోలేదు.. ఇప్పుడు నీళ్లెలా ఇస్తారు? బాబ్లీ ప్రాజెక్టు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతానికి, మహారాష్ట్రకు మధ్య చిచ్చు రేపింది. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఆయకట్టు రక్షణ కోసం ఇక్కడి రైతాంగం అనేక ఉద్యమాలు చేసింది. తెలంగాణ ఉద్యమ కాలంలో అదో సమాంతర ఉద్యమంలా నడిచింది. అసలే వరద అంతంత మాత్రంగా వచ్చే ఎస్సారెస్పీలో అంతర్భాగంగా కట్టిన ఈ ప్రాజెక్టుతో తెలంగాణ రైతులకు మిగిలేది మన్నేనన్న ఆందోళన ఆ […]

మహారాష్ట్రకు SRSP నీళ్ల వెనుక.. BRS ప్రయోజనాలు? నాందేడ్‌లో KCR వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం
  • నాటి ఉద్యమ నినాదాల్లో కీలకంగా ‘నీళ్లు’
  • బాబ్లీనే ఆనాడు ఒప్పుకోలేదు.. ఇప్పుడు నీళ్లెలా ఇస్తారు?

బాబ్లీ ప్రాజెక్టు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతానికి, మహారాష్ట్రకు మధ్య చిచ్చు రేపింది. మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఆయకట్టు రక్షణ కోసం ఇక్కడి రైతాంగం అనేక ఉద్యమాలు చేసింది. తెలంగాణ ఉద్యమ కాలంలో అదో సమాంతర ఉద్యమంలా నడిచింది. అసలే వరద అంతంత మాత్రంగా వచ్చే ఎస్సారెస్పీలో అంతర్భాగంగా కట్టిన ఈ ప్రాజెక్టుతో తెలంగాణ రైతులకు మిగిలేది మన్నేనన్న ఆందోళన ఆ ఉద్యమానికి దారి తీసింది. కానీ.. ఇప్పడు ఎస్సారెస్పీ నుంచి మహారాష్ట్ర రైతులకు నీటిని అధికారికంగా ఇవ్వాలనే ప్రతిపాదన అందులోనూ కేసీఆర్‌ నోట నాందేడ్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభలో వెలువడటంపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది బీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశించినదని పరిశీలకులు కూడా అంటున్నారు.

విధాత, నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని మహారాష్ట్రకు ఎత్తిపోతల ద్వారా సరఫరా చేయవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి.

రైతులతో పాటు పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం కేసీఆర్‌పై మండి పడుతున్నారు. బీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రయోజనాలకు ఎస్సారెస్పీని పణంగా పెడుతున్నారన్న ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మూడు అంశాలపై తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రైతుల హక్కులను పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి.

మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) ఎండిపోయి ఎడారిగా మారుతుందని ఆయకట్టు రైతాంగం ఆందోళన బాట పట్టింది. ఇదే విషయమై గోదావరి నదీ జలాల వివాదం రాజకీయంగా తెరపైకి వచ్చింది.

ప్రధానంగా బాబ్లీ ప్రాజెక్టుతోనే ఎక్కువగా ఎస్సారెస్పీ ఆయకట్టు మనుగడకు ముప్పు వాటిల్లుతుందని రైతుల్లో ఆందోళన మొదలైంది. అంతకంటే ముందు గైక్వాడ్, విష్ణుపురి తదితర 11 ప్రాజెక్టులను మహారాష్ట్ర చట్ట విరుద్ధంగా నిర్మించింది. వీటన్నింటి వల్ల ఎస్సారెస్పీలోకి గోదావరి జలాలు రావన్న సందేహం రైతులను నిరాశకు గురిచేసింది.

తెలంగాణలో అతి పెద్ద నీటి ప్రాజెక్టు కావడం, శ్రీరామ్ సాగర్ నుండి నిజామాబాద్‌ జిల్లాలో 36 వేల 756 ఎకరాలు, కరీంనగర్‌లో అత్యధికంగా 5లక్షల 42 వేల 900, ఆదిలాబాద్ లో 35 వేల 735, వరంగల్ జిల్లాల్లో 3 లక్షల 57 వేల 900 ఎకరాలతో మొత్తం 9 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. 1963లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు.

మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇవ్వ‌డానికి సిద్ధం: CM KCR

112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నిర్మాణం ప్రారంభించారు. కానీ.. అప్పట్లోనే 90 టీఎంసీల సామర్థ్యానికి కుదించారు. ప్రస్తుతం జోన్ 1, జోన్ 2 పరిధిలో కలిపి 9 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నప్పటికీ చివరి ఆయకట్టు భూములకు సాగు నీరు అందడం లేదు. కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నట్లు సమాచారం. మరోవైపు.. పూడిక నిండిపోవడంతో ప్రాజెక్టు సామర్థ్యం 70 టీఎంసీలకు పడిపోయిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఎస్సారెస్పీ స్టేజ్ 2 కింద ఉన్న సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల పరిధిలోని 2లక్షల 56 వేల ఎకరాలకు కూడా నీరందడం ప్రశ్నార్థకంగా మారనుంది.

