Nalgonda: BRSలో.. నాలుగు స్తంభాలాట! మంత్రి పేరు, ఫొటోలతో ప్రచార హంగామా

మంత్రి మెప్పు కోసం ఆశావాహుల కార్యక్రమాలు ఎవరికి వారు వాల్‌ ఫొస్టర్లు, వాల్‌ పెయింటింగ్స్‌, ఫ్లెక్షిలలో మంత్రి ఫొటోలతో హంగామా విధాత: రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని వినూత్న రాజకీయం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నది. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం పైనే ఉన్నప్పటికీ ఇక్కడి నాయకులంతా అప్పుడే రంగంలోకి దూకేయడంతో నాలుగు స్తంభాలాట మొదలైంది. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే టికెట్లు అనే ప్రకటన చేసినప్పటికీ.. సర్వేల నేపథ్యం, ఎన్నికల నాటి పరిస్థితులతో టికెట్ కేటాయింపులో […]

Nalgonda: BRSలో.. నాలుగు స్తంభాలాట! మంత్రి పేరు, ఫొటోలతో ప్రచార హంగామా
  • మంత్రి మెప్పు కోసం ఆశావాహుల కార్యక్రమాలు
  • ఎవరికి వారు వాల్‌ ఫొస్టర్లు, వాల్‌ పెయింటింగ్స్‌, ఫ్లెక్షిలలో మంత్రి ఫొటోలతో హంగామా

విధాత: రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని వినూత్న రాజకీయం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నది. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం పైనే ఉన్నప్పటికీ ఇక్కడి నాయకులంతా అప్పుడే రంగంలోకి దూకేయడంతో నాలుగు స్తంభాలాట మొదలైంది. సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకే టికెట్లు అనే ప్రకటన చేసినప్పటికీ.. సర్వేల నేపథ్యం, ఎన్నికల నాటి పరిస్థితులతో టికెట్ కేటాయింపులో మార్పు జరగవచ్చన్న ఆశతో ఆశావహులు తమ కార్యక్రమాల్లో వెనక్కి తగ్గడం లేదు.

నలగొండ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి పోటీగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, నియోజకవర్గ నేతలు పిల్లి రామరాజు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డిలు టికెట్ ఆశిస్తూ నిత్యం జనంలో తమ కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కొత్త సమస్యలకు దారి తీస్తున్నది.

దశాబ్దాలుగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల ఆధిపత్యంలో ఉండి అభివృద్ధిలో వెనుకబడి ఉన్న నల్లగొండ జిల్లాను మంత్రి జగదీశ్‌రెడ్డి తనదైన రాజకీయ చతురతో, అభవృద్ధి పనులతో టీఆర్‌ఎస్‌ కంచుకోటగా మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మూడు నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ముగ్గురు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని తన సత్తా చాటారు.

కాగా ఇప్పుడు నలగొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశావాహుల ఉత్సాహం మంత్రిని, పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభ్యర్థులకు టికెట్‌ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించేది కేసీఆర్‌, కేటీఆర్‌ అయినప్పటికీ జిల్లామంత్రి దృష్టిలో పడాలని, ఆయన అభిమానంతో టికెట్‌ సంపాదించాలంటూ ఇక్కడ ఆ నలుగురు నేతల మధ్య సాగుతున్న నాలుగు స్తంభాలాట మంత్రికి ఇబ్బందులు తెచ్చేలా ఉంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లతో పాటు ఆశావహులంతా ఎవరికి వారు మంత్రి ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ మంత్రి ఫోటోతో తమ సేవా కార్యక్రమాలను, ప్రచారాలను సాగిస్తున్నారు. కంచర్ల, చాడ కిషన్ రెడ్డి, పిల్లి రామరాజు, అమిత్ రెడ్డిలు తమ కార్యక్రమాలకు సంబంధించి మంత్రి మాకు సన్నిహితుడు అనేలా ఆయన బొమ్మతో ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, వాల్ రైటింగులతో పోటాపోటీ ప్రచారం చేసుకుంటూ ఎవరికివారు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Nalgonda: ‘పిల్లి’పై మ‌ళ్లీ కంచర్ల కొరడా.. పోస్టర్లు,ఫ్లెక్సీల తొలగింపు..!

ముఖ్యంగా కంచర్ల, చాడ, పిల్లిల మధ్య గోడ ప్రకటనల వార్ సోషల్ మీడియాను సైతం మరిపించే స్థాయిలో సాగుతుంది. ఒకే చోట పక్కపక్కనే ఒకే పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జగదీష్ రెడ్డిల బొమ్మలతో, కారు గుర్తుతో వేర్వేరుగా వాల్ రైటింగ్ చేసిన తీరును, పోస్టర్లను జనం వింతగా తిలకిస్తున్నారు.

అయితే మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం నల్గొండ బీఆర్ఎస్ నాయకులు పార్టీ టికెట్ లక్ష్యంగా పోటాపోటీగా చేస్తున్న కార్యక్రమాలపై లోలోపల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటూ పార్టీలలో వర్గాలుగా ఏర్పడి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తే అవకాశం ఉందని దాంతో మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అయినా నియోజకవర్గంలో జరిగే పరిణామాలు సీఎం కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయని, ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలో ఆయనే నిర్ణయిస్తారని, ఇప్పటి నుంచే టికెట్ల కోసం పోటాపోటీ కార్యక్రమాలు ఎందుకంటు జగదీష్ రెడ్డి వారిని ఎప్పటికప్పుడు వారిస్తున్నారు. అయినా ఆశావహులు మాత్రం తమ కార్యక్రమాల్లో జోరు తగ్గించడం లేదు.

ఇప్పటికే బీఆర్ఎస్ టికెట్ ఆశించిన చకిలం అనిల్ కుమార్ పార్టీలో భవిష్యత్తు లేదనుకొని 22 ఏళ్ల బంధాన్ని తెంచేసుకుని వెళ్లిపోయారు. మిగిలిన చాడ, పిల్లి సహా అమిత్ రెడ్డిలు టికెట్ రేసులో కంచర్లకు పోటీగా కొనసాగుతున్నారు. వారు కంచర్లకు దీటుగా తమ ప్రచార కార్యక్రమాలు సాగిస్తుండగా రేసులో పిల్లి రామరాజు జనాలకు నిత్యం లక్ష వరకు ఆర్థిక సాయం చేస్తూ చాప కింద నీరులా బలం పెంచుకుంటున్నారు.

గుత్తా ట్రస్ట్ సేవలతో అమిత్ రెడ్డి, పార్టీ కార్యక్రమాలతో చాడ జనాదరణకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో కంచర్ల మరోసారి టికెట్ తధ్యం.. గెలుపు తధ్యమని ధీమాగా ఉన్నారు. పార్టీ టికెట్ సాధన దిశగా నలుగురు నాయకుల మధ్య సాగుతున్న నాలుగు స్తంభాలాటతో నియోజకవర్గ రాజకీయాలలో నెలకొన్న వర్గపోరు రాను రాను మరింత జఠిలంగా మారనుంది.