BRS | డాక్టర్ రాజయ్య టికెట్ ‘బైపాస్’.. అప్పుడు భర్తరఫ్… ఇప్పుడు గల్లంతు! స్టేషన్ గులాబీ ‘మాస్టర్’గా కడియం
BRS | రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం అయోమయంలో అనుచరులు మలుపు తిరిగిన ఘన్ పూర్ రాజకీయం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్ ఘన్ పూర్ సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. డాక్టర్ సాబ్ ను బైపాస్ చేసి, తన చిరకాల ప్రత్యర్థి, ఎమ్మెల్సీ, పూర్వరంగంలో లెక్చరర్ గా పనిచేసిన కడియం శ్రీహరిని బీఆర్ఎస్ స్టేషన్ ‘మాస్టర్’గా ఎంపిక చేశారు. గత కొంతకాలంగా స్టేషన్ ఘన్ పూర్ కేంద్రంగా గులాబీ […]

BRS |
- రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం
- అయోమయంలో అనుచరులు
- మలుపు తిరిగిన ఘన్ పూర్ రాజకీయం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్ ఘన్ పూర్ సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. డాక్టర్ సాబ్ ను బైపాస్ చేసి, తన చిరకాల ప్రత్యర్థి, ఎమ్మెల్సీ, పూర్వరంగంలో లెక్చరర్ గా పనిచేసిన కడియం శ్రీహరిని బీఆర్ఎస్ స్టేషన్ ‘మాస్టర్’గా ఎంపిక చేశారు. గత కొంతకాలంగా స్టేషన్ ఘన్ పూర్ కేంద్రంగా గులాబీ పార్టీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజయ్యకు ఈ దఫా టికెట్ నిరాకరిస్తారనే చర్చ సాగింది. కడియం ఒక అడుగు ముందుకేసి, ఈసారి తనకే టికెట్ వస్తుందంటూ రెండు రోజుల క్రితం ప్రకటించినట్లుగానే అభ్యర్థిత్వం మార్పు జరిగింది. అంటే రాజయ్యకు చెక్ పెడుతున్నారనే అంశం ముందుగానే కడియం శ్రీహరికి తెలిసినట్లుగా భావించాలి.
బీఆర్ఎస్ లో కలిసొచ్చిందేమీ లేదు?
పాపం… రాజయ్య ఏ ముహూర్తాన అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారో అప్పటి నుంచి ఆయనకు పెద్దగా కలిసొచ్చిందేమీలేదు. ఒక విధంగా అవమానాలు, అపవాదులు ఎదుర్కొన్నారు. అంతకు ముందు రాజయ్యకు రెండు పర్యాయాలు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. 2009లో మూడోసారి కాంగ్రెస్ నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి 2011లో ఉప ఎన్నిక కొనితెచ్చుకుని ఎన్నికల్లో ఎదురీదారు. ఆఖరికి విజయం సాధించారు.
2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొంది తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్యశాఖ బాధ్యతలు నిర్వహించారు. కొద్ది రోజులకే మంత్రి పదవి నుంచి అవమానకరంగా భర్తరఫ్ అయ్యారు. కనీసం రాజీనామా కోరకపోవడం పట్ల విమర్శలొచ్చాయి. 2018లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ దఫా ఏకంగా టికెట్ గల్లంతైంది. ఐదవ పర్యాయం ఎమ్మెల్యేగా గెలువాలని భావించిన రాజయ్యకు చుక్కెదురైంది. ఇందులో రాజయ్య స్వయంకృతం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ను కాదని టీఆర్ఎస్ లో చేరితే రాజయ్యకు ఆ పార్టీ నుంచి దక్కిన గౌరవం ఏమీలేదని చెప్పవచ్చు.
రాజయ్యకు ఎమ్మెల్సీ?
ఆఖరికి తన చిరకాల ప్రత్యర్థికి టికెట్ రావడం రాజయ్యకు మింగుడుపడని అంశం. ఇప్పుడు రాజయ్య రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ప్రస్తుతం మౌనం పాటిస్తున్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. కడియం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ అవకాశం రాజయ్యకు ఇస్తారని హామీ ఇచ్చినట్లు చర్చసాగుతోంది.
డాక్టర్ వర్సెస్ మాస్టర్
స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాల్లో 1999 నుంచి డాక్టర్ వర్సెస్ మాస్టర్ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. ఇరువురూ బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. పైకి ఒకే పార్టీలో ఉన్నా ఉప్పూనిప్పుగా కొనసాగారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 1994లో తొలిసారి కడియం శ్రీహరి టీడీపీ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి భోనగిరి ఆరోగ్యం పై గెలుపొందారు. మొదటి ప్రయత్నంలో విజయం సాధించారు. తర్వాత 1999లో రెండవ సారి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రాజయ్య పై గెలుపొందారు. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ విజయరామారావు చేతిలో ఓటమిపాలయ్యారు.
2008 ఉప ఎన్నికల్లో పోటీ చేసి అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రాజయ్య పై విజయం సాధించారు. రాజీనామా చేసి పోటీచేసిన ఆ పార్టీ శాసనసభాపక్ష నేత, టీఆర్ఎస్ అభ్యర్థి విజయరామారావు మూడో స్థానానికి చేరుకున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రాజయ్య చేతిలో కడియం ఓటమిపాలయ్యారు. 2011లో రాజయ్య అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే గా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కడియం శ్రీహరిని మరోసారి ఓడించారు. ఆ తర్వాత 2014, 2018లలో టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కొద్దికాలానికి కడియం గులాబీ గూటికి చేరుకున్నారు.
2014లో కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. రాజయ్య భర్తరఫ్ తో ఎంపీగా కడియం రాజీనామా చేసి రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాజయ్య స్థానంలో బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రెండవ పర్యాయం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. తాజా పరిణామాల్లో స్టేషన్ మాస్టర్ గా బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. ఒకసారి ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచి, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కడియం నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.