ఇక గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన ప్రాజెక్టులపై ఏళ్ల తరబడి వివాదాలు ఉండనే ఉన్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో పలుమార్లు బాబ్లీ ప్రాజెక్టుపై అభ్యంతరాలు లేవనెత్తడం రెండు రాష్ట్రాల మధ్య గొడవలకు దారితీసింది. నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు బాబ్లీపై పెద్ద పోరాటమే నడిచింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యేలను మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి ధర్మాబాద్‌కు తరలించింది.

ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు రెండు రాష్ట్రాలు కట్టుబడి పనిచేస్తూ వచ్చాయి. ప్రతి ఏటా జూలై 1వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు బాబ్లీ గేట్లను ఎత్తి వేసి దిగువన ఎస్సారెస్పీలోకి నీటిని వదులుతున్నారు. గత కొన్నేళ్లుగా వర్షాలు ఆశాజ‌నకంగా ఉండడంతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకుంది. ఫలితంగా ఆయకట్టు రైతాంగంలో ఒక నమ్మకం నెలకొన్నది. కానీ.. ఈ సమయంలో కేసీఆర్‌ ఎస్సారెస్పీ నుంచి నీటిని మహారాష్ట్ర రైతుల కోసం ఎత్తి పోయాలని చెప్పడంతో రైతుల్లో మళ్లీ తీవ్ర ఆందోళన నెలకొన్నది.

సీఎం వ్యాఖ్యలు అప్రజాస్వామికం: ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం

శ్రీరామ్ సాగర్ నీటిని మహారాష్ట్రకు ఎత్తిపోతల ద్వారా సరఫరా చేయవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఎస్సారెస్పీ నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకోవాలని చెప్పడం అసమంజసం.

ఎస్సారెస్పీ రైతుల హక్కులను కాల్ బ్యాక్ చేయడమే. ఇది ఈ ప్రాంత రైతాంగం భౌగోళిక హక్కులను కాలరాయడమే. ఎస్సారెస్పీ పైన మహారాష్ట్ర అక్రమంగా 11 ప్రాజెక్టులను నిర్మించింది. వీటి వల్ల ఎస్సారెస్పీ ఎండిపోతుందని ఆనాడు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులు ఆందోళన చేశారు. ప్రాజెక్టు వద్ద జరిపిన రైతు ఆందోళనలో లాఠీఛార్జి, అరెస్టులు అయ్యాయి.

తుగ్లక్‌ను మరిపిస్తున్న కేసీఆర్: తిరుపతిరెడ్డి, రైతు నాయకుడు, కరీంనగర్

ఎస్సారెస్పీ ఆయకట్టు రక్షణ కోసం రైతులు చేసిన ఉద్యమాలు త్యాగాలను సీఎం కేసీఆర్ మర్చిపోరు. ఆయన విధానాలు, మాటలు తుగ్లక్‌ను గుర్తు చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతంలో అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మించింది. ఇది ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యమేనని అప్పట్లో కేసీఆర్‌ విమర్శలు చేశారు.

ఇప్పటికే ఎస్సారెస్పీకి మరమ్మతులు లేవు. ప్రాజెక్టు పూడికతో నిండింది. కాలువల్లో పిచ్చిమొక్కలు మొలిచాయి. చెత్త చెదారంతో నిండిపోయి మొదటి ఆయకట్టు భూములకే నీరందటం లేదు. చివరి ఆయకట్టుకు నీళ్లు ఎలా చేరుతాయి? ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్రకు నీళ్లు ఎత్తిపోతల ద్వారా ఇవ్వొచ్చన్న సీఎం వ్యాఖ్యలు అర్థరహితం. దీంతో సమస్య మళ్ళీ మెదటికి వస్తుంది. నాడు ఉమ్మడి రాష్ట్ర పాలకులను దోషిగా పేర్కొన్న కేసీఆర్‌.. ఇప్పడు అదే తప్పు చేస్తున్నారు. గ్రావిటీ ద్వారా నీరు అందుతుండగా కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీలోకి నీటిని పంప్‌ చేసి మళ్ళీ వాటిని మహారాష్ట్రకు అందించాలన్న కేసీఆర్ ఆలోచన స్వార్థానికి నిదర్శనం.

తెలంగాణకు ద్రోహం చేయడమే: పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ

శ్రీరామ్‌ సాగర్ ప్రాజెక్టు నీరు మహారాష్ట్రకు తోడుకొమ్మని కేసీఆర్ చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమే అవుతుంది. జీవనది లాంటి శ్రీరామ్‌ సాగర్‌ను మహారాష్ట్ర చేతికి ఇస్తే ప్రాజెక్టు పరివాహక ప్రాంతం శ్మశానం అవుతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయి. ఎస్సారెస్పీ వరద కాలువ ప్రాజెక్టు వృథాగా పోతుంది.

తెలంగాణ ఉద్యమమే సాగునీటి కోసం వచ్చింది. ఇప్పుడు తెలంగాణ హక్కుగా ఉన్న ప్రాజెక్టును మహారాష్ట్రకు అప్పగిస్తా అంటే ప్రజలు కేసీఆర్‌ను ఛీ కొడతారు. బాబ్లీ మీద పోరాటం చేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? బీఆర్ఎస్ పెట్టి తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసిన కేసీఆర్ ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ ఆలోచనను వెనక్కు తీసుకోకపోతే రైతు ఉద్యమం చేయకతప్పదు.