మహిళల బాధను విస్మరించిన స్మృతి ఇరానీ: ఎమ్మెల్సీ కవిత

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం తనను నిరుత్సాహపరిచిందని ఎమ్మెల్సీ కవిత స్పందించారు

  • By: Somu    latest    Dec 15, 2023 11:16 AM IST
మహిళల బాధను విస్మరించిన స్మృతి ఇరానీ: ఎమ్మెల్సీ కవిత

విధాత : మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించడం తనను నిరుత్సాహపరిచిందని బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత ట్వీటర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఒక మహిళగా ఆమె అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఋతుస్రావం అనేది వైకల్యం కాదని, అది స్త్రీ జీవిత ప్రయాణంలో ఓ భాగమని, అందుకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం అవసరం లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.


ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై లీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు ఓ మహిళగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు ఇవ్వాల్సిందిపోయి మంత్రి ఈ విషయాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించిందన్నారు. నెలసరి తమకున్న ఎంపిక కాదని, అదొక సహజమైన జీవ ప్రక్రియ అని తెలిపారు. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళల బాధను విస్మరించనట్లేనని విమర్శించారు